తిరువనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యుడు , కేరళం ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహిస్తున్న సోదాలకు వ్యతిరేకంగా కేరళతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహిస్తూ పార్టీ శ్రేణులు, ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కన్నూర్‌లోని పినరయి విజయన్ కుటుంబ నివాసం, తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్లో ఉన్న ఆయన అద్దె ఇంటి ముందు సిపిఎం నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. తిరువనంతపురంలో జరిగిన ఆందోళనలో సిపిఎం కేరళం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిదన్, వి.శివన్కుట్టి, జాన్ బ్రిట్టాస్, వి. జాయ్, అనవూర్ నాగప్పన్, వి.కె. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కన్నూర్‌లో జరిగిన నిరసనలో ఎం.వి. జయరాజన్, పి. జయరాజన్, కె.కె. రాజేష్, కె.కె. శైలజ తదితరులు పాల్గొన్నారు. కోజికోడ్ జిల్లాలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ… ఈడీ సోదాలు పార్టీపై, పినరయి విజయన్‌పై జరిగిన “హేయమైన రాజకీయ దాడి”గా పేర్కొన్నారు. ఈ చర్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను ప్రజల ముందు బట్టబయలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ మాట్లాడుతూ, పినరయి విజయన్‌కు ఎక్సాలాజిక్ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేదని కోర్టులు ఇప్పటికే పేర్కొన్నప్పటికీ, రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.








కామెంట్లు (0)