test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎమర్జెన్సీనే ఎదిరించి నిలిచాం ఇటువంటి దాడులకు భయపడం

30 మే, 2026

cpm kerala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కేరళంలో ప్రభుత్వం మారి దాదాపు రెండు వారాలయింది. ఈ కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం పనితీరును అంచనా వేయడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. అయినప్పటికీ, వడస్సేరి దామోదర మీనన్‌ సతీషన్‌ ప్రభుత్వ భవిష్యత్‌ పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి స్పష్టమైన సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. వాటిని ఈ కింది విధంగా సంగ్రహించవచ్చు. అన్నిటికన్నా ముందుగా, రాష్ట్రంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. అలాగే, ఎన్నికల కాలమంతా బిజెపితో సిపిఐ(ఎం) ఒప్పందం చేసుకుందని ఆరోపించిన కాంగ్రెస్‌ నాయకత్వం, వాస్తవానికి తానే బిజెపితో ఒక ఒప్పందానికి వచ్చిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
బుధవారం సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్‌కు చెందిన కన్నూర్‌లోని ఇంటిపైన, తిరువనంతపురంలోని ఆయన అద్దె ఇంటిపైన, కొజికోడ్‌లోని మాజీ మంత్రి మహమ్మద్‌ రియాజ్‌ ఇంటిపైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇ.డి) జరిపిన దాడులు ఈ అపవిత్ర పొత్తులో భాగమే. అంతకుముందు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్‌ కేజ్రీవాల్‌, సిసోడియాలపై ఇ.డి జరిపిన దాడులకు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ ప్రసంగిస్తూ , కేజ్రీవాల్‌, శిబు సోరెన్‌ల మాదిరే పినరయి విజయన్‌ను ఇ.డి ఎందుకు ప్రశ్నించదు, జైలులో పెట్టదు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులను తప్పుడు కేసులలో ఇరికించడానికి, ప్రతిపక్ష రహిత భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వం సాగిస్తున్న కుట్రలు కుతంత్రాల్లో ఇ.డి ని ఒక అస్త్రంగా వాడుకుంటోంది. ఈ తప్పుడు చర్యను కాంగ్రెస్‌ నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తోంది. అందుకే, మొన్న జరిగిన సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం ఇతర ప్రతిపక్ష పార్టీల పట్ల కాంగ్రెస్‌ చూపుతున్న శత్రు వైఖరి ప్రతిపక్ష ఐక్యతకు ఆటంకం కలిగిస్తోందన్న అంచనాకు వచ్చింది. బిజెపి నిరంకుశ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సహాయపడుతున్నప్పుడు, అది కార్పొరేట్‌ హిందుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పోరాడగలదన్న ప్రశ్నను సిపిఐ(ఎం) లేవనెత్తింది.

పరియాతుకావును రక్షించాలి
ఎర్నాకుళం జిల్లాలోని పరియాతుకావు ఉన్నాతిలో ఎనిమిది ఎస్సీ కుటుంబాలపై పోలీసులు జరిపిన దాడి, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానంలోని అసలు రంగును బయటపెట్టింది. నేను ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, పోలీసులు పిల్లలను, మహిళలను, రోగులను, వృద్ధులను కొట్టారని అక్కడి నిరుపేదలు భోరున ఏడ్చారు. ఎ.కె.ఆంటోనీ హయాంలో ముత్తంగాలో అయిదుగురిని కాల్చి చంపిన దాడిని పరియతుకావులోని ఈ ఘటన గుర్తుచేస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించకుండా అక్కడ నుండి వెళ్ళగొట్టాలని కొత్త ప్రభుత్వం చూస్తోంది. దీనిని బట్టి వారు ఎవరికి సేవ చేస్తున్నారో స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో పేదలకు అండగా సిపిఐ(ఎం), ప్రజలు ముందుకొచ్చారు. నిబంధనల ప్రకారం భూమిని కొలవడం, సరిహద్దులను నిర్ధారించడం, వారికి హక్కు పత్రాలు ఇవ్వడం వంటి సర్వే ప్రక్రియ ప్రారంభమైన సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో, కొత్త ప్రభుత్వం ఈ నిరుపేదలను విస్మరించడమే కాకుండా, వారిని దారుణంగా కొట్టింది. దీని ద్వారా యుడిఎఫ్‌ ప్రభుత్వం పేద, భూమి లేని ప్రజలతో కాకుండా, భూ మాఫియా, ధనవంతుల పక్షాన ఉంటుందనే సందేశాన్ని ఇచ్చినట్లైంది.

'లైఫ్‌' ప్రాజెక్టు ఉసురు తీస్తున్నారు
'లైఫ్‌' ప్రాజెక్టు ఉసురు తీయాలన్న నిర్ణయాన్ని ఈ విధానానికి కొనసాగింపుగానే చూడాలి. 2017లో పినరయి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఐదు లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. లక్షకు పైగా ఇళ్లు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఇప్పుడీ పథకాన్ని పక్కన పెట్టడమంటే పేదలను క్రూరంగా పరిహసించడమే. 'లైఫ్‌' ప్రాజెక్టును ప్రభుత్వ ప్రత్యేక బాధ్యతగా తీసుకోకుండా, స్థానిక సంస్థలపై నింద వేసి, వాటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణానికి తిలోదకాలివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి, ఇతరుల ప్రకటనల ద్వారా స్పష్టమవుతోంది. సొంత ఇల్లు లేని వారి వివరాల సేకరణను నిలిపేసింది. దీనికి తోడు 2023 భూ నమోదు చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ఇది పేదలకు తోడ్పడడానికి కాదు, భూ కబ్జాదారులకు, అక్రమంగా రిసార్ట్‌లు, హోటళ్లు నిర్మించిన వారిని రక్షించడానికే. దీనంతటిని బట్టి చూస్తే, యుడిఎఫ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన సంకేతాలు వారు దళితులకు, భూమి లేని వారికి, నిరాశ్రయులకు వ్యతిరేకమని స్పష్టం చేస్తున్నాయి.
ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడే యుడిఎఫ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపులకు దిగింది. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయక ముందే రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. ఉద్యోగుల బదిలీలనే అసాధారణ ప్రక్రియ కూడా మితవాద యూనియన్ల లెటర్‌ ప్యాడ్‌పైనే జరిగింది. కేరళ యూనివర్సిటీ యూనియన్‌ ఎన్నికల్లో గెలిచిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల విజయోత్సవంపై దాడి చేసిన కెఎస్‌యు సభ్యులను అడ్డుకోవడానికి బదులుగా, పోలీసులు ఆ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను దారుణంగా కొట్టి, వారిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు ప్రయాణిస్తున్న వాహనంపై దాడికి యత్నించినవారిని అడ్డుకున్న పోలీసు అధికారులపై చర్య తీసుకోవడం యుడిఎఫ్‌ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుకు తాజా ఉదాహరణ.
వామపక్షాలను నాశనం చేయడం ద్వారా మాత్రమే కేరళంలో పాతుకుపోగలమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి మతతత్వ శక్తులకు బాగా తెలుసు. ఇక్కడ వామపక్షాలు బలంగా ఉండటం వల్లే కేరళ లౌకికవాదానికి కంచుకోటగా నిలిచింది. సిపిఐ(ఎం), ఎల్‌డిఎఫ్‌ లను ఒంటరిగా ఓడించలేనందున, వాటిని నాశనం చేయడానికి హిందుత్వ మతోన్మాదం, మృదు హిందుత్వ శక్తులతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతోంది. దేశంలో మృదు హిందూత్వకు ఒక ప్రత్యేక చిహ్నంగా కాంగ్రెస్‌ ఉంది. హిందూత్వ మతతత్వ శక్తులు వ్యూహాత్మకంగా వారికి అధికారంలోకి రావడానికి సహాయం చేస్తూ, కొత్త ప్రభుత్వం ద్వారా తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నాయనే అనుమానాలను ఈ చర్యలు రేకెత్తిస్తున్నాయి.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొన్ని గంటల ముందు అద్వె విమానంలో మంగళూరు వెళ్లిన వి.డి.సతీషన్‌, ఎన్డీయే నాయకులను, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ను కలవడం, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పూర్తి వందేమాతరం పాడటానికి అనుమతించడం, మాజీ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ న్యాయ సలహాదారుడిని అడ్వకేట్‌ జనరల్‌గా నియమించడం వంటి చర్యలు ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తున్నాయి. లక్షలాది మలయాళీలకు ఓట్లను నిరాకరించి, ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌పై బిజెపి ముద్రను సమర్థించిన ప్రధాన ఎన్నికల అధికారి రతన్‌ కేల్కర్‌ను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించడం కాంగ్రెస్‌, బిజెపిల మధ్య జరిగిన ఒప్పందంలో భాగమేనని ఎవరైనా ఆక్షేపిస్తే, వారిని ఎలా తప్పుపట్టగలం.

అమలు చేస్తున్నది రాహుల్‌ డిమాండే
ఏది ఏమైనప్పటికీ, కేరళంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో, రాహుల్‌ డిమాండ్‌ను అక్షరాలా అమలు చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి సతీషన్‌ మోడీతో సమావేశమైన 24 గంటల్లోపే పినరయి ఇంటిపై దాడి జరిగింది. పినరయి విజయన్‌ కుమార్తె సంస్థ సేవలకు చెల్లించిన అదే కంపెనీ నుండి డబ్బు తీసుకున్నట్లు వి.డి.సతతీషన్ క్కాబినెట్‌లోని ఇద్దరు వ్యక్తులను అదే కంపెనీ ధ్రువీకరించింది. వారిపై చర్య తీసుకోకుండా పినరయిని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ ప్రేరేపితం తప్ప మరేమీ కాదు. దీంతోపాటు కాంగ్రెస్‌, బిజెపిల మధ్య అంతర్లీనంగా సాగుతున్న బంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు.
ఇ.డి కి భయపడి, చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు ఈ మధ్య బిజెపిలో చేరారు. వారిలో కొందరు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే, ఆ విధంగా సిపిఐ(ఎం)ను అవమానించవచ్చని ఎవరైనా అనుకుంటే, వారు పొరపడినట్లే. ఇది ఎమర్జెన్సీ వంటి పరిస్థితులను తట్టుకుని పెరిగిన ఉద్యమం. మాపై జరిగిన ప్రతి దాడి మాకు మరింత బలాన్నే ఇచ్చింది. ఆ బలం బుధవారం కేరళ, ఢిల్లీ వీధుల్లో స్పష్టంగా కనిపించింది. ఢిల్లీలో సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీతో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. ప్రజలను సమీకరించడం ద్వారా సిపిఐ(ఎం), వామపక్షాలు ఈ దాడిని తట్టుకుని నిలబడతాయి.

 

kerala
రచయిత : ఎం.వి. గోవిందన్‌ మాస్టర్‌

సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్