గోరఖ్‌పూర్‌లో మార్చి 27న ఒక ఐదేళ్ల చిన్నారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒక బొమ్మను బహుమతిగా ఇవ్వడం ఒక హృద్యమైన దృశ్యంగా ముద్ర పడిపోయింది. ముఖ్యమంత్రి ఆ బహుమతిని తిరిగి ఇచ్చి, ఆ పాపను చదువుపై దృష్టి పెట్టమని కోరారు.
ఒక రాజకీయ నాయకుడి పట్ల చిన్నారి తన అభిమానాన్ని చాటుకోవడం సాధారణ విషయమే. ఎందుకంటే నాయకులు యువతరానికి ఆదర్శంగా ఉండాలి. కానీ ఆ ఐదేళ్ల చిన్నారి ఎంచుకున్న బొమ్మ – ఒక ‘బుల్డోజర్’-కొన్ని అసౌకర్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ సంఘటన “బుల్డోజర్ న్యాయం” పేర రాజ్యం చేపట్టే చట్ట వ్యతిరేక, న్యాయేతర కార్యకలాపాలను సర్వ సాధారణమైన అంశంగా మలుచుతుంది. వివాదాస్పద రాజకీయ చిహ్నంగా ఉన్నది…ఇప్పుడు మన దైనందిన స్పృహలో భాగమై, పసి మనస్సులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ “బుల్డోజర్ న్యాయం”నమూనా కేవలం ‘చట్టపరమైన ప్రక్రియ’ భావనను తిరస్కరించడమే కాకుండా, దానిని నేరుగా సవాలు చేస్తుంది.
ఇది మొదటిసారి కాదు
“బుల్డోజర్ న్యాయం” అనేది ఇప్పుడు భారత రాజకీయ పరిభాషలో భాగమైనప్పటికీ, బుల్డోజర్లను ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగించడం కొత్తేమీ కాదు. 1976లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో, పాత ఢిల్లీలోని తుర్క్‌మన్ గేట్ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించడం, అనధికారిక గృహాలను కూల్చివేయడం పేరిట సాగిన అమానుష కాండలో బుల్డోజర్లను ఉపయోగించింది.
అయితే, అప్పటికి ఇప్పటికి ఇటువంటి చర్యలను ప్రజలు చూసే విధానంలో కీలకమైన మార్పు వచ్చింది. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఆ సంఘటనను త్రీవమైనదిగా పరిగణించి న్యాయ కమిషన్ విచారణ చేసిన స్థాయి నుండి, ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల రాజ్యం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి చిహ్నంగా బుల్డోజర్ ప్రక్రియను ప్రచారం చేస్తున్నారు. న్యాయ ప్రక్రియలు సంక్లిష్టంగా తయారయ్యాయి. తక్షణ ప్రతీకార న్యాయాన్ని అందించడంలో అడ్డంకిగా ఉన్నాయనే సగటు మనుషుల ఆలోచనా ధోరణుల మీద ఆధారపడి బుల్డోజర్ న్యాయానికి సమ్మతి సృష్టించబడుతున్నది. 10 నిమిషాల్లో డోర్ డెలివరీ జరిగే ఈ యుగంలో, ప్రభుత్వ అధికారులు కూడా అదే ఒత్తిడికి గురవుతున్నారు. న్యాయ ప్రక్రియకు నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడంతో, ఈ ఒత్తిడి మరింత పెరుగుతుందని కొందరు వాదిస్తున్నారు.
‘తక్షణ` న్యాయం కోసం ఒత్తిడి
భారతదేశంలోని అన్ని కోర్టులలో కలిపి పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 5.5 కోట్లు దాటింది. సుప్రీంకోర్టులోనే 90,000 కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం, ప్రతి 10 లక్షల మంది భారతీయులకు కేవలం 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. అయితే 1987 నాటి లా కమిషన్ సిఫార్సు ప్రకారం 50 మంది ఉండాలి.
25 రాష్ట్రాలలో 22 రాష్ట్రాల్లో, దిగువ కోర్టులలో మూడేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులు మొత్తం కేసులలో 25 శాతం ఉన్నాయి. 25 హైకోర్టులలో, ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులు 51 శాతంగా ఉన్నాయి.
నేర నిరూపణలో అలసత్వం, ఆలస్యం, దీర్ఘకాలిక న్యాయపోరాటం తరచుగా ప్రజలను నిరుత్సాహపరుస్తాయి. అందుకే సామాన్య పౌరులు త్వరితగతిన న్యాయం జరగాలని కోరుకుంటారు. ప్రభుత్వ అధికారులు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నప్పుడు, “తక్షణ న్యాయం” అందించాలనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది.
అయితే ఒక వ్యక్తి లేదా మెజారిటీ ప్రజలు కోరుకున్నది ప్రభుత్వ ఎంపిక కాకూడదు. చట్టబద్ధమైన పాలన ఉన్న ప్రజాస్వామ్య దేశంలో, ఆధిపత్య వాదనలకు చోటు లేదు. క్రిమినల్ న్యాయశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తిపై జరిగే ఏ నేరమైనా సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగానే పరిగణించబడుతుంది. ప్రభుత్వం చట్టానికి లోబడి మాత్రమే న్యాయాన్ని అందించాలి.
బుల్డోజర్ న్యాయంతో సమస్య
బుల్డోజర్ న్యాయంలోని అసలు సమస్య ఏమిటంటే, అది ‘ప్రక్రియ’ స్థానంలో ‘ప్రదర్శన’ను ప్రవేశపెడుతుంది. ‘నేరం’ జరిగిందని భావించిన వెంటనే, విచారణ పూర్తి కాకముందే జరిపే కూల్చివేతలు, శిక్షకు- న్యాయేతర చర్యకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపివేస్తాయి. ఇటువంటి సందర్భాల్లో, ప్రభుత్వమే ఒకే సమయంలో విచారణాధికారిగా, న్యాయమూర్తిగా, శిక్ష అమలు చేసే వ్యక్తిగా మారుతుంది. ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులనే బలహీనపరుస్తుంది.
తరచుగా విస్మరించే మరో అంశం ఉంది. ఒకవేళ మున్సిపల్ చట్టాల ఉల్లంఘన పేరుతో ఈ కూల్చివేతలు జరిగితే, అసలు అటువంటి నిర్మాణాలు జరగడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? ఒక అవినీతి వ్యవస్థ కళ్లెదుటే ఇటువంటి నిర్మాణాలు జరగడానికి అనుమతించారని అంగీకరించడమేనా? ఒకవేళ ఈ కూల్చివేతలు నేరాల పట్ల ‘జీరో టాలరెన్స్’ సందేశాన్ని ఇవ్వడానికే అయితే, అది చట్ట విరుద్ధం. ప్రభుత్వం తనకు తానుగా రక్షక దళాల (విజిలెంట్ గ్రూపుల) అవతారం ఎత్తకూడదు.
త్వరితగతిన జరిగే విధ్వంసం నిర్ణయాత్మక నాయకత్వం అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. కానీ ప్రజాగ్రహం వెల్లడైనప్పుడల్లా కార్యనిర్వాహక అధికారం చట్టపరమైన రక్షణలను అధిగమించవచ్చుననే భావనను ఇది బలపరుస్తుంది. కాలక్రమేణా, ఇది సంస్థాగత విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
వ్యవస్థలను బలోపేతం చేయండి
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలలో ఉన్న అసహనానికి అసలైన పరిష్కారం దాన్ని దాటవేయడం కాదు, దాన్ని బలోపేతం చేయడం. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం, ఖాళీలను భర్తీ చేయడం, మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విచారణ ప్రక్రియలను మెరుగుపరచడం ద్వారా ఆలస్యానికి గల కారణాలను పరిష్కరించవచ్చు. ఘోరమైన నేరాలకు సంబంధించిన కేసులను తప్పనిసరిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు అప్పగించాలి.
వేగంగా శిక్షలు వెయ్యడం ద్వారా ఒక రాజ్యాంగబద్ధమైన దేశానికి గుర్తింపు రాదు. సహజ న్యాయ సూత్రాల నిష్పాక్షిక అమలు ద్వారా వస్తుంది. “బుల్డోజర్ న్యాయం” తక్షణ ప్రతీకార వాంఛను తీర్చవచ్చు. కానీ అది చట్టబద్ధమైన పాలనను దెబ్బతీస్తుంది. రాజ్యాన్ని రక్షక దళంగా మార్చేస్తుంది.

‘హిందూ’ దినపత్రిక సౌజన్యంతో సందీప్ ఫుకాన్








కామెంట్‌లు (0)