ప్రపంచ సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతుల్లో బుకర్ ప్రైజ్ ఒకటి. ఒక రచయితకు బుకర్ దక్కిందంటే అది కేవలం ఒక అవార్డు కాదు; ప్రపంచవ్యాప్తంగా పాఠకుల దృష్టిని ఆకర్షించే గుర్తింపు. దశాబ్దాలుగా ఈ గౌరవం ప్రధానంగా వయోజన సాహిత్యానికే పరిమితమైంది. ఇప్పుడు తొలిసారిగా పిల్లల సాహిత్యానికి కూడా అదే స్థాయి గౌరవాన్ని అందించేందుకు బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. 8 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లల కోసం రాసిన ఉత్తమ కల్పనా సాహిత్యానికి "చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్"ను ప్రకటించింది. ఈ కొత్త అవార్డు 2026లో ప్రారంభమవుతుంది. తొలి విజేతను 2027లో ప్రకటిస్తారు. విజేతకు 50 వేల పౌండ్లు బహుమతి అందజేస్తారు. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 58 లక్షల రూపాయలు. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన ప్రతి రచయితకు కూడా 2,500 పౌండ్లు, అంటే దాదాపు మూడు లక్షల రూపాయల బహుమతి ఉంటుంది. ఈ బహుమతి మొత్తం పెద్దల కోసం ఇచ్చే ప్రధాన బుకర్ ప్రైజ్‌తో సమానంగా ఉంది. దీని ద్వారా బుకర్ ఫౌండేషన్ ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. పిల్లల కోసం రాసే సాహిత్యం కూడా పెద్దల సాహిత్యంతో సమానమైన గౌరవానికి అర్హమని ప్రపంచానికి చెబుతోంది.
ఈ అవార్డులో మరో విశేషం ఉంది. విజేతను ఎంపిక చేసే న్యాయనిర్ణేతల బృందంలో పిల్లలు కూడా ఉంటారు. పెద్దలతో పాటు ముగ్గురు బాల న్యాయనిర్ణేతలు తుది నిర్ణయంలో భాగస్వాములు అవుతారు. పిల్లల కోసం రాసిన పుస్తకాన్ని చివరికి అంచనా వేయగలిగేది పిల్లలేనన్న ఆలోచనకు ఇది ప్రతీక. బాలసాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు పిల్లల స్వరాన్ని వినాలనే ప్రజాస్వామిక దృక్పథం ఇందులో కనిపిస్తుంది. అయితే ఈ అవార్డును కేవలం సాహిత్య పురస్కారంగా మాత్రమే చూడకూడదు. ప్రతి సంవత్సరం షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన, విజేతగా నిలిచిన పుస్తకాలకు సంబంధించి 30 వేల కాపీలను పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. నేషనల్ లిటరసీ ట్రస్ట్, రీడింగ్ ఏజెన్సీ, బుక్‌బ్యాంక్స్, చిల్డ్రన్స్ బుక్ ప్రాజెక్ట్ వంటి సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంటే ఇది రచయితలకు బహుమతులు ఇవ్వడమే కాదు; పిల్లల్లో పఠన సంస్కృతిని పెంపొందించే సామాజిక ఉద్యమం కూడా.
చాలా మందిలో ఒక అపోహ ఉంది. బుకర్ వంటి అంతర్జాతీయ అవార్డులు ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల రచయితలకే పరిమితమని. కానీ వాస్తవం అది కాదు. ప్రపంచంలోని ఏ దేశ రచయిత అయినా అర్హత సాధించవచ్చు. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, కొరియా, ఆఫ్రికా దేశాలు – ఎక్కడి రచయిత అయినా ఈ పోటీలో నిలవవచ్చు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. ప్రధాన బుకర్ ప్రైజ్‌కు, అలాగే కొత్తగా ప్రకటించిన చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్‌కు పుస్తకం ఇంగ్లిష్‌లో ఉండాలి. అది యూకే లేదా ఐర్లాండ్‌లో ప్రచురించబడాలి. తెలుగు, తమిళం, సింహళం, హిందీ వంటి భాషల్లో రాసిన పుస్తకాలు నేరుగా ఈ అవార్డుకు అర్హత పొందవు. ఏ భాషలో రాసినా అది అత్యుత్తమ ఇంగ్లిష్ అనువాదంగా వెలువడి, యూకే లేదా ఐర్లాండ్‌లో ప్రచురించబడితే ఇంటర్నేషనల్ బుకర్‌కు అర్హత పొందుతుంది. కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ రచనలు ఇంగ్లిష్‌లోకి అనువదించబడిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ రచించిన "రేత్ సమాధి" ఇంగ్లిష్ అనువాదం "టూంబ్ ఆఫ్ సాండ్" పేరుతో ఇంటర్నేషనల్ బుకర్‌ను గెలుచుకుంది. కొరియన్, పోలిష్, అరబిక్, జపనీస్ భాషల రచయితలు కూడా ఇదే మార్గంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అంటే ప్రపంచ సాహిత్య పటంలో నిలవడానికి తప్పనిసరిగా ఇంగ్లిష్‌లోనే రాయాల్సిన అవసరం లేదు. కానీ అత్యుత్తమ అనువాదం మాత్రం అవసరం.
భారతీయ భాషల సాహిత్యం ప్రపంచస్థాయికి ఎందుకు పరిమితంగానే చేరుతోందనే ప్రశ్నకు కూడా ఇక్కడ సమాధానం కనిపిస్తుంది. మన దగ్గర మంచి రచనలు లేవు కాబట్టి కాదు. ప్రపంచ స్థాయి రచనలు ఉన్నాయి. కానీ వాటిలో చాలా వరకు ఆయా భారతీయ భాషల్లోనే పరిమితమైపోతున్నాయి. నాణ్యమైన అనువాదాలు తక్కువ. అంతర్జాతీయ ప్రచురణ వ్యవస్థలతో సంబంధాలు బలహీనంగా ఉన్నాయి. విదేశీ ప్రచురణకర్తల దృష్టికి చేరే ప్రయత్నాలు పరిమితంగా ఉన్నాయి. అందువల్ల భారతీయ భాషల సాహిత్య సంపద ప్రపంచ పాఠకులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఈ కొత్త చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్ నేపథ్యంలో భారతీయ బాలసాహిత్య రచయితలు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమ దేశంలోని పిల్లల కోసం మాత్రమే కాదు, ప్రపంచ పిల్లల కోసం కూడా కథలు రాయగలమా? మన గ్రామాలు, మన ప్రకృతి, మన జానపద సంపద, మన బాల్య అనుభవాలు, మన సంస్కృతిలోని విశ్వజనీన విలువలను ప్రపంచ పాఠకులకు చేరవేయగలమా? అనే ప్రశ్నలను వేసుకోవాలి.
ఇప్పటి వరకు భారతీయ బాలసాహిత్యం ఎక్కువగా పాఠశాలలు, పత్రికలు, స్థానిక ప్రచురణల పరిధిలోనే తిరిగింది. కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రచన, సంపాదకత్వం, చిత్రలేఖనం, అనువాదం, ప్రచురణ వంటి అంశాలను కొత్త కోణంలో చూడాల్సిన సమయం వచ్చింది. ప్రపంచ స్థాయి బాలసాహిత్యం ఎలా ఉంటుందో అధ్యయనం చేయాలి. నార్డిక్ దేశాలు, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో పిల్లల కోసం వెలువడుతున్న ఉత్తమ రచనలను చదవాలి. అదే సమయంలో మన నేల వాసనను, మన సంస్కృతి ప్రత్యేకతను కోల్పోకుండా కథలు చెప్పాలి. అందుకు మొదటి అడుగు అవార్డు గెలవాలని కలగనడం కాదు. ప్రపంచ ప్రమాణాలతో నిలిచే గొప్ప రచనలు సృష్టించడం. రెండో అడుగు వాటిని అత్యుత్తమంగా అనువదించడం. మూడో అడుగు ప్రపంచ పాఠకుల ముందుకు తీసుకెళ్లడం. చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్ వంటి కొత్త అవకాశాలు ఆ ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రపంచం ఇప్పుడు పిల్లల సాహిత్యాన్ని మరింత గౌరవంగా చూస్తోంది. భారతీయ బాలసాహిత్యానికి ఇది ఒక కొత్త అవకాశం. ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ వంటి భారతీయ భాషల రచయితలు తమ రచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రశ్న ఒక్కటే. భారతీయ బాలసాహిత్యం, ముఖ్యంగా తెలుగు బాలసాహిత్యం, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందా?
- సత్యాజీ
94900 99167
బాలసాహిత్యంలోనూ బుకర్ బహుమతి!
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 08, 2026, 06:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)