కవిత్వంలో ఆత్మవ్యక్తీకరణ అధికమై, సామాజిక దృక్పథానికి చోటు లేని తరుణంలో తెలుగు సాహిత్యంలోకి అభ్యుదయ కవిత్వం అడుగు పెట్టింది. ఈ దశలో భావ కవిత్వంపై తిరుగుబాటు చేస్తూ, తెలుగు కవిత్వంలో సరికొత్త ప్రక్రియలకు ఆహ్వానం పలుకుతూ నలుగురు కవులు నల్దిక్కులా నిలబడ్డారు. వారే శిష్ట్లా, శ్రీశ్రీ, నారాయణబాబు, పట్టాభి. ఈ నలుగురూ వారి కవిత్వపు తొలి దినాల్లో భావకవిత్వపు రుచి చూసినవారే. పాశ్చాత్య సాహిత్యంలోని అతినవ్య రీతుల ప్రభావం, దేశంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలు అన్నీ కలగలిపి వీరిని అభ్యుదయ కవులుగా మలిచింది. వీరిలో తనను తాను జ్వలనా లలనా ప్రియుడుగా, విప్లవఋషిగా, విద్రోహకవిగా ప్రకటించుకున్న కవి శ్రీరంగం నారాయణబాబు.
1906, మే 15న విజయనగరంలో జన్మించిన నారాయణబాబుకి చిన్నప్పటినుండీ నాటకాలంటే సరదా. బాల్యంలోనే కవిత్వం పట్ల, సంగీతం పట్ల అభిరుచి వున్న తన చదువు స్కూలు ఫైనల్ దాటలేదు. రోణంకి అప్పలస్వామి, చాసో, శ్రీశ్రీ, ఆరుద్రలతో సాన్నిహిత్యం సాహిత్యాభిరుచిని పెంచింది. 1920 తర్వాత కాళ్లూరి నరసింహరావుతో స్నేహం కవిగా మలిచింది. 1926లో నారాయణబాబు, కాళ్లూరి, పూడిపెద్ది వెంకట రమణయ్య, శ్రీశ్రీ సభ్యులుగా “కవితా సమితి” ఏర్పడింది. వీళ్ళందర్లో శ్రీశ్రీ వయసులో చిన్నవాడైనా, పాశ్చాత్య సాహిత్య విప్లవాలను, సరికొత్త ప్రక్రియలను అధ్యయనం చేయడంలో పెద్దవాడు.
మార్క్సిస్టు దృక్పథంతో దూసుకుపోతున్న అభ్యుదయపు భావజాలం పట్ల ఆకర్షితుడయ్యాడు నారాయణ బాబు. తన భావావేశానికి తగిన వేదికగా అభ్యుదయ మార్గాన్ని ఎంచుకున్నాడు. భావకవిత్వంపై తిరుగుబాటు చేశాడు. కమ్మని కోకిల రాగాలకు, వెన్నెల విహారాలకు, కన్నగాలి కౌగిళ్లకు కాలం చెల్లిందన్నాడు. నారాయణబాబు సంప్రదాయ మార్గాన్ని వ్యతిరేకించినా, అతని కవిత్వంలో సంప్రదాయపు పరిభాష, ప్రతీకలు పుష్కలంగా కనిపిస్తాయి. సంప్రదాయ ప్రతీకలతో ఆధునిక భావ చైతన్యాన్నీ, అభ్యుదయ భావనను స్ఫురింపజేయడం ఒక్క నారాయణ బాబుకే చెల్లింది. ఈ రచనా శిల్పమే “రుధిరజ్యోతి” కావ్య సంకలనం నిండా కనబడుతుంది. ప్రతీకవాద ధోరణిలో నారాయణ బాబు రాసిన అద్భుత గేయం “గడ్డిపరక”. మనిషిని మనిషి దోపిడీ చేయడమే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధాన లక్షణం. ఈ గేయమంతా కష్టజీవులకి, వారిని పీడిస్తున్న వాళ్లకి మధ్య గల వ్యత్యాసాన్ని వ్యక్తం చేస్తుంది. ఇందులో సమాజంలో పీడనకు గురయ్యే మనిషికి ప్రతీకగా గడ్డిపరకను తీసుకున్నాడు. “నడవండి! నడవండి! నా మీంచి నడవండి. గడ్డిపరకను!” అంటూ కవితను ప్రారంభిస్తాడు. కవిత చివర్లో గడ్డిపరక తన శక్తిని తాను గుర్తించగలుగుతుంది. ఈ చైతన్యాన్నే కవి సమాజంలోనూ ఆశించాడు. సామాజిక అవ్యవస్థత మీద, అసమ సమాజం మీద తిరుగుబాటు చేశాడు. 1930 తర్వాత నారాయణ బాబు భావావేశం తీవ్ర రూపం దాల్చింది. విప్లవీరుడు భగత్ సింగ్ ఉరితీత తనను నిద్ర పోనివ్వలేదు. ఈ విషాద సంఘటనను వీరరస ప్రధానంగా “కపాలమోక్ష”మనే కవిత రాశాడు. “భారత వీరుని కపాలమొక్కటి కపర్ది చేతిని రివ్వున వాలిందంటూ” భగత్ సింగ్ త్యాగాన్ని, దేశభక్తిని హిమాలయ శిఖరాగ్రమున నిలబెట్టాడు.
తెలుగులో మొట్టమొదటి “ఇమేజిస్ట్ కవి”గా నారాయణబాబు గుర్తింపు పొందాడు. భావచిత్రవాదంలో కూడా వినూత్న ప్రయోగాలు చేశాడు. ప్రపంచ సాహిత్యంలో 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పదమైన కవిగా పేరొందిన “ఎజ్రా పౌండ్” (1885-1972) అనే అమెరికన్ కవి , విమర్శకుడు “Imagist” అను పదాన్ని ప్రతిపాదించాడు. వ్యక్తీకరణలో సంక్షిప్తత ప్రధానంగా, వర్ణనలు లేకుండా, అస్పష్టతకు తావు లేకుండా భావచిత్రాలను కవితలో ప్రయోగించడమే భావచిత్రవాదం. ఒక విధంగా చెప్పాలంటే పదాలతో బొమ్మలు గీయడం లాంటిది. వర్తమాన సామాజిక స్థితిని తెలియజేసే విధంగా భావచిత్ర వాదంతో నారాయణబాబు రాసిన కవిత “ఊరవతల”. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రాసిన కవిత భారతదేశపు కరువు కాటకాలను ప్రతిబింబిస్తుంది.
వాస్తవికతవాదానికి (Realism) పెద్దపేట వేస్తూ రాసిన కవిత “దేశమాత”. కనీస అవసరాలకు కూడా నోచుకోని సామాన్యుల జీవన స్థితిగతులకు అద్దం పడుతూ, దేశంలో అధిక సంఖ్యాకులు అనుభవిస్తున్న దారిద్రాన్ని ధ్వనింపజేసే విధంగా ఉంటుందీ కవిత. చాలీచాలని చిరిగిన చీరలో, గుప్పెడు అన్నం, గుక్కెడు నీళ్లు కోసం పరితపిస్తున్న బిచ్చగత్తెని కవిత వస్తువుగా చేసుకొని, దేశ దౌర్భాగ్యాన్ని మన కళ్ళముందుంచాడు.
సంక్షిప్తత నారాయణబాబు కవిత్వంలో కనిపించే మరొక ప్రధాన లక్షణం. చిన్న చిన్న వాక్యాలతో గుండెను తాకేలా భావాన్ని వ్యక్తం చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య. తన కాలం నాటి సామాజిక చైతన్య స్వరూపాన్ని అర్థం చేసుకొని, తన కాలానికి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో గుర్తించి అంతవరకు మాత్రమే రచన సాగించాడు. “విశాఖపట్నం” అనే కవితలో ఆధునిక నగర జీవితాన్ని అద్భుతంగా చిత్రించాడు. నిత్యం ప్రమాదాలు జరిగే రోడ్లను, ఇరుకు కొంపలను, కుళ్ళు కాలువలను, నీళ్లకోసం ఆడవాళ్ళ అగచాట్లను, పీడించుకు తినే ప్లీడర్లను … ఇలా ఒకటేమిటి అన్ని అంశాలను స్పృశిస్తూ, విశాఖపట్నమంతా మనకు చూపిస్తాడు.
1972లో ఆరుద్ర చొరవతో “రుధిరజ్యోతి” కావ్యసంపుటి ప్రచురితమైంది. ఇందులోని కవితలన్నీ 1935-1959 మధ్యకాలంలో జ్వాల, ఆనందవాణి, భారతి, ఢంకా, నవశక్తి, ప్రతిభ వంటి పత్రికలలో అచ్చయినవే. “నీ పాటల కత్తులతో, నా హృదయం నెత్తురు తీసి, నే వెలిగించిన ఈ దీపపు కాంతిని నర్తింపుమురా శ్రీశ్రీ,” అంటూ రుధిరజ్యోతి కావ్యంలో శ్రీశ్రీ పట్ల తనకున్న ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నాడు నారాయణ బాబు. వరుసకు సోదరుడైన శ్రీశ్రీ సినిమాల కోసం మద్రాసు వెళ్ళిపోతే, కొద్ది రోజుల తర్వాత నారాయణబాబు కూడా మద్రాసు చేరుకున్నాడు. జీవితాంతం బ్రహ్మచారిగా జీవించిన నారాయణబాబు అక్టోబరు 2, 1961న అనారోగ్యంతో మద్రాసులో తనువు చాలించి, తెలుగు కవిత్వాకాశాన ఇప్పటికీ రుధిర జ్యోతిగా వెలుగొందుతూనే ఉన్నాడు.
(మే 15 : శ్రీరంగం నారాయణబాబు జయంతి)
- డాక్టర్ బొద్దూరు విజయేశ్వర రావు
94905 44551








కామెంట్లు (0)