test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎమర్జెన్సీని ధిక్కరించిన శేషేంద్రుడి గొరిల్లా

25 మే, 2026

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఇది ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శతజయంతి (20.10.1927 – 20.10.2026) సంవత్సరం. అలాగే ‘ఆధునిక మహాభారతం’లో శేషేంద్ర “పశు పర్వం” కావ్యానికి స్వర్ణోత్సవం (1976 – 2026). “కాలాన్ని నా కాగితం చేసుకుంటా! దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా.. దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తాను” అంటూ పేర్కొన్న గుంటూరు శేషేంద్రశర్మ రచించిన “ఆధునిక మహాభారతం” అనేక కావ్యాల సమాహారం. ఇందులో ‘నా దేశం.. నా ప్రజలు’, ‘మండే సూర్యుడు’, ‘గొరిల్లా’, ‘అరుస్తున్న ఆద్మీ’, ‘సముద్రం నా పేరు’, ‘నీరై పారిపోయింది’, ‘ప్రేమ లేఖలు’, ‘శేషజ్యోత్స్న’ వంటి కావ్యాలున్నాయి. ఇందులో “గొరిల్లా”లోని “పశు పర్వం” రచనకు 2026 మే నెలతో 50 ఏళ్లు నిండుతాయి. అంటే, స్వర్ణోత్సవమన్నమాట. ‘ఆధునిక మహాభారతం’ (1970–1986) భారతదేశంలో భూమికోసం ప్రజలు చేసిన యుద్ధానికి అద్దం పడ్తుంటే, ఈ “పశు పర్వం” మాత్రం 1975లో మన దేశంలో విధించిన “అత్యవసర పరిస్థితి” (ఎమర్జెన్సీ)కి నిలువెత్తు సాక్ష్యంలా నిలిచింది. సమకాలీన తెలుగు కవిత్వంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వచ్చిన తొలికావ్యం కూడా “పశు పర్వమే” కావడం విశేషం. ఆ సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎవరైనా కవులు, రచయితలు తమ గళం వినిపిస్తే వారికి సంకెళ్లు, కారాగారవాసం ప్రాప్తమయ్యేది. ఈ పరిస్థితుల్లో శేషేంద్రశర్మ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఈ “పశు పర్వం” రాశారు. నాటి ఎమర్జెన్సీ నిరంకుశ పదఘట్టనల మధ్యనే రవీంద్రభారతిలో ఈ కావ్యాన్ని స్వయంగా చదివి వినిపించారు. అయితే, నాటి పరిస్థితుల దృష్ట్యా ఈ కావ్యంలో ఎక్కడా నేరుగా ఎమర్జెన్సీ పేరు గానీ, ప్రస్తావన గానీ లేకుండా జాగ్రత్తపడ్డారు. ఈ కావ్యాన్ని నిశితంగా చూస్తే నాటి ఎమర్జెన్సీ నీలినీడలు, జరిగిన దారుణాల శకలాలు కనిపిస్తాయి. అంతా ధ్వనిపూర్వకమే!
​కావ్య నేపథ్యం​
1975 జూన్‌ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ప్రజల హక్కులు హరించుకుపోయాయి. దేశంలో 21 నెలల పాటు నియంతృత్వ పాలన కొనసాగింది. అంతర్గత అలజడుల పేరుతో ప్రతిపక్ష నేతలను అన్యాయంగా జైలుకు పంపారు. అలహాబాద్‌ హైకోర్టు ఎన్నికల కేసులో మాజీ ప్రధాని ఇందిరాకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆమె దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నిర్ణయం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోయింది. 1975–77 మధ్యకాలంలోని 21 నెలల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలోని 352(1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ ద్వారా 1975 జూన్‌ 25 అర్ధరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించారు. 1977 మార్చి 21న ఉపసంహరించే వరకూ కొనసాగింది.
​ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ, ఎన్నికలను నిలిపివేసి, పౌరహక్కులను అడ్డుకునే అధికారాన్ని ప్రధానమంత్రికి ఈ ఆర్డర్‌ ద్వారా దఖలు చేశారు. ఎమర్జెన్సీలో ప్రధానంగా ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్‌ చేశారు. ప్రధాని కుమారుడు సంజయ్‌ గాంధీ ముందుండి నడిపిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వంటి ఇతర దురాగతాలు కూడా జరిగాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత దుర్భర కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటి. చిత్రమేమంటే, కొంతమంది తెలుగు కవులు నాటి ఎమర్జెన్సీని సమర్థిస్తూ కవితలు, గేయాలు రాశారు. 1975లో రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించిన 36 పేజీల “దీక్ష” కవితా సంకలనంలో ఈ కవుల కవితలు, గేయాలు ప్రచురింపబడ్డాయి. ఈ కవితా సంకలనాన్ని “అన్యాయాలు, అక్రమాలపై తెలుగు కవుల తిరుగుబాటు”గా ప్రకటించారు. అయితే అక్రమాలు, అన్యాయాలేమిటో చెప్పలేదు. అవి ఎవరు చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో? తెలుపనే లేదు. 1975లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కేంద్ర ముద్రణాలయంలో మొత్తం 10,000 కాపీలను ముద్రించి ప్రజలకు పంచిపెట్టారు. అందులో కవితలు రాసినవారిలో దాశరథి, డాక్టర్‌ సి. నారాయణరెడ్డి, డాక్టర్‌ బోయి భీమన్న, డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని, ముదిగొండ వీరభద్రమూర్తి, ఉత్పల, జె. బాపురెడ్డి, పరిమళా సోమేశ్వర్‌, డాక్టర్‌ వేటూరి ఆనందమూర్తి, ఎస్‌. మునిసుందరం, పి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయశాస్త్రి, గుత్తికొండ సుబ్బారావు, జ్యోతిర్మయి, విహారి, శాలివాహన, లసూనా, తల్లాప్రగడ భద్రిరాజు, దేవీప్రియ తదితరులు ఉన్నారు.
​శేషేంద్ర ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ “పశు పర్వం” కావ్యాన్ని రచించారు. ఈ కావ్యంలో ఎక్కడా నేరుగా “ఎమర్జెన్సీ” అనే పదం వినిపించదు. కానీ ధ్వనిపూర్వకంగా నాటి అణచివేత, భయానక పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. అందుకే ఇది తెలుగు సాహిత్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వచ్చిన తొలి ధిక్కార కావ్యాలలో ఒకటిగా నిలిచింది. ఈ కావ్యంలో నాలుగు సర్గలు ఉన్నాయి. ప్రతి సర్గ కూడా నాటి ఎమర్జెన్సీ క్రౌర్యాన్ని ప్రతిబింబిస్తుంది. మొదటి సర్గలో
“రాత్రి నిద్ర కోల్పోయి ఇళ్ళ కప్పుల మీద మొరుగుతోంది” అంటూ భయంతో మూగబోయిన సమాజాన్ని చిత్రిస్తాడు. “కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది” అంటూ కవి తన ప్రతిఘటన స్వరాన్ని వినిపిస్తాడు.
“సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు
పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు” అంటూ అధికార దురహంకారాన్ని సవాలు చేస్తాడు.
రెండో సర్గలో- “నీ ఆకాశాన్ని అమావాస్య కబళించింది” అంటూ చీకటి రాజకీయ పరిస్థితులను ప్రతీకాత్మకంగా చిత్రిస్తాడు.
“బాబూ, నదిలో ఇవాళ మనమంతా మునిగిపోతే పోవచ్చు
కానీ నదే సముద్రంలో మునిగిపోయే రోజు రాకపోదు” అంటూ ప్రజా చైతన్యంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాడు.
మూడో సర్గలో - “ఒకనాడు కాలమేఘంలా గర్జించిన ఈ దేశం/ ఈనాడు మ్యావ్ మంటోంది” అంటూ దేశం కోల్పోయిన స్వేచ్ఛపై ఆవేదన వ్యక్తం చేస్తాడు.
“మళ్ళీ స్వేచ్ఛ ఈ దేశంలో తిండిలేనిదై గడ్డితిని బ్రతుకుతోంది” అనే పాదం ఎమర్జెన్సీ కాలపు దమనకాండను తీవ్రంగా ప్రతిబింబిస్తుంది.
నాలుగో సర్గలో - “నియంతలు ప్రశ్నల్ని ఎదుర్కోలేరు” అంటూ ప్రజా చైతన్యానికి పిలుపునిస్తాడు.
“ఓ గొరిల్లా!
మనిషిలో నిద్రిస్తున్న ఓ క్రియాశక్తీ!
నిద్రలే!” అంటూ చైతన్యాన్ని మేల్కొలుపుతాడు.
ఇందులో ఎమర్జెన్సీ పశు పర్వమైతే, “గొరిల్లా” జనచైతన్యానికి ప్రతీక. అర్జునుడు గాండీవం ఎత్తినట్లు, శేషేంద్ర కలాన్ని ఎత్తాడు. “కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది” అనే ఆయన వాక్యం నేటికీ యువతను ఉత్తేజితం చేస్తోంది.
(మే 30: గుంటూరు శేషేంద్రశర్మ వర్ధంతి)
- ఎ. రజా హుస్సేన్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్