మనిషి జీవన క్రమంలో అనేక ఒడుదొడుకులకు లోనవుతాడు. ఇతర జీవులకంటే భిన్నత్వం కలిగిన మనిషికి ఉన్న ప్రత్యేక లక్షణం ఆలోచన. బుద్ధిజీవిగా ఎదిగిన మనిషి ఇతర జీవులపై ఆధిపత్యం చెలాయించాడు. ఉత్పత్తి సాధనాలపై ఆధిపత్యం సాధించిన మానవుడు సంపదను తన నియంత్రణలో ఉంచుకొని, మనుషుల మధ్య వర్గ భేదాలకు కారణమయ్యాడు. దీనివల్ల బహుజన వర్గాల ఆవిర్భావం జరిగింది. తోటి మనిషికి సాయం చేసి, వారి కష్టాన్ని అర్థం చేసుకునే మనస్తత్వమే మానవత్వం. ఆ మానవత్వాన్ని నిలబెట్టే బాధ్యతను కొంతమంది బుద్ధిజీవులు భుజానికెత్తుకున్నారు. వారే రచయితలు.
మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపే విధంగా కథలు రాసిన రచయితలు ఉత్తరాంధ్రలో అనేకమంది ఉన్నారు. భూషణం మొదలుకొని అట్టాడ వరకు మానవత్వాన్ని ప్రోది చేసే రచయితల పరంపర కొనసాగింది. అటువంటి వారిలో గంటేడ గౌరునాయుడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన్యం జిల్లా కొమరాడ మండలం దలాయిపేట గ్రామంలో 07-08-1954న సోములమ్మ, సత్యంనాయుడు దంపతులకు జన్మించిన గంటేడ గౌరునాయుడు ఉపాధ్యాయ వృత్తితో పాటు సాహిత్యాన్ని జీవన ధ్యేయంగా మలుచుకున్నారు. “గంటేడ గౌరునాయుడు సాహిత్యం” తొలి సంపుటి 2020లో వెలువడింది. ఇందులో మొత్తం 42 కథలు ఉన్నాయి. గ్రామీణ పేదరికంలో మగ్గిన వృత్తిజీవుల జీవితాలు, అణగారిన వర్గాల ఆవేదనలు, మానవ జీవితాల నగ్న సత్యాలు, వారి పోరాటాలు ఈ కథల ప్రధాన ఇతివృత్తాలు.
గంటేడ కథల్లో మానవీయ విలువలు ప్రధానంగా కనిపిస్తాయి. మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తూ, గ్రామీణ ప్రజల జీవితాలను ఉత్తరాంధ్ర మాండలికంతో సహజంగా చిత్రించారు. “అవతల ఒడ్డు” కథలో షావుకారి అహంకారం, అవసర సమయంలో అతని నిస్సహాయత, సోములు చూపిన కనికరం హృదయాన్ని కదిలిస్తాయి. తనకు అపకారం చేసిన వ్యక్తికీ సాయం చేయడానికి సిద్ధపడే పడవవాడి మానవత్వాన్ని రచయిత హృద్యంగా ఆవిష్కరించారు. “బతుకాకు” కథలో తూనికాకు కోసం అడవికి వెళ్లే పేద కుటుంబ జీవితం, ఆ క్రమంలో రాముడు కొడుకు సిమ్మడి మరణం మనసును కలచివేస్తాయి. “పేదోడి బతుకే ప్రమాదం; పేదరికమే ప్రమాదం” అనే వ్యాఖ్య పేదల జీవన అస్థిరతను స్పష్టంగా తెలియజేస్తుంది. “ఆకులు తప్పేంటి, ఆకలిదిగాని” అనే వాక్యం పేదల నిస్సహాయతను మరింత మర్మంగా వ్యక్తపరుస్తుంది. “చొక్కా గుడ్డకోసం” కథలో ఫిరంగి అనే బాలుడు చొక్కా గుడ్డ కొనుక్కోవాలనే ఆశతో గోగుపుల్లలు ఏరుకుంటాడు. అయితే అతని ఆశ అడియాసగానే మిగిలిపోతుంది. అణగారిన బాలుడి బాధను రచయిత హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. “గెంజి మెతుకులు” కథలో ఆకలి ఎంత భయంకరమో తెలుస్తుంది. గెంజి మెతుకుల కోసం సొంత అన్ననే హతమార్చాల్సిన పరిస్థితి తమ్ముడికి రావడం ద్వారా ఆకలి బంధాలను కూడా
ఎలా చెరిపేస్తుందో చూపించారు.
“విముక్తి” కథలో తిరుగుబాటు స్వరం వినిపిస్తుంది. అనారోగ్యంతో ఉన్న సిమ్మడిని నాయుడు బాబు కొట్టించే సందర్భంలో, శివుడు తిరగబడి “మా తాత, నాన్నల లాంటి వాణ్ణి నేను కాదు” అని ఎదిరించడం అణచివేతకు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న ప్రతిఘటనకు సంకేతంగా నిలుస్తుంది. “ఏం మిగిలింది” కథలో శ్రమజీవుల దౌర్భాగ్యాన్ని రచయిత ఎత్తిచూపారు. ఉత్పత్తి చేసిన వాడు అదే స్థితిలో ఉండిపోగా, దాన్ని స్వాధీనం చేసుకున్నవాడు గొప్పింటోడిగా మారిన సామాజిక వాస్తవాన్ని మార్క్సిస్టు దృక్పథంతో వివరించారు. “నీటి ముళ్ళు” కథలో రైతు జీవితం గాల్లో దీపంలాంటిదని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందిన పంట వరదల్లో కొట్టుకుపోవడం రైతు జీవితంలోని అనిశ్చితిని తెలియజేస్తుంది. “నాణెం కింద చీమ” కథలో మంగలి అచ్చయ్య తన మనవడి కోరిక తీర్చడానికి డబ్బుల కోసం వెతుకుతూ పాము కాటుకు బలవుతాడు. ఈ కథ గ్రామీణ పేదరికం ఎంత విషాదకరమో తెలియజేస్తుంది.
గంటేడ కవి కూడా కావడంతో ఆయన కథల్లో సందర్భానుసారంగా కవిత్వం పలుకుతుంది. అందువల్ల కథలకు మరింత భావగాంభీర్యం చేకూరింది. “ఏటి పాట” కథలో పైడయ్య–సూరమ్మ జీవితాలను వర్ణిస్తూ ఇలా రాశారు,
“ఆ కొండ ఈ కొండ
కొండల్లో ప్రతి బండ
మృతివీరుల స్మృతిచిహ్నం
గతకాలపు రణచిత్రం…”
ఈ పంక్తులు ఉత్తరాంధ్ర పోరాట చరిత్రను సజీవంగా నిలబెడతాయి. అదే కథలో సూరమ్మ పాడిన జముకుపాటలో వర్గ విభజనలపై గాఢమైన ఆవేదన వ్యక్తమవుతుంది,
“ఉన్నోడుదొక జాతి, లేనోడుదొక జాతి
మనుసులందరికీ నేడు నేలమీద ఒక నీతి…”
“కొండమల్లె” కథలో మోసపోయిన స్త్రీకి ధైర్యం నూరిపోస్తూ,
“సెల్లేలా ఓ సెల్లేలా
మల్లెపూవు నువ్వు ముల్లులాగా మారాల…” అని స్ఫూర్తినిచ్చారు.
“రాగాల చెట్టు” కథలో,
“ప్రతి గొంతున జనం పాట చిగురులేస్తాది
చిగురు చూస్తే దోపిడీకి చెమటపడతాది…” అంటూ పీడితుల రాజ్యం వస్తుందనే ఆశావాదాన్ని వ్యక్తపరిచారు.
గంటేడ కథల ప్రత్యేకతలో ముఖ్యమైనది స్థానిక సామెతల వినియోగం. ఇవి కథలకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. “ఆసరసాల” కథలో, “కాము తానెల్లి దూరితేనే గదా సెట్టు మీదకి తయారైపోతాది” అనే సామెత ద్వారా దోపిడీ వ్యవస్థలకు తమవాళ్లే తోడ్పడుతున్న వాస్తవాన్ని చెప్పారు. “నాణెం కింద చీమ” కథలో, “దరిద్రగొట్టోడు దడిలోకి వెళితే వడగళ్లవాన పట్టుకొందట” అనే సామెత పేదవాడి దురదృష్టాన్ని ప్రతిబింబిస్తుంది. “బలవంతుడు సవ్వారి, బగవంతుడు మోయాల”, “కూకున్నోడిదే పీట, నోరున్నోడుదే పేట” వంటి సామెతలు సామాజిక అసమానతలను బలంగా ప్రతిధ్వనింపజేస్తాయి. “తిరుగుడు గుమ్మి” కథలో, “ఏనుగు గానుగు తిరగడం అంటే ఇదే గావాలా” అనే సామెత ద్వారా రైతులు తమ సొంత ఊర్లోనే పరాయివాళ్లుగా మారిన దుస్థితిని తెలియజేశారు.
ఆకలి బాధలు, గ్రామీణ జీవిత విధ్వంసం, ఉత్తరాంధ్ర ఆవేదన, మానవ సంబంధాల కృత్రిమత్వం, బడుగు–బలహీన వర్గాల కష్టాలు వంటి అనేక అంశాలను గంటేడ తన కథల్లో ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర అస్తిత్వం ఈ కథల్లో సజీవంగా కనిపిస్తుంది. ఆయన పోరాటం కేవలం వ్యవస్థల మీద మాత్రమే కాదు; గ్రామీణ ప్రజల అవస్థల మీద, కులాల అడ్డు గోడల మీద, ఏటిని దాటించే పడవల మీద కూడా సాగింది. కొండలను చదివారు, బండలను చదివారు; బండల వంటి మనుషులను చదివారు. జముకులు, డప్పుల శబ్దాలను వినిపించారు. “పరిస్థితులే కథలను మార్చాలి; కథలు పరిస్థితులను మార్చలేవు” అనే అభిప్రాయం కొంతమంది మేధావులది కావచ్చు. కానీ గంటేడ కథలు ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రజల సమస్యలపై అవగాహన కల్పించాయనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.
– మూడడ్ల శ్రీనివాసరావు
8555867725








కామెంట్‌లు (0)