test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఒక గోధుమ గింజ’లో మహా ఉద్యలు

4 గంటల క్రితం

book review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

గూగీ వా థియాంగో (1938–2025)... ఆర్తజన స్వరంగా ప్రపంచ సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందిన ఆఫ్రికన్ రచయిత. అతని సాహిత్యం, భాష, సంస్కృతి, సామ్రాజ్యవాద, నయా వలసవాద వ్యతిరేక భావాలు ప్రజల ఆలోచనకు పదును పెట్టాయి. తన రచనలపై జార్జ్ లామింగ్, రష్యన్ రచయితలు గోగోల్, టాల్స్టాయ్, గోర్కీ, షోలోకోవ్, అమెరికన్ రచయిత విలియం ఫాక్నర్‌ల ప్రభావం ఉంది. గూగీ తన నవలల్లో ఫ్లాష్‌బ్యాక్, బహుళ స్వరాలు, స్థల కాల మార్పులు, కథలో మరో కథ వంటి టెక్నిక్‌లను ఉపయోగించాడు. గూగీ తన ‘డీకాలనైజింగ్ ది మైండ్’ పుస్తకంలో కెన్యా రచయితలు తమ జాతి జీవనం, భాష, సంస్కృతి మూలాల్లోకి వెళ్లినప్పుడే బహుముఖ సృజనాత్మకత వ్యక్తమవుతుందని రాశాడు. “ప్రజల సంస్కృతిని అదుపు చేయడం అంటే వారి సంబంధాల్లో వారు తమను తాము నిర్వచించుకునే పరికరాలను అదుపు చేయడమే” అని, “ప్రజా జీవితాలను ప్రతిబింబించే ఆఫ్రికన్ భాషలు నయా వలసవాద రాజ్యానికి శత్రువులవుతాయి” అని పేర్కొన్నాడు. గూగీ సాహిత్యంలో “డెవిల్ ఆన్ ది క్రాస్” (మట్టి కాళ్ల మహారాక్షసి), “మాటిగరి”, “బందీ”, “డ్రీమ్స్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ వార్” తెలుగులోకి అనువదించబడ్డాయి.
గూగీ వా థియాంగో నవల “ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్” (ఒక గోధుమ గింజ) బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా కెన్యాలో జరిగిన మావ్ మావ్ ఉద్యమాన్ని, దానిలోని ఆటుపోట్లు, భిన్న పాత్రల స్పందనలను, స్వాతంత్ర్యం అనంతర పరిణామాలను చిత్రిస్తుంది. రచయిత తెల్లవారి, నల్లజాతీయుల పాత్రలలోని వైరుధ్యాలను కవితాత్మక వచనంలో ఆవిష్కరించి ఆ కాలపు సంక్లిష్టతకు అద్దం పట్టాడు. నవల శీర్షికలోని గోధుమ గింజ భూమిలో నాటిన త్యాగానికి ప్రతీక. స్వాతంత్ర్య పంట పండాలంటే ఎందరో త్యాగం చేయాల్సి ఉంటుందనే భావాన్ని అది సూచిస్తుంది. నవలలో వలస అధికారుల నిరంకుశత్వం, ఉద్యమకారుల త్యాగం, కొందరు నల్లజాతీయుల రాజీ, ద్రోహాలు, ప్రజల బాధలు, స్వాతంత్ర్యానంతర నిరాశలను గూగీ హృద్యంగా చిత్రించాడు. పాత్రల మనస్తత్వాల్లోని వైరుధ్యాలు, అపరాధ భావం, ప్రజా నాయకుల పట్ల ఆరాధన, అధికార వ్యవస్థలో కొనసాగిన అవినీతి నవలకు లోతును చేకూర్చాయి. నిర్బంధ శిబిరం నుంచి తిరిగి వచ్చిన మ్యూగో గిథిమా గ్రామ సరిహద్దుల్లో ఒంటరిగా వ్యవసాయం చేస్తూ మూగవాడిలా జీవిస్తుంటాడు. సైనికులు చంపిన మూగ, చెవిటివాడు గీతోగో తల్లి అన్నా భయంతో జీవిస్తుంది. శిబిరం నుంచి తిరిగి వచ్చిన మరో వ్యక్తి గీకోన్యో విజయవంతమైన వ్యాపారస్తుడిగా స్థిరపడతాడు. మరో వృద్ధుడు వారూయీ సమాజం కోసం మరణించిన అమరవీరులు వయాకి, హ్యారీల గురించి తరచుగా ప్రస్తావిస్తుంటాడు. వాంబూయీ అనే ముసలామె ఉద్యమం కోసం తాను చేసిన సాహసకృత్యాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
ఈ నవలలో జాన్ థాంప్సన్, మర్జరీ, వాన్ డైక్‌ల ఉపకథ ద్వారా వలస పాలకుల జీవితాల్లోని పరాయితనం, నైతిక సంక్షోభాన్ని గూగీ చిత్రించాడు. కెన్యా స్వాతంత్ర్యం సమీపిస్తుండగా వారు ఆ దేశాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధపడటం వలస పాలన అంతాన్ని సూచిస్తుంది. గూగీ తెల్లవారిలో కూడా ఉండే పరాయితన భావనను చూపిస్తాడు. డాక్టర్ లిండ్ కుక్క నల్లజాతీయుడైన కారాంజపై దాడి చేయబోవడం, తోటి నల్లవారి మౌనం, నల్లవారే తన కుక్కను చంపారని అతడు భయపడటం వర్ణితమవుతాయి. జాన్ థాంప్సన్ జిల్లా అధికారిగా పనిచేస్తూ జైలులో నిరాహార దీక్ష చేసిన ఖైదీల మరణాలకు కారణమై తరువాత గిథిమా గ్రామానికి బదిలీ అవుతాడు. మరో పాత్ర జాక్సన్. అతడు క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఇతరులను కూడా మార్చేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అలా మారిన వారిని ఉద్యమకారులు అనుమానంగా చూస్తుంటారు. కీహీకా బాల్యం నుంచే ప్రశ్నించే స్వభావం కలవాడు. బైబిల్‌కు తప్పుడు వ్యాఖ్యానం చేసిన ఉపాధ్యాయుడిని ఎదిరించి శిక్షకు గురవుతాడు. తర్వాత పారిపోయి స్వాతంత్ర్య ఉద్యమంలో చేరతాడు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో గాంధీ పాత్ర గురించి అతడు చెప్పే కథలు విని మూంబీతో పాటు మరెందరో ప్రభావితమవుతారు. మూంబీ ప్రేమ కోసం గీకోన్యో, కారాంజ పోటీపడతారు. గీకోన్యోతో మూంబీ బంధం బలపడటాన్ని కారాంజ జీర్ణించుకోలేడు. ఆ వైఫల్యం తర్వాత అతడు వలస పాలకుల వైపు మొగ్గుచూపి, మరోవైపు తన కమ్యూనిటీతో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తాడు.
గూగీ మనిషిలోని మంచి, చెడు రెండింటినీ చూపిస్తాడు. కారాంజ వలసవాదులతో కుమ్మక్కై గీకోన్యో నిర్బంధంలో ఉన్నప్పుడు, అతడి కుటుంబం ఆకలి బాధతో అసహాయ స్థితిలో ఉన్న సందర్భాన్ని ఉపయోగించుకుని మూంబీని అబద్ధాలతో లోబరుచుకుని బిడ్డకు తండ్రి అవుతాడు. కారాంజ ప్రవర్తన థామస్ హార్డీ నవల టెస్ ఆఫ్ ది డర్బర్‌విల్స్ లోని అలెక్ డర్బర్‌విల్‌ను గుర్తు చేస్తుంది. ఇలాంటి రాజీలు మరికొన్ని పాత్రల జీవితాల్లోనూ కనిపిస్తాయి. కీహీకాతో కలిసి అడవిలో పోరాటానికి వెళ్లడాన్ని తిరస్కరించిన వాంబూకీ ఒక ఉదాహరణ. గీకోన్యో తన తల్లి వంగరి, భార్య మూంబీలతో సంతోషకరమైన జీవితం కోసం అధికారుల వద్ద ఒప్పుకోలు చేసి బయటకు వస్తాడు. అయితే తన భార్య ఒకనాటి ప్రత్యర్థి కారాంజతో బిడ్డను కన్నదని తెలిసి తీవ్రంగా బాధపడతాడు. ఇక మ్యూగో తాను కీహీకాకు ద్రోహం చేసి అతడి మరణానికి కారణమయ్యాననే అపరాధ భావంతో జీవిస్తుంటాడు. అయినప్పటికీ గీకోన్యో, మూంబీల ఒప్పుకోళ్లు వింటాడు. తాగుబోతు గీతువా తనను వీర నాయకుడిగా పొగుడుతుంటే అసౌకర్యానికి గురవుతాడు. మరోవైపు యాలా శిబిరంలో ధైర్యంగా, హాస్యభరితంగా చివరిదాకా నిలిచిన గాటు, కీహీకా అమరవీరులవుతారు.
తన మానసిక బలహీనత వల్ల ఉద్యమకారుడైన ప్రేమికుడు కీహీకాను తిరస్కరించిన వాంబూకీ పట్ల మరో మహిళ జేరీ జుగుప్స ప్రదర్శిస్తుంది. తనది కాని బిడ్డ పట్ల గీకోన్యోలో క్రోధం పెరుగుతుంది. మరోవైపు తాను ఎదుర్కొన్న దయనీయ పరిస్థితులు, విడుదల కోసం నిరీక్షించిన రోజులు, తన అమాయకత్వం, కారాంజ చెప్పిన మాయమాటలు, చివరకు అతడికి లొంగిపోవడం వంటి విషయాలను మూంబీ మ్యూగోకు వివరిస్తుంది. ఈ కథ విన్న మ్యూగోలో తీవ్రమైన కలవరం మొదలవుతుంది. తాను కీహీకా మరణానికి కారణమయ్యాననే నిజం త్వరలో అందరికీ తెలిసిపోతుందని అతడు గ్రహిస్తాడు. కీహీకా అనుచరులు అతని మరణానికి కారణమైన వ్యక్తిని వెతుకుతుంటారు. స్వాతంత్ర్య ఉత్సవ సభలో మాట్లాడేందుకు నిరాకరిస్తున్న మ్యూగోను ఒప్పించేందుకు మూంబీని పంపుతారు. ఆమె ముందు అతడు తన ద్రోహాన్ని ఒప్పుకుంటాడు. మూంబీ వెళ్లిపోతుండగా ఆమెను ఆపి బలవంతంగా లోబరుచుకుంటాడు. ఈ సంఘటన అతడి వ్యక్తిత్వంలోని మరో చీకటి కోణాన్ని బయటపెడుతుంది. చివరకు మ్యూగో తాను కీహీకాకు చేసిన ద్రోహాన్ని అందరి ముందూ అంగీకరిస్తాడు. కీహీకా అనుచరుల చేతిలో మరణశిక్షను అనుభవిస్తాడు. బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిన తర్వాత కారాంజ పూర్తిగా ఏకాకి అవుతాడు. మూంబీ ప్రేమను శాశ్వతంగా కోల్పోయానని గ్రహించి ఆత్మహత్య చేసుకుంటాడు.
నవలలో మూంబీ పాత్ర నిప్పుల కొలిమిలో నడిచిన స్త్రీలా కనిపిస్తుంది. ఆకలి బాధల నుంచి కుటుంబాన్ని కాపాడుతుంది. తనపై అన్యాయం చేసిన కారాంజను కూడా రానున్న ప్రమాదం గురించి హెచ్చరిస్తుంది. మ్యూగో వేదనను అర్థం చేసుకుంటుంది. తనను అనుమానించి నిందించిన భర్త నుంచి దూరం కావడానికి సిద్ధపడుతుంది. అయితే గీకోన్యో తల్లి మందలింపు, గీకోన్యోలో కలిగిన పశ్చాత్తాపం చూసి మళ్లీ కలిసి జీవించేందుకు అంగీకరిస్తుంది. మూంబీ పాత్ర పాఠకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. గీకోన్యో తల్లి, కోడలు మూంబీ మధ్య కనిపించే ఆత్మీయత స్త్రీల సహజ మానవీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. గూగీ తన నవలలో పాత్రలలోని భిన్న పార్శ్వాలను, నమ్మకం–అపనమ్మకం, భ్రాంతి–వాస్తవికత, స్వచ్ఛమైన ఆత్మ–పరిస్థితుల ప్రభావంతో ఏర్పడే రాజీ, ఆదర్శవాదం–నిరాశావాదం మధ్య ఘర్షణలను హృదయాన్ని కదిలించేలా చిత్రించాడు. అందువల్ల “ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్” కేవలం కెన్యా స్వాతంత్ర్య పోరాట గాథ మాత్రమే కాదు; స్వేచ్ఛ, ద్రోహం, అపరాధ భావం, ప్రేమ, త్యాగం, మానవ బలహీనతల గురించి చెప్పే గొప్ప మానవీయ నవలగా నిలిచింది.

– డా. జె. రవీంద్రనాథ్
89781 31585

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్