test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కపట నాగరికతపై ఒక తాత్విక ధిక్కారం

18 మే, 2026

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కాలం ఒక కసాయి కత్తిలా మనిషి సున్నితత్వాన్ని కోసేస్తున్న దారుణమైన వర్తమానం మనది. బతుకంటే వ్యాపారం, ప్రాణమంటే ఆర్థిక లెక్కగా మారిపోయిన ఈ కాంక్రీటు అరణ్యంలో మనిషిని మనిషిగా నిలబెట్టే ఆర్తనాదమే “నీటికుండలాంటి మనిషి” కవితా సంపుటి. ఈ శీర్షికలోనే ఒక గొప్ప తాత్వికత దాగి ఉంది. నీటికుండ బయటకు సాధారణ మట్టిపాత్రలా కనిపించినా, లోపల దాహాన్ని తీర్చే చల్లదనం ఉంటుంది; కానీ చిన్న రాయి తగిలినా ముక్కలైపోతుంది. ఆధునిక మనిషి బతుకు కూడా అంతే - బయటికి కఠినత్వం, లోపల పగిలిపోతున్న సున్నితత్వం. సుంకర గోపాలయ్య కవిత్వం ఆ సున్నితత్వాన్ని ఆర్ద్రంగా స్పృశిస్తుంది.
గోపాలయ్య ఆడంబరాల కవి కాదు. ఆయన కవిత్వం వెనుక సామాజిక వాస్తవికత ఉంది, కానీ అది తీర్పుల రూపంలో కాదు; మానవత్వపు కరుణ రూపంలో వ్యక్తమవుతుంది. తల్లి, ప్రకృతి, అడవి, శ్రమజీవి, యుద్ధం, పేదరికం - ఇవన్నీ ఆయన కవిత్వంలో రక్తమాంసాల్లా జీవిస్తాయి. “అమ్మలందరూ అడవులే” అని చెప్పినప్పుడు తల్లితనాన్ని ప్రకృతితో ముడిపెడతాడు. “వర్షఋతువు నా రక్తసంబంధి” అన్న పంక్తుల్లో మనిషి తన మూలాలతో ఉన్న ఆదిమ అనుబంధం వ్యక్తమవుతుంది. తల్లి అంటే కేవలం మాంసపు ముద్ద కాదు, సహనంతో ప్రాణాన్ని మోసే ఒక అడవి అని కవి విశ్వసిస్తాడు. ‘పురుడు పోసుకునే సమయం’ కవితలో జననాన్ని ఒక పవిత్రమైన నిశ్శబ్దంగా దర్శించిన కవి, “ప్రపంచం పురుడుపోసుకుంటోంది” అన్న వాక్యంతో జీవితం మీద తన మౌలికమైన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాడు. కానీ ఆ స్వచ్ఛమైన జీవన ప్రవాహాన్ని ఆధునిక నాగరికత ఛిద్రం చేస్తోంది. ‘రాలిన పూల పాఠం’ కవితలో చిన్న చిన్న సంతోషాల్ని కోల్పోయిన మనిషిని చూస్తూ కవి బాధపడతాడు. జీవితం గురించి ఉపన్యాసాలు ఇచ్చే కపట మేధావుల కంటే, “పెరిగిన ధరలు గురించో, విరిగిన వెన్నెముక గురించో” మాట్లాడే స్వరాలే అవసరమని చెబుతాడు. కవిత్వం అంటే మేఘాల్లో తేలియాడటం కాదు, నేలమీద నలిగిపోతున్న మనిషి గుండె చప్పుడు వినడమని స్పష్టం చేస్తాడు.
ఈ విధ్వంసం ప్రకృతిమీదికి దూసుకొచ్చినప్పుడు కవిలో ఆవేదన అగ్నిగా మారుతుంది. ‘చెట్టు చెట్టు రాజుకోవాల’ కవితలో అడవుల మీద జరుగుతున్న దాడిని చూసి అతను విలవిల్లాడిపోతాడు. “అడవి మీద ఆవరించిన మేఘాలు / రక్తపురంగు తేలి” అన్న పంక్తుల్లో ప్రకృతి గాయాల్ని కవి రక్తగాయాల్లా చూపిస్తాడు. అక్కడ కవిత్వం కేవలం బాధ కాదు — తిరుగుబాటు. “చెట్టు చెట్టు రాజుకోవాల” అన్న పిలుపులో జీవాన్ని కాపాడుకోవాలన్న విప్లవ స్వరం ఉంది. అయితే ఈ యుద్ధాల మధ్య కూడా కవి పూర్తిగా నిరాశావాది కాదు. బయట ప్రపంచపు హింస నుంచి విముక్తి కోసం మనిషిని తన లోపలికి తీసుకెళ్తాడు. “మనిషి లోపల తోటొకటుంటుంది” అని చెప్పుతూ, ప్రతి మనిషిలో ఇంకా మిగిలి ఉన్న పచ్చదనాన్ని గుర్తుచేస్తాడు. “నీ రక్తమిప్పుడు యుద్ధాల్ని బహిష్కరిస్తుంది” అన్న పంక్తి ఈ సంపుటి యొక్క మానవతా కేంద్రబిందువు. ద్వేషం, పోటీ, కాంక్రీటు నాగరికత మధ్య కూడా మనిషిలోని ఆర్ద్రతను కాపాడుకోవచ్చన్న విశ్వాసమే ఈ కవిత్వానికి మూలశక్తి.
‘గీతల్లేని లోకం’ కవితలో గోపాలయ్య సరిహద్దుల రాజకీయాన్ని ప్రశ్నిస్తాడు. పక్షులకు లేని గీతలు మనిషికి ఎందుకు అవసరమయ్యాయో నిలదీస్తాడు. “నీ హద్దుల్లో నువ్ ఉండటానికి మించిన ప్రపంచశాంతి ఏముంది?” అన్న ప్రశ్న కేవలం దేశాల గురించి కాదు; మనిషి మనసుల్లో కట్టుకున్న అహంకారపు గోడల గురించి కూడా. అదే ఆలోచనను ‘నాగరికత’ కవితలో మరింత విస్తరించి, “మనిషి మనిషిగా మెరుగుపడటానికి మించిన నాగరికత ఏముంటుంది?” అని ప్రశ్నిస్తాడు. నాగరికత పేరుతో పెరిగిన కపటత్వాన్ని కవి నిర్దాక్షిణ్యంగా బట్టబయలు చేస్తాడు. ‘బడ్జెట్‌కు ముందే’ కవితలో పాలకుల అంకెల గారడీ వెనుక దాగి ఉన్న పేదల కన్నీళ్లను చూపిస్తాడు. అసలైన దేశ సంపద ఏసీ గదుల్లో లేదని, ఎండలో పగిలిన పాదాలతో బతికే రైతు దగ్గర ఉందని గుర్తుచేస్తాడు. ‘కపర కపర చీకటి’ కవితలో బంధుత్వాలు కూడా ఎలా వ్యాపారాలుగా మారిపోయాయో చూసి తల్లడిల్లిపోతాడు. “ఎవరికెవరం ఏమౌతాం” అన్న వాక్యంలో ఆధునిక మనిషి ఒంటరితనం గాఢంగా వ్యక్తమవుతుంది.
ఈ తాత్విక అన్వేషణకు తలమానికమైన కవితే “నీటికుండలాంటి మనిషి”. మతం, డబ్బు, ఆధిపత్యం లేని కాలంలో మనిషి ఎంత స్వచ్ఛంగా ఉండేవాడో కవి ఊహిస్తాడు. “చేతికి చేయి గుండెతో గుండె కలిపి” బతికే ఆ మనిషిని “చలివేంద్రపు నీటికుండ”తో పోల్చుతాడు. నీటికుండలా దాహం తీర్చే, చల్లదనం పంచే కానీ సున్నితంగా పగిలిపోయే స్వభావమే మనిషి అసలు నైజమని చెబుతాడు. ఆధునిక నాగరికత ఆ నీటికుండను పగలగొట్టిందన్న దుఃఖం మొత్తం సంపుటి అంతటా ప్రవహిస్తుంది. ‘రెక్కలు విరిగిన నిద్ర’ కవితలో ఆసుపత్రి వరండాల్లో నిద్ర కూడా భయంతో ఏడుస్తున్నట్లుగా చిత్రీకరిస్తాడు. “రెక్కలు విరిగి రోదిస్తూ నిద్ర” అన్న రూపకం ఆధునిక మనిషి మానసిక వేదనకు అద్దం పడుతుంది. ‘అశోక దుఃఖం’ కవితలో కళింగం నుంచి గాజా వరకు యుద్ధాల నెత్తురును కలుపుతూ, ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది ఆయుధాలు కాదు; కన్నీళ్లను తుడిచే దార్శనికత అని చెబుతాడు. ‘అలజడి’ కవితలో మనిషి ఇప్పుడు ప్రకృతికే ఒక భయంగా మారిపోయాడన్న విషాదాన్ని వ్యక్తం చేస్తాడు. “మనుషులోస్తున్న అలికిడి” అన్న వాక్యంలో ఒకప్పుడు దాహం తీర్చే నీటికుండలాంటి మనిషి ఇప్పుడు సృష్టికే కల్లోలంగా మారిపోయాడన్న గాఢమైన ఆవేదన ఉంది. ఈ కవికి కవిత్వంపై అపారమైన విశ్వాసం ఉంది. “ఆమె+నేను=కవిత” కవితలో అక్షరాన్ని వంటగదిలో కడిగే బియ్యపు గింజల్లా చిత్రిస్తాడు. కవిత్వం మేధో వ్యాయామం కాదు, దైనందిన శ్రమలోంచి పుడే జీవనాదమని చెబుతాడు. ‘జీవకాంతి’లో గాయపడిన నేల మళ్లీ పురుడు పోసుకునేందుకు సిద్ధమవుతుంటే, ‘మరణం లేని పాట’లో శ్రమజీవి గానం ఎన్నటికీ చావదని ప్రకటిస్తాడు. ఈ ప్రయాణానికి పరాకాష్ట ‘పద్య వారసత్వం’. “నా పద్యమే నా వీలునామా” అని గోపాలయ్య చేసిన ప్రకటన ఈ సంపుటి యొక్క అత్యున్నత అస్తిత్వ ప్రకటన. బ్యాంకు బ్యాలెన్సులు కాదు, మనిషి కన్నీళ్లు, ధిక్కారం, మానవత్వమే రేపటి తరానికి నిజమైన వారసత్వమని ఆయన నమ్మకం.
“నీటికుండలాంటి మనిషి” కేవలం ఒక కవితా సంపుటి కాదు; కపట నాగరికత మధ్య తన ఆర్ద్రతను కాపాడుకోవాలనుకునే మనిషి చేసిన నిశ్శబ్ద తిరుగుబాటు. ఈ కవిత్వం చదివిన తర్వాత పాఠకుడు మామూలుగా బయటకు రాలేడు. తనలో ఎక్కడో పగిలిపోయిన ఒక నీటికుండ శబ్దం వినిపిస్తుంది.

- డా. బండారు విజయ్ కుమార్
98667 03130

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్