న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 12 ఏళ్లుగా ప్రధాని మోడీ విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని, దీంతో ఒక తరం యువత మొత్తం భారీ స్థాయిలో మూల్యం చెల్లించాల్సి వస్తోందని మండిపడ్డారు. నీట్-యుజి పరీక్షలో అవకతవకలు జరిగినట్లు వార్తలు రావడంతో మధ్యప్రదేశ్ లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆకాంక్ష డాక్టర్ కావాలని, దేశానికి, సమాజానికి సేవ చేయాలని కలలు కనింది. ఆమె తండ్రి ఒక రైతు, తన కుమార్తె కలను నెరవేర్చేందుకు ఆయన తన కిసాన్ క్రెడిట్ కార్డ్ పై మూడు లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. తన కుమార్తె కోచింగ్ క్లాసులకు వెళ్లేందుకు వీలుగా ఆయన స్వయంగా నాగ్ పూర్ లో వంటవాడిగా కూడా పనిచేశారు. అని రాహుల్ గాంధీ ఎక్స్ లో పేర్కొన్నారు. ఒక తండ్రి తన కుమార్తె కోసం చేయగలిగినదంతా చేశారు. కానీ నీట్ పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆకాంక్ష వారిని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం ఆత్మహత్య కాదు – అది ప్రధాని మోడీ హయాంలో కొనసాగుతున్న అవినీతి, విచ్ఛిన్నమైన వ్యవస్థకి చెందిన విషాదకరమైన పర్యవసానం అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ సంగతేంటి? ఆయన ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అవే పాత కమిటీలు. అవే పాత బదిలీలు. అవే పాత విచారణలు. సంస్కరణ లేదు, న్యాయం లేదు,” అని విమర్శించారు. ప్రధాని మోడీ అధికారంలో శాశ్వతంగా ఉండిపోరు. పదవి వస్తుంది.. పోతుంది. కానీ గత 12 ఏళ్లుగా మీరు విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడంతో.. ఇప్పుడు యువతలోని ఒక తరం మొత్తం మూల్యం చెల్లించుకుంటోంది,” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఎ) మే 3న నిర్వహించిన నీట్ యుజి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేసింది. ప్రస్తుతం దీనిపై సిబిఐ దర్యాప్తు చేపడుతోంది. నీట్ యుజి పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్ టి ఎ ప్రకటించింది.








కామెంట్‌లు (0)