test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై వీడని అనిశ్చితి

12 మే, 2026

Cong high command seeks wider consultations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 12, 2026, 01:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై అనిశ్చితి కొనసాగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం దాటినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత వెలువడకపోవడం గమనార్హం. తాజాగా ముఖ్యమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం మాజీ కెపిసిసి అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లను ఢిల్లీకి పిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచిన నేతల్లో రాష్ట్రానికి చెందిన మాజీ కెపిసిసి అధ్యక్షుడు వి.ఎం.సుధీరన్, ముళ్లపల్లి రామచంద్రన్, కె.మురళీధరన్, కె.సుధాకరన్, ఎం.ఎం.హసన్ లు ఉన్నారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే తిరువంచూర్ రాధాకృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు పి.సి.విష్ణునాథ్, షఫీ పరంబిల్, ఎ.పి.అనిల్ కుమార్ లను కూడా ఢిల్లీ రావాలని కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. మంగళవారం వారితో చర్చలు జరగనున్నాయని, త్వరలో నే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వెల్లడించాయి. ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, వి.డి.సతీశన్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్ ) కె.సి. వేణుగోపాల్ లు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.

మాజీ కెపిసిసి అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకోవాలన్న హైకమాండ్ నిర్ణయం, సతీశన్ వర్గంలో ఆశలు రేకెత్తించినట్లు సమాచారం. సతీశన్ కు యుడిఎఫ్ కీలక మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్ )మద్దతు సహా క్షేత్రస్థాయిలో బలమైన మద్దతు ఉంది. ఐయుఎంఎల్ తీసుకుంటున్న వైఖరి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోందని సతీశన్ వర్గం వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఇద్దరు మాజీ కెపిసిసి అధ్యక్షులు సుధీరన్, మురళీధరన్ లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కు సిఎం పదవి ఇస్తే.. యుడిఎఫ్ రెండు ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరు వర్గాలు వాదిస్తున్నాయి. ఒకటి ఆయనను అసెంబ్లీకి ఎన్నుకునేందుకు, రెండవది ప్రస్తుతం వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అలప్పుజ లోక్ సభ స్థానానికి కొత్త ఎంపిని ఎన్నుకోవాల్సి వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో అది చాలా ప్రమాదకరమని ఆ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఢిల్లీకి పిలిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు వేణుగోపాల్ వర్గానికి చెందిన వారని భావిస్తున్నారు. వేణుగోపాల్ కి చాలామంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఒక వేళ ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే.. యుడిఎఫ్ కి విజయాన్ని అందించగలరని ఆయన వర్గం వాదిస్తోంది.

మరోవైపు కష్ట సమయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి అండగా నిలిచిన అత్యంత సీనియర్ నేత చెన్నితాలకు సిఎం పదవి కట్టబెట్టాలని ఆయన వర్గం వాదిస్తోంది. ఎన్ ఎస్ యు (ఐ), యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలంలో పలువురు నేతలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టారని ఆ వర్గం వాదిస్తోంది. ఈ సారి సీనియర్ నేతకి అవకాశం ఇవ్వాలని, లేదంటే ఆయనకు అన్యాయం చేయడమే అవుతుందని వాదిస్తున్నారు.

ఇప్పటికే పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ లు రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత వెలువడలేదు. కాంగ్రెస్ హైకమాండ్ విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. ముగ్గురు ప్రధాన అభ్యర్థులతో పాటు కెపిసిసి అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ తో హైకమాండ్ చర్చలు జరిపింది.

మరోవైపు 63 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు — మొత్తం 66 మంది సభ్యుల మద్దతును ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని బిజెపి విమర్శించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్