దేశీయంగా వ్యవసాయాన్ని ఆధునీకరించకుండా, స్వల్ప స్థాయి ఉత్పత్తి నుండి భారీ స్థాయి ఉత్పత్తికి పరిణతి చెందకుండా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలతో కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్.టి.ఎ లు) దేశానికి మేలు చేకూర్చుతాయా?
నేడు భారతదేశ వాణిజ్య విధానాన్ని పట్టి పీడిస్తున్న మల్టీ బిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఒక్కటే! దేశీయ వ్యవసాయ సంస్కరణలు చేపట్టకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల మనకు ఒరిగేదేమీ ఉండదు. పైగా మన వ్యవసాయ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఇ లు)ను విదేశీ మార్కెట్ శక్తులకు తాకట్టు పెట్టడమే అవుతుంది.
న్యూజిలాండ్ (కివీస్ అని కూడా పిలుస్తారు) వంటి అత్యంత సమర్థవంతమైన, భారీ-స్థాయి ఉత్పత్తిదారులకు మన సరిహద్దులను తెరిచేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఒక వైపు చిన్న చిన్న భూ కమతాలను సాగు చేస్తున్న మన రైతులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ స్థితిలో న్యూజిలాండ్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహజంగానే మనకన్నా అవతలి పక్షానికే ఎక్కువ ప్రయోజనకరం.
భారీస్థాయిలో వ్యత్యాసాలు
న్యూజిలాండ్‌కు చెందిన ఒక పాడి రైతు పాలు పిండడానికి, పశువులకు అవసరమైన పచ్చిక బయళ్ల నిర్వహణకు అధునాతనమైన మిషన్లు, శాటిలైట్ డేటాను ఉపయోగించి సుమారు 160 హెక్టార్ల భూమిని, 400 ఆవులను నిర్వహిస్తాడు. దీనికి భిన్నంగా సగటు భారతీయ రైతు స్వయం చాకిరీతో 1.08 హెక్టార్ల భూమిని, 2-3 ఆవులను నిర్వహిస్తాడు. విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, సమిష్టి సాగు కోసం భూములను సమీకరించడం ద్వారా భారీగా ఉత్పత్తి పెంచే మార్గం గురించి ఆలోచించకుండా ఉత్పత్తి, ఉత్పాదకత, ధర విషయంలో విదేశాలతో మనం పోటీ పడలేం.
న్యూజిలాండ్ ఉత్పత్తి వ్యయం భారతదేశం కంటె తక్కువ. కాబట్టి సుంకాలు ఉన్నప్పటికీ మార్కెట్‌లో వారి ఉత్పత్తులు మన ఉత్పత్తుల కన్నా తక్కువ ధరకు లభ్యమవుతాయి. 2022లో న్యూజిలాండ్ లోని మొత్తం వ్యవసాయ క్షేత్రాల సంఖ్య 47,000 లోపే.
ఈ రకమైన భూ కేంద్రీకరణ వల్ల తక్కువ సంఖ్యలోనే అయినా చాలా పెద్ద కమతాలు చాలా రంగాల్లో ఏర్పడ్డాయి. న్యూజిలాండ్ వ్యవసాయ రంగం మొత్తం శ్రామిక శక్తిలో కేవలం 5.6 శాతం నుండి 6.6 శాతం మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండగా, భారత్‌లో 48 శాతం శ్రామిక శక్తి ఈ రంగంపై ఆధారపడి ఉంది. న్యూజిలాండ్‌లో వ్యవసాయం అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారింది. మన దేశంలో వ్యవసాయం ఒక జీవనాధారం.
ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే న్యూజిలాండ్ రైతులకు అధిక యాంత్రీకరణ అవశ్యం. కివీస్ వ్యవసాయ యంత్రాల మార్కెట్ కూడా పుంజుకుంది, 2025 నాటికి డెలివరీలు 10 శాతం పెరిగాయి. ప్రెసిషన్ టెక్నాలజీ ఆధారిత యాంత్రీకరణ ప్రాథమిక ట్రాక్టర్ల స్థాయిని దాటి, డ్రోన్లు, జిపిఎస్-మార్గదర్శక వ్యవస్థలు, నేల, పంట పర్యవేక్షణ కోసం సెన్సార్లను చేర్చింది. గ్రామీణ కార్మికుల కొరతను పూడ్చడానికి, నాట్లు వేయడం, కలుపు తీయడం దగ్గర నుంచి పంట నూర్పిడి దాకా సమస్త పనులకు ట్రాక్టర్లు, రోబోటిక్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
వ్యవసాయ రంగంలో భారత్, న్యూజిలాండ్‌లను పోల్చి చూస్తే, కొన్ని తీవ్రమైన తేడాలను గమనించవచ్చు. భారత్ లక్షలాది మంది చిన్న రైతులతో భారీ స్థాయిలో పనిచేస్తుండగా, న్యూజిలాండ్ వనరులు వృథా కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి, పారిశ్రామికీకరించబడిన ఎగుమతి-ఆధారిత నమూనాలో పనిచేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అత్యంత సున్నితమైన అంశం, ప్రధానంగా ఈ నిర్మాణాత్మక వ్యత్యాసాల కారణంగానే. భారతదేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది పాడి రైతులు ఉన్న పాడి రంగాన్ని ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుండి మినహాయించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రతిఘటన వస్తుందోనన్న భయం కూడా ఇందుకు ఒక కారణం. ఏదేమైనా, భారత వ్యవసాయాన్ని ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు దాసోహం చేయడమే లక్ష్యంగా ఉన్న భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తిప్పికొట్టేందుకు అన్ని రంగాల రైతులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరమెంతైనా ఉంది. గతంలో జరిగిన భారత్-అమెరికా, భారత్-ఇ.యు వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే, ఈ ఒప్పందం కూడా దేశద్రోహ మోడీ ప్రభుత్వ బండారాన్ని బయటపెడుతోంది.
భారత్‌లో యాపిల్ రైతులపై తీవ్ర ప్రభావం
2026 ఏప్రిల్ 27న సంతకం చేసిన భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా, న్యూజిలాండ్ తన ప్రీమియం ఉత్పత్తులకు, ముఖ్యంగా ఉన్నత శ్రేణి పండ్లు, మాంసం, మద్యానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మార్కెట్‌ను వశపరచుకుంది. న్యూజిలాండ్ యాపిళ్లపై సుంకాన్ని 50 శాతం నుండి 25 శాతానికి భారత్ తగ్గించడంపై హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ లోని యాపిల్ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస దిగుమతి ధర కిలోకు 1.25 డాలర్లు కాగా, ప్రస్తుత కరెన్సీ రేటు ప్రకారం ధర రూ.119గా ఉంటుంది. 25 శాతం సుంకంతో న్యూజిలాండ్ యాపిల్ భారత హోల్‌సేల్ మార్కెట్‌లోకి రూ.148.75 నికర ధరతో వస్తుంది.
అలాగే, న్యూజిలాండ్ నుంచి దిగుమతి అయ్యే కివీ పండ్లపై 33 శాతంగా ఉన్న సుంకాన్ని 0 శాతానికి తగ్గించారు. దీనివల్ల అరుణాచల్ ప్రదేశ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా పండించే ఈ కివీ పంట రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. అలాగే మనూకా తేనెపై 66 శాతంగా ఉన్న సుంకాన్ని 5 సంవత్సరాల వ్యవధిలో 16.5 శాతానికి తగ్గించారు.
యాపిల్ ఉత్పాదకత విషయానికొస్తే భారతదేశంలో హెక్టారుకు 7 నుండి 9 మెట్రిక్ టన్నులు ఉండగా, న్యూజిలాండ్‌లో దీనికి 6, 8 రెట్లు ఎక్కువ. అంటే హెక్టారుకు 50 నుండి 70 మెట్రిక్ టన్నులు.
న్యూజిలాండ్‌లో సగటు వ్యవసాయ క్షేత్ర పరిమాణం 50 హెక్టార్లకు పైగా ఉంటుంది. అక్కడ కేవలం 1,200 నుండి 1,500 వ్యవసాయ క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి, ఇవి ఏటా 5,65,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలో 15వ స్థానంలో ఉన్నాయి, దాదాపు ఉత్పత్తి అంతా ఎగుమతి అవుతుంది.
న్యూజిలాండ్‌లో వ్యవసాయం అనేది భారీ యాంత్రీకరణ, అధునాతన నాట్లు వేసే పద్ధతులు, పటిష్టమైన సరఫరా గొలుసు నిర్వహణ, కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌లతో కూడిన ఒక పెద్ద పరిశ్రమ. అందువల్ల, భారతీయ యాపిల్ రైతులతో పోలిస్తే న్యూజిలాండ్‌లో ఉత్పత్తి వ్యయం చాలా తక్కువగా ఉంటుంది.
భారతదేశంలో, సగటు వ్యవసాయ క్షేత్ర పరిమాణం 1-2 ఎకరాల భూమి, ఉత్పత్తి 25 లక్షల మెట్రిక్ టన్నులు. ప్రపంచంలో అయిదో స్థానం. ఇందులో 97-98 శాతం భారతీయ పండ్లు దేశీయ మార్కెట్లలోనే అమ్ముడవుతాయి. 25 శాతం సుంకం తగ్గింపుతో న్యూజిలాండ్ యాపిళ్ల ప్రవేశం భారతదేశంలోని యాపిల్ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. దేశీయ వినియోగదారుల మార్కెట్‌లో ధరపై ప్రభావం చూపడం ఒక సమస్య అయితే, అంతకన్నా ముఖ్యమైన మౌలిక సమస్య ఉత్పత్తి, సరఫరా మధ్య ఉన్న సంబంధం తెగిపోవడం. భారత్‌లో రైతులు తక్కువ ఉత్పాదకతతో కూడిన ఉత్పత్తిదారులు కావడం వల్ల వారు తమ పంటను పెద్ద వర్తకులకు లేదా దళారీలకు ఎంతకో కొంతకు అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది.
దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్‌కు చెందిన యాపిల్ రైతులను ఆదుకోవాల్సిన మోడీ ప్రభుత్వం ఆ పని చేయడానికి బదులు అంతర్జాతీయ బడా కార్పొరేట్ వ్యాపార శక్తులకు దండిగా లాభాలు ఆర్జించి పెట్టడం కోసం రైతులను మరింత దోపిడీకి గురి చేస్తోంది. అతి విస్తారమైన దేశీయ మార్కెట్‌ను న్యూజిలాండ్‌కు దాసోహం చేస్తోంది. అత్యంత పారిశ్రామికీకరణ చెందిన, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ రైతులకు లబ్ధి చేకూర్చడం కోసం సుంకాలు తగ్గించి దేశీయ మార్కెట్‌ను వారికి బార్లా తెరుస్తోంది.
కార్పొరేట్లకు భారీగా లబ్ధి, రైతులకు పెను విపత్తు
భారత్- న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్.టి.ఎ)లో భాగంగా వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 2వేల కోట్ల డాలర్లు (రూ.1,90,800 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ పెట్టుబడుల్లో మాన్యుఫాక్చరింగ్, మౌలిక సదుపాయాల రంగాలకు కొంత కేటాయించినా, గణనీయమైన భాగం వ్యవసాయ, ఆహార శుద్ధి రంగాల్లో పెడతారు. వ్యవసాయ రంగంలో ఇటువంటి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, ఉత్పత్తి, శుద్ధి, మార్కెటింగ్‌లో విదేశీ సంస్థల ఆధిపత్యం చెలాయించడానికి వీలు కల్పిస్తాయి, ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ప్రమాదకరం.
ఆధునిక కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక యంత్రాలు, నాటే సామగ్రి, వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి సరిహద్దు రాష్ట్రాలలో యాపిల్ ఆర్థిక వ్యవస్థపై బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు ఆధిపత్యం చెలాయించడానికి వీలు కల్పిస్తున్నాయి. ఇది భారతదేశ భద్రతకు కూడా ముప్పు తెస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి, దీనిపై పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభలలో కూడా చర్చించాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వర్గ ఉద్యమాలు దీనిని తీవ్రంగా పరిగణించి, భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.
కార్పొరేట్ ఇండియా ప్రపంచ వాణిజ్య వ్యవస్థతో మమేకం కావాలని, పెట్టుబడులు పెట్టాలని, ప్రపంచ వాణిజ్యం నుండి భారీగా లాభాలను ఆర్జించాలని కోరుకుంటోంది. భారతదేశంలోని కార్పొరేట్ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీగా, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి ఆ వర్గానికి ప్రయోజనం చేకూర్చడం కోసం రైతులు, కార్మికులు, చిన్న, మధ్య తరహా తయారీ సంస్థలు, యావత్ శ్రామిక జనావళి ప్రయోజనాలను పణంగా పెడుతోంది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లక్ష్యం భారతదేశం, ఇక్కడి ప్రజల ప్రయోజనాల కన్నా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రస్తుతం వ్యవస్థాగత సంక్షోభం నుండి బయటపడటానికి తంటాలు పడుతున్న అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల ప్రయోజనాలను కాపాడటానికే ఎక్కువగా ఉద్దేశించబడ్డాయి.
అందువల్ల, కార్మికులను, కర్షకులను ఏకతాటి పైకి తీసుకువచ్చి, వారి మధ్య ఒక బలమైన కూటమిని నిర్మించడం ద్వారా భారతదేశ ప్రయోజనాలకు హాని కలిగించే ఇటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ప్రతిఘటించేందుకు బలమైన ఉద్యమం అవసరం. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, తద్వారా భారత్-న్యూజిలాండ్ ఎఫ్.టి.ఎ రద్దయ్యేలా చూసేందుకు ఆలిండియా కిసాన్ సభ (ఎ.ఐ.కె.ఎస్), యాపిల్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎ.ఎఫ్.ఎఫ్.ఐ ) కట్టుబడి ఉన్నాయి.

రచయిత-ఎ.ఐ.కె.ఎస్ జాతీయ ఆర్థిక కార్యదర్శి పి. కృష్ణప్రసాద్








కామెంట్‌లు (0)