ముఖ్యమంత్రి ప్రకటనతో తెగ మురిసిపోయారు సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు. ఏక పుత్ర వ్రతుడైతేనేమీ, సమాజ ప్రయోజనాల కోసం ఆయన విజన్ అద్భుతమని, ఆయన చైల్డ్ విజన్ మరింత సక్సెస్ కావడానికి మరికొన్ని సూచనలు, సలహాలతో విజయవాడలో వారు ఒక సదస్సు నిర్వహించారు. ఇటు సైన్స్, అటు సనాతన వాద ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ఉత్తర భారతదేశం నుంచి ఒక పీఠాధిపతి వచ్చారు. తెలుగు సిద్ధాంతులను, ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి నిపుణులను కూడా ఆహ్వానించారు. వాటిలో ఒకటి, కసింకోట సిద్ధాంతి కూడా వచ్చింది. ఆయన పరదేశి నాయుడు కి ఫోన్ చేసి అమ్మగారిని కూడా తీసుకొని వెళ్దాం అని అన్నాడు. ఎందుకంటే, అక్కడైనా ఒక పరిష్కారం దొరకక పోతుందా! అనే ఆశ. నాయుడు దంపతులకు సంతానం లేదు. పూజలు, వ్రతాలు, హోమాలు వంటివి సంతాన భాగ్యం కలిగిస్తాయని ఆమె నమ్మకం. ఐవిఎఫ్, ఐవిఐ, సరోగసీలు, దత్తతలను ఎంత నచ్చజెప్పినా ససేమిరా, ఆమె ఒప్పుకోవడం లేదు. పరదేశి కూడా బయలుదేరాడు.దారిలో కాలక్షేపానికి పేరడీ పాటలతో అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు. ” ముగ్గురైతే ముప్పయి వేలు.. నలుగురైతే నలబై వేలు..బుల్లోడా!”
” చాల్లే ఆపేయరా!”- చిరాకుపడ్డాడు నాయుడు. ” సిద్ధాంతి గారు ఈ సంతాన యోగాలు గురించి మీరు ఏమైనా చెప్పండి.” కోరాడు.
” ఈ ఇంగ్లీష్ వైద్యాలు గొప్పవే కావచ్చు. కానీ, రకరకాల టెస్టులు చేయించి, ఆ రిపోర్టులు ఎదురుగా పెట్టుకుని గొప్ప డాక్టర్లు అనుకునే వారు కూడా, రోగమేంటో కనిపెట్టి, వైద్యం చేస్తారు. ఆయుర్వేదంలో అలా కాదు. మా తాతగారు కేవలం నాడి పట్టుకుని రోగం కనిపెట్టేసేవారు. ఇప్పుడంతా వైద్యం పేరుతో దోపిడీ.”
” నిజమే అయ్యగారూ! ఆ మధ్య వొయిజాగు వెళ్తే, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ల లాంటి ఖరీదైన హాస్పిటళ్లే! కొందరిని పరామర్శించడానికి వెళ్లాను. ఫీజులు, టెస్టుల పేరుతో పిండేస్తున్నారని, భరించలేకపోతున్నామని గోలబెట్టారు. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయడం లేదు.. అన్యాయం. చిన్నప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని చదువుకున్నాం. ఇప్పుడు, మన అనారోగ్యమే హాస్పిటల్స్ కి మహాభాగ్యమని అర్థమైంది”
” మరి, ఒకపక్క పిల్లల్ని కనీమంటున్నాడు మన పెద్ద బాబు. కనకముందు తొమ్మిది నెలలు ఆయమ్మ బాగోగులు ఎవులు చూస్తారు? కనీసీన తరువాత 30- 40 వేలతో పెంపకం జరిగిపోద్దేటి! ఆ తర్వాత ఆల బతుకేటి! ”
” చూడాలి మరి! బెజవాడ మేధావులు ఏం మాట్లాడతారో!”– ఇలాగ మాట్లాడుకుంటూ, కొన్ని గంటల్లోనే విజయవాడ చేరారు. సంతాన సాఫల్య కేంద్రాలతో బాగా సంపాదిస్తున్నారు కాబట్టి, ఏర్పాట్లు బాగానే చేశారు. స్వాగత ద్వారం మీద ‘దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు’-అని రాసి, పెద్ద కటౌట్ ఒకటి నిలబెట్టారు. అందమైన పసిపిల్లల నవ్వు మొహాలతో ఫ్లెక్సీలు వేశారు. సదస్సు ప్రారంభమై, స్వాగత మర్యాదలు పూర్తయిన తర్వాత, సభాధ్యక్షుని ఆహ్వానం మేరకు ఉత్తర దేశ సంతాన గోపాల పీఠాధిపతి స్వామి బ్రహ్మచారి తీర్థులవారు ప్రసంగం ప్రారంభించారు.
” అన్య మతాల జనాభా అనూహ్యంగా పెరిగిపోతుంది. మన మత జనాభా, పూర్వ సంస్కృతిని మరిచిపోయి, ఆధునికత మోజులో సంతానాన్ని తగ్గించుకుంటుంది. ఇది భవిష్యత్తులో పెద్ద విపత్తుకు దారి తీసే అవకాశం ఉంది. కొత్త తరాలకు మన పురాణ సంస్కృతి అర్థం కావడం లేదు. ఆధునికత మోజులో, మన దేశానికి జవజీవాలు యువతరమే. చైనా, జపాన్ వంటి దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. అదనపు సంతానాల కోసం అక్కడి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. ప్రపంచంలో మన జనాభా అత్యధికంగా ఉన్నా, ఇది భవిష్యత్తు అవసరాలకు సరిపోదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ప్రకటన ఇక్కడ చంద్రబాబు చేశారు. అతడు విజన్ ఉన్న నాయకుడు. అతనికి హృదయపూర్వక ఆశీస్సులు.”
తమిళనాడు నుంచి వచ్చిన మరో పీఠాధిపతి స్వామి మాట్లాడుతూ, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే సంతాన గోపాలుడు. అష్టలక్ష్ముల్లో అమ్మవారి ఒక అవతారం సంతాన లక్ష్మి. అందుకే, సనాతన అభిమానులంతా ఈ సత్యాన్ని గమనించి, అదనపు సంతానోత్పత్తికి కృషి చేయాలి. మా వీరన్ కొట్టైలో సంతాన గణపతి ఆలయం ఉంది. దంపతులు అక్కడ ప్రత్యేక పూజలు చేసుకుంటే ఫలితం లభిస్తుంది. చిత్తూరు జిల్లాలో కూడా పుత్తూరు దగ్గర, ద్రౌపదీ సమేత ధర్మరాజు ఆలయం ఉంది. అక్కడ కూడా సంతానయోగం ప్రసాదించే మహిమ ఉంది. రావలసినవారు మా పీఠాన్ని సంప్రదిస్తే, దర్శన ఏర్పాట్లు చేయిస్తాం.”
మరి కొందరు మాట్లాడిన తర్వాత, కసింకోట సిద్ధాంతికి అవకాశం వచ్చింది.” పెద్దలు, పండితులు గొప్ప విషయాలు చెప్పారు. మన రాష్ట్రంలోనూ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సంతాన సిద్ధికి పేరు పొందింది. నాగ బంధాల పూజ, నాగేంద్ర ఆరాధన మన పురాణ సంస్కృతిలో భాగం. టిటిడి ద్వారా, సంతాన గోపాల స్వామి ఆలయాల నిర్మాణం పెద్ద ఎత్తున జరగాలి. అన్ని ఆలయాల్లోనూ యంత్ర ప్రతిష్టలు, హోమాలు, యోగాలు జరగాలి. సంతాన యోగం ప్రసాదించే ఆలయాలకు వెళ్లే దంపతులకు ఉచిత బస్సు సదుపాయం కల్పించాలి. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఈ జ్ఞానమంతా పాఠ్యాంశాలుగా చేర్చాలి.”
సదస్సులో పల్చగా హర్షధ్వానాలు.. నాయుడు గారి దంపతుల్లో ఆనందం విరిసింది.
తమ ఉద్దేశం పక్కదారి పడుతుందని సాఫల్య కేంద్రాల వైద్య నిపుణులు గుసగుసలాడుకున్నారు. ఒక సీనియర్ డాక్టర్ చొరవ తీసుకొని మాట్లాడారు.” ముఖ్యమంత్రి ఆశయాన్ని సక్సెస్ చేయడానికి మా సాఫల్య కేంద్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అందుకే ఈ సదస్సు. సాఫల్య కేంద్రాల అభివృద్ధికి, కొత్త కేంద్రాల స్థాపనకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలుకు సబ్సిడీలు ఇవ్వాలి. కరెంటు చార్జీలు మాఫీ చేయాలి. 99 పైసలకు కాకపోయినా, కనీసం రెండు రూపాయలకు ఎకరా భూమి ఇస్తే మా కృషిని మరింత ముందుకు తీసుకువెళ్తాం.”
కసింకోట సిద్ధాంతి మరోసారి లేచి,” సైన్స్ ను మేము గౌరవిస్తాం. అయితే, మీ జ్ఞానాన్ని పురాణ జ్ఞానంతో సమన్వయం చేసుకోవాలి. ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్రోణాచార్యుల వారు. వారు కుండలో జన్మించారు. మన వశిష్టుల వారు, అగస్త్యుల వారు కూడా కుండల్లో జన్మించిన వారే!”
సదస్సులో సైన్స్ దృక్పథంతో ఉన్నవారు చప్పట్లు కొట్టలేదు. సదస్సు ముగిసిన తర్వాత, ఒక వృద్ధ వైద్య నిపుణులు, మరొక నిపుణునితో కలిసి బయటకు నడుస్తూ, ” ఎక్కడ సైన్స్ అంతమవుతుందో, అక్కడ ఫిలాసఫీ ప్రారంభమవుతుందని, ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు. నీకైనా గుర్తుందా!?” – అడిగారు.
” డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుల వారు అనుకుంటా! నాకు సరిగా గుర్తులేదు.”
” ఈ సదస్సు తర్వాత నీకు ఏమనిపిస్తుందో గానీ, మత మౌఢ్యం తన్నుకొచ్చిన చోట, పురాణాల పేరుతో పరాన్నభుక్కుల ప్రాబల్యం పెరిగిపోతుంది.”
” తెలివైన చంద్రబాబు ఎందుకు ఇలా నోరు జారాడంటావు!”
” ఏముంది! యథా ఆర్ఎస్ఎస్- బిజెపి- సనాతన వాదం! దాన్ని సంతోష పెట్టడమే ప్రస్తుతం ఆయన విజన్!”.
– ‘ నల్లి ‘ కుట్టు








కామెంట్‌లు (0)