test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపా కేసుల్లోనూ బెయిల్‌ ఇవ్వాల్సిందే

19 మే, 2026

supreme court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 06:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

– సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధం
– సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ( యుఎపిఎ -ఉపా ) కింద నమోదైన కేసుల్లోనూ బెయిల్‌ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘సుదీర్ఘ కాలం జైలులో నిర్బంధించడం చెల్లదు. అటువంటి సమయాల్లో ఒక నియమంగా బెయిల్‌ ఇవ్వాల్సిందే’ అని ధర్మాసనం పేర్కొంది. మాదకద్రవ్యాల సరఫరాతో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఉపా కింద అరెస్టై, ఆరేళ్లుగా జైలులో ఉన్న జమ్ము కాశ్మీర్‌‌కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్‌‌పై సోమవారం విచారణ జరిగింది. కింది కోర్టులు, హైకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు ఆయన సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, శర్జీల్ ఇమామ్‌‌కు బెయిల్ నిరాకరిస్తూ జనవరిలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపా కేసుల విచారణలో తీవ్ర జాప్యం, విచారణకు ముందు సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం వంటి సమయాల్లో బెయిల్ మంజూరు చేయొచ్చని, 2021లో కెఎ నజీబ్ కేసులో ముగ్గురు న్యాయ మూర్తులతో కూడిన విస్తృత ధ‌ర్మాస‌నం ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఈ తీర్పును జనవరిలో బెయిల్‌‌పై తీర్పు సమయంలో ధర్మాసనం సరిగ్గా అనుసరించలేదని పేర్కొంది. ‘2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయ వ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు.. దిగువ బెంచ్‌‌లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో విస్తృత ధ‌ర్మాస‌నం నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. విస్తృత ధ‌ర్మాస‌నం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న ధర్మాసనాలు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది
ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పూర్తిగా విరుద్ధంగా ఉందని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. ఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్ప టికీ, ‘బెయిల్ ఇవ్వడమే నియమం. జైలులో ఉంచడం మినహాయింపు’ అనే సూత్రం వర్తిస్తుం దని ఆయన చెప్పారు. ఆర్టికల్ 21న కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ఉపాలోని కఠి నమైన సెక్షన్ 43డి (5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో నిందితు లను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం వారికి శిక్ష విధించినట్లే అవుతుందని ధర్మాసనం హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన ఘటనకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ ఉపా కింద చార్జిషీట్ నమోదు చేశారు. వీరిలో ఉమర్ ఖలీద్, శర్జీల్ ఇమామ్ సహా ఏడుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు గతేడాది సెప్టెంబరులో ఢిల్లీ హైకోర్టు నిరాకరించిం ది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జనవరిలో విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ ఖలీద్, శర్జీల్ ఇమామ్‌‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. తాజాగా ఈ తీర్పును జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్