test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేడియో తెలుగు పలికిన వేళ...

18 మే, 2026

radio
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 06:30 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

​భారతదేశంలో తంతులు లేకుండా ప్రసారాన్ని సాధ్యం చేసే రేడియో మాధ్యమాన్ని మనదేశంలో 1936 జనవరి 8న ప్రారంభమైంది. దానికి 'ఆల్ ఇండియా రేడియో' అని నామకరణం చేశారు. అవి మనదేశం బ్రిటిషువారి ఏలుబడిలో సాగే రోజులు. 1935 ఆగస్టు 30వ తేదీన బ్రిటిష్ వ్యక్తి లైనల్ ఫీల్డన్ (Lionel Fielden) తొలి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ కేంద్రం ద్వారా 1936 జనవరి 1న 'ఇండియన్ స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్' ప్రసారాలు ప్రారంభించింది. అప్పట్లో ప్రసారశాఖ మంత్రులుగా అండ్ర్యూ గొర్లే క్లా (Andrew Gourlay Clow) పని చేసేవారు. ఆల్ ఇండియా రేడియో అనే పేరు ఎలా వచ్చిందో లైనల్ ఫీల్డన్ చాలా తర్కించి, మంత్రితో చర్చిస్తూ 'ఆల్ ఇండియా...' అనే మాటలను తను ప్రతిపాదిస్తే, మంత్రి రేడియో అనే మాటను చేర్చడం మేలు, 'బ్రాడ్‌కాస్టింగ్ వద్దు' అని చెప్పినట్టు ఫీల్డన్ రాశారు. అలా 'ఆల్ ఇండియా రేడియో' అనే పేరు తయారైంది. ఆల్ ఇండియా రేడియో అనే మాట హ్రస్వరూపం AIR కూడా అందమైనది, అర్థవంతమైనది. ఢిల్లీలో మొదలైన రోజునే బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయి, కలకత్తా నగరాల్లో కూడా రేడియో ప్రసారాలు ఈ సంస్థ ద్వారా ప్రారంభించింది.​
నిజానికి ఇంగ్లీష్ వారు రేడియో ప్రాధాన్యతను ఇంగ్లాండులో గుర్తించిన తర్వాత భారతదేశంపై కూడా దృష్టి పెట్టారు. కమ్ముతున్న యుద్ధమేఘాల దృష్ట్యా భారతదేశంలో కూడా రేడియో చాలా అవసరమని వారికి తోచింది. కనుక బి.బి.సి. రీసెర్చ్ విభాగం అధిపతి హెచ్. ఎల్. కిర్కే 1936 జనవరిలో దేశంలో రేడియోకున్న అవకాశాలను అధ్యయనం చేయడానికి వచ్చారు. లైనల్ ఫీల్డన్‌తో కలిసి కిర్కే దేశంలోని ప్రధానమైన పట్టణాలు లక్నో, అలహాబాద్, బెనారస్, కలకత్తా, నాగపూర్, హైదరాబాద్, బెజవాడ, ఎల్లోరా, రాజమండ్రి, మద్రాస్, మదురై, తిరుచునాపల్లి, బెంగళూరు, బొంబాయి, అహ్మదాబాద్, బరోడా, పెషావర్, లాహోర్ సందర్శించి రిపోర్టును తయారు చేశారు. అంతకుముందు 1924 జులై 31న సి.వి. కృష్ణస్వామి శెట్టి ప్రారంభించిన మద్రాస్ ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ కొంతకాలం ప్రసారాలను నిర్వహించి మూసివేసింది. తర్వాత 1930లో మద్రాసు నగరపాలక సంస్థ కూడా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. కానీ అవి కూడా ఎంతోకాలం సాగలేదు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వపు ప్రసార వ్యవస్థ ద్వారా ఆల్ ఇండియా రేడియో 1938 జూన్ 16న మద్రాస్‌లో మొదలై నాలుగు దక్షిణాది భాషలలో ప్రసారాలు ప్రారంభించింది. ప్రధానంగా తెలుగు భాష ఉండేది. అంటే నేటికీ 'ఆల్ ఇండియా రేడియో' నామకరణం జరిగి తొమ్మిది దశాబ్దాలు కాగా, ఆ ఆల్ ఇండియా రేడియో తెలుగు మాట్లాడడం మొదలుపెట్టి సుమారు 88 ఏళ్లు అయ్యింది. తెలుగు ఆకాశవాణిలో తొలి మాటలు (పరీక్షా ప్రసారంతో సహా) ఆచంట జానకిరామ్ గారివే. వారే మద్రాసు ఆకాశవాణి తొలి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఆయనే తెలుగు రేడియో కార్యక్రమాలకు పునాది వేసిన ప్రసార శిల్పి.
తెలుగు ఆకాశవాణి మొదలైన సందర్భం చాలా విశిష్టమైంది. మీడియా పరంగా చూస్తే 1914లో బొంబాయి నుంచి 'ఆంధ్రపత్రిక' మద్రాసు తరలివచ్చి వారపత్రికతో పాటు దినపత్రికను అదనంగా ప్రారంభించింది. అంతకుముందు బందరు నుంచి 'కృష్ణా పత్రిక', తర్వాత అనంతపురం నుంచి 'శ్రీ సాధన పత్రిక'లు మొదలయ్యాయి. 1924లో 'భారతి' మాసపత్రిక మొదలైంది. పత్రికలు వాడుక భాషలో వార్తలు, వ్యాసాలు ప్రచురించాలని గిడుగు రామ్మూర్తి పంతులు సుదీర్ఘమైన, హేతుబద్ధమైన, సాధికారమైన వ్యాసాన్ని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వహించే 'ప్రభుద్ధాంధ్ర' మాసపత్రికలో 1934 ఏప్రిల్ సంచికలో వెలువరించారు. ఆ మరుసటి నెలలోనే గూడవల్లి రామబ్రహ్మం తన 'ప్రజామిత్ర' మాసపత్రికను వాడుక భాషలోకి మార్చారు. 1936లో తాపీ ధర్మారావు తను వాడుక భాషకు మద్దతు ఇస్తున్నట్టు గిడుగు వారికి ఉత్తరం రాశారు. 1936 ఆగస్టు 5న పిఠాపురం మహారాజా తమ ప్రజాపార్టీ తరఫున ప్రారంభించిన తెలుగు దినపత్రిక 'జనవాణి' తాపీ ధర్మారావు సంపాదకులుగా మొదలైంది. అందులో నార్ల వెంకటేశ్వరరావు న్యూస్ ఎడిటర్. 1937 ఎన్నికల ఫలితాల తర్వాత 'జనవాణి' ఆగిపోతే, గూడవల్లి ప్రజామిత్రకు ఇన్‌చార్జ్ ఎడిటర్‌గా నార్ల వెళ్లారు. 1937లో తాపీ ధర్మారావు 'మోహినీ రుక్మాంగద' సినిమాతో వాడుక భాషను ప్రవేశపెట్టారు. రామనాథ్ గోయంకా 1938 ఆగస్టు 15న ఖాసా సుబ్బారావు సంపాదకత్వంలో 'ఆంధ్రప్రభ' దినపత్రికను మద్రాస్ నుంచి ప్రారంభించారు. అంటే పత్రికలు, సినిమాలు వ్యవహారిక భాషలోకి పరిణామం చెందుతున్న కీలక సమయంలో తెలుగు రేడియో రంగప్రవేశం చేసి వాడుక భాషను మరింత పరిపుష్టం చేస్తూ దానికి మరింత చెల్లుబాటును సిద్ధం చేసింది.​
త్యాగరాజ తెలుగు కృతిని నాదస్వరంపై వాయిస్తుండగా మద్రాసు ఆకాశవాణి ప్రసారాలు మొదలయ్యాయి. "నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరు ఎక్కడ నుంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కానీ అనేక స్థలముల యందు వినుచున్నారని తలచుచున్నాను.." అంటూ మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధానమంత్రి కూర్మా వెంకటరెడ్డి 'భారతదేశం-రేడియో' అనే అంశం గురించి మొదటి రోజు రాత్రి 8:15 నిమిషాలకు ప్రసంగించారు. పిమ్మట చక్రవర్తి రాజగోపాలాచారి ఆంగ్లంలో ప్రారంభోపన్యాసం చేశారు. 'వైతాళికులు' సంకలనకర్త ముద్దుకృష్ణ రాసిన తొలి రేడియో నాటకం 'అనార్కలి' మద్రాస్ కేంద్రం నుంచి 1938 జూన్ 24న లైవ్‌గా ప్రసారమైనప్పుడు అక్బర్, సలీం, అనార్కలి పాత్రలను అయ్యగారి వీరభద్రరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రేడియో భానుమతి వేయగా, ప్రయోక్త ఆచంట జానకిరామ్. "ఈ యుగం ఎంత చిత్రమైనదో? ఇదంతా పరిశోధన యుగం. వైజ్ఞానిక యుగం. ప్రతి విషయంలోనూ పరిశోధనే. నిప్పు, నీరు, గాలి, ధూళి ఇంతెందుకు?.." అంటూ సాగే చరిత్ర పరిశోధకులు, 'భారతి' పత్రిక ఉపసంపాదకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ చేసిన 'మయ నాగరికత' అనే ప్రసంగంలోని వాక్యాలను గమనిస్తే- రేడియో తెలుగు ఎలా ఉండాలో కొంత విశదమవుతుంది. 'ఇతర గ్రహాలలో మానవులు ఉన్నారా?' అనే అంశం గురించి జడ్జిగా, చీఫ్ జస్టిస్‌గా పేరుపొందిన సర్ వేపా రామేశం గారితో జానకిరామ్ తొలి తెలుగు సైన్స్ ప్రసంగం చేయించారు. మద్రాసు ఆకాశవాణి నుంచి తొలి తెలుగు రేడియో పుస్తక సమీక్షను కోలవెన్ను రామకోటేశ్వరరావు చేశారు. 'నా స్మృతి పథంలో', 'సాగుతున్న యాత్ర' అనే రెండు భాగాలుగా 1957-1963 మధ్యకాలంలో ఆచంట జానకిరామ్ రాసుకున్న స్వీయచరిత్రను పరిశీలిస్తే ఇలాంటి సమాచారం మరెంతో లభిస్తుంది.
రేడియో మాధ్యమంలో మాట ఒకటే ప్రధానం. మరొక రకంగా చెప్పాలంటే ఇందులో శబ్దం, నిశ్శబ్దం మాత్రమే వాహికలు. వార్తాపత్రికలను కళ్లతో అందుకుంటాం; టెలివిజన్, నాటకం, సినిమా ద్వారా అయితే కళ్లతోపాటు చెవితో కూడా వాటిని స్వీకరిస్తాం. మాటలకు కళ్ళు మొలిపిస్తే, ఆ కళ్ళు చూడలేని అందాలు కానీ, లోకాలు కానీ ఉండవు. కనుకనే రేడియో మాధ్యమంలో భావనశక్తి, సృజనాత్మక యుక్తి ఎక్కువని మీడియా పరిశోధకులు చెబుతారు. రేడియోలో కళాకారుడిగా రాణించగలిగితే ఏ మాధ్యమంలోనైనా ఎదురుండదని అంటారు. ఎందుకంటే తక్కువ వనరులతో రక్తి కట్టించగలిగిన వ్యక్తి మిగతా చోట్ల విజయం పొందడం సులువు.
ట్రాన్సిస్టర్ అనే ఎలక్ట్రానిక్ వస్తువు ఆవిష్కరించబడటంతో రేడియో పరిమాణం బాగా తగ్గి, కదలికను సంతరించుకుంది. దాంతో ట్రాన్సిస్టర్ రేడియో అనే మాట క్రమంగా ట్రాన్సిస్టర్‌గా స్థిరపడింది. ఉపగ్రహ విజ్ఞానం, షార్ట్ వేవ్, టెలిఫోన్‌ను లైవ్ స్టూడియోకు అనుసంధానించడం, ఎఫ్.ఎం., మొబైల్ ఫోన్, కార్ రేడియో వంటి అధునాతన టెక్నాలజీ సదుపాయాలు రేడియోను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఎక్కువమందికి మంచి కలిగించేది, ఎక్కువమందికి సౌఖ్యాన్ని పంచేది అనే ఉద్దేశంతో ఆకాశవాణి 'బహుజన హితాయ బహుజన సుఖాయ' అనే మోటోను స్వీకరించింది. అదే పద్ధతిలో సమాచారం, సామూహిక విద్య, ఆరోగ్యకరమైన వినోదం అనే అర్థవంతమైన ప్రణాళికతో కార్యక్రమాలను రూపొందించింది. వార్తలను రికార్డు చేయకుండా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆకాశవాణి విధానం.
రేడియో నిజానికి ఒక ప్రజాస్వామ్యకమైన మాధ్యమంగా పరిగణించాలి. అంతవరకు రాజస్థానాలలోనే లభించే శాస్త్రీయ సంగీతం వంటి కళారూపం కూడా ఈ మాధ్యమానికి అనుగుణంగా పరిణమించి కుదిరించబడింది. హరికథలు, బుర్రకథలు, జానపద గీతాలు వంటివి మరింత మందిని సులువుగా చేరగలిగాయి. కేవలం రేడియో ద్వారానే రూపకల్పన చేయబడిన ప్రక్రియ లలిత గీతం. సినిమా కూడా ఆకాశవాణి ద్వారా పాటలు లేకుండా, ఒక గంటలో పూర్తయ్యే రీతిలో 'సంక్షిప్త శబ్ద చిత్రం' అనే కొత్త రూపు ధరించింది. ఆచంట జానకిరామ్, గుర్రం జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కురుగంటి సీతారామయ్య, భాస్కరభట్ల కృష్ణారావు, దాశరథి కృష్ణమాచార్య, త్రిపురనేని గోపీచంద్, జి.వి. కృష్ణారావు, తెన్నేటి హేమలత, బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, బాలాంత్రపు రజనీకాంతరావు, రావూరి భరద్వాజ, గొల్లపూడి... ఇలా ఎంతోమంది తెలుగు సాహితీవేత్తలు ఆకాశవాణిలో ఉద్యోగులుగా రాణించారు. ఇక కార్యక్రమాలలో పాల్గొన్న వారి గురించి పేర్కొనాలంటే తెలుగు ప్రముఖుల పేర్లన్నీ చెప్పుకోవాల్సి ఉంటుందేమో. విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం ఇలా మొదలైన ఆకాశవాణి కేంద్రాలు తర్వాతి దశలో ఎఫ్‌ఎం టెక్నాలజీని సంతరించుకుని ఆదిలాబాద్, వరంగల్, తిరుపతి, అనంతపురం, నిజామాబాద్, కొత్తగూడెం, మార్కాపురం ఇలా పలు కేంద్రాల ద్వారా వికేంద్రీకరించబడి విస్తరించాయి. ఈ కేంద్రాలు కూడా దేనికది స్వతంత్రంగా ఆయా ప్రాంతాల అవసరాలు, వనరులు బట్టి విభిన్న రేడియో ప్రక్రియలలో కార్యక్రమాలను రూపకల్పన చేసి, ప్రసారం చేసి ఆకట్టుకుంటున్నాయి.

- డా. నాగసూరి వేణుగోపాల్,
ప్రసార భారతి ప్రాంతీయ శిక్షణా కేంద్రం పూర్వ సంచాలకులు,
94407 32392

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్