test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదివాసీ హక్కుల ఉల్లంఘనపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

17 మే, 2026

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 12:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- గ్రామసభ అనుమతి లేని హైడ్రో ప్రాజెక్టులను తక్షణం రద్దు చేయాలి
- వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ అమలుకు ఉత్తర్వలు జారీ చేయాలి
- కేంద్ర మంత్రి జువల్‌‌ ఒరామ్‌‌కు ఎఎఆర్ఎం నేతల విజ్ఞప్తి
​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆదివాసీ హక్కులను పరిరక్షించాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్ఎం), ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం (ఎజిఎస్) నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న రాజ్యాంగబద్ధ హక్కుల ఉల్లంఘన, భూమి-వనరుల సమస్యలు, ఉపాధి రక్షణ వంటి కీలక అంశాలపై కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జువల్ ఒరమ్‌‌కు ఎఎఆర్ఎం, ఎజిఎస్ నేతలు వినతిపత్ సమర్పించారు. కేంద్ర మంత్రిని ఎఎఆర్ఎం నేషనల్ ఛైర్మన్ జితేంద్ర చౌదరి, జాతీయ ఉపాధ్యక్షులు బృందాకరత్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, ఎజిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర, ఎఎఆర్ఎం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పలనరస కలిసి ఆదివాసీ సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు.

రాజ్యాంగ హక్కుల అమలు కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలి
‘ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన ఐదో షెడ్యూల్డ్‌ హక్కులు, రిజర్వేషన్లు, భూమి రక్షణ చట్టాలు సక్రమంగా అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. గవర్నరు ఇచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ ఉత్తర్వులు రద్దు చేయడంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదో షెడ్యూల్డ్‌ క్లాజ్-2 ప్రకారం చారిత్రక రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తేనే ఆదివాసీలకు వంద ‌శాతం ఉద్యోగాలు, ఉపాధ్యాయ రిజర్వేషన్ సాధ్యమవుతుంది. అంతవరకు ఏజెన్సీ ప్రాంతాల్లో 2026-డిఎస్‌‌సి నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదే శాలివ్వాలి. జిఓ 3కు ప్రత్యామ్నాయ
జిఓ ఇవ్వాలి’ అని నేతలు కోరారు.

​భూమి-వనరుల రక్షణకు చర్యలు

‘ఆదివాసీల భూభాగ రక్షణ, వనరుల సార్వభౌమత్వం వారికే చెందుతుంది. గ్రామసభ అనుమతి లేకుండా మంజూరు చేసిన అన్ని అనధికారిక హైడ్రో ప్రాజెక్టులను తక్షణం రద్దు చేయాలి. ముఖ్యంగా ఏలూరు జిల్లా ఇరుమూరు గ్రామాల్లో వారసత్వంగా సంక్రమించిన భూమినీ ఆదివాసుల నుండి బలవంతంగా లాగేసి గిరిజనేతరులకు అప్పగించే అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆదివాసీలపై తప్పుడు కేసులు బనాయించి, తీవ్ర భయభ్రాంతులకు ప్రభుత్వం గురి చేస్తుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అక్రమంగా అనుమతినిచ్చిన హైడ్రో పవర్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలి. అలాగే గత 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాన్-షెడ్యూల్డ్ ఆదివాసీ గ్రామాలన్నింటినీ ఐదో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో చేర్చాలి. దీనికి సంబంధించి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలి. తద్వారా ఆదివాసీలకు రాజ్యాంగం ఇచ్చిన అనేక హక్కులు అందుబాటులోకి వస్తాయి’ అని తెలిపారు.

​పిఎం జన్మన్ పథకం అమలు, విద్య-ఉపాధి భద్రత
‘ప్రధాన మంత్రి జన్మన్ పథకంలో యూనిట్ ఖర్చును రూ.3.39 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. లబ్ధిదారులకు బకాయి ఉన్న ఇళ్ల బిల్లులను తక్షణం విడుదల చేయాలి’ అని నేతలు కోరారు. ఆదివాసీ మాతృభాషా వాలంటీర్లను రెగ్యులరైజ్ చేసి వారి జీతాలు తక్షణం పెంచాలని, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ఇఎంఆర్ఎస్)లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎపి భవన్‌‌లో నేతలు బి వెంకట్, పి అప్పలనరస, కె సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆదివాసీలను అడవుల నుంచి గెంటేయడానికి కుట్ర జరుగుతోంది. అందుకే అడవులు, భూములు కార్పొరేట్ సంస్థలకు అతి తక్కువ ధరలకు అప్పగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి ఆదివాసీలకు ద్రోహం చేస్తున్నారు’ అని విమర్శించారు. ‘రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే ఆదివాసీ ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. పిఎం జన్మన్ పథకం లబ్ధిదారులకు బకాయిలు చెల్లించకపోవడంతో మొండి గోడలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. తక్షణం బకాయి మొత్తాలను విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కులు, భూమి, అడవులు, విద్య, ఉపాధి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సత్వరం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్