test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా...

6 రోజుల క్రితం

teacher
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని విద్యార్థుల్లో నమ్మకం నూరిపోస్తుంటారు ఆమె. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే విజయం తప్పకుండా సొంతమవుతుందనేది చెబుతారు. జీవితంలో ఎదగడానికి అంగవైకల్యం అడ్డంకి కాదని తానే ఒక ఉదాహరణగా నిలిచారు. వేలాది మంది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. *ఆమె పారెళ్ల పుష్పావతి.


​ గుంటూరు నగరానికి చెందిన సామ్రాజ్యం, గురుమూర్తి దంపతుల కుమార్తె పుష్పావతి. ప్రస్తుతం మంగళగిరి మండలం పెద వడ్లపూడి మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూలులో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి రిక్షా కార్మికుడు. నలుగురు పిల్లలతో కుటుంబ జీవనం ఎంతో కష్టంగా సాగేది. అయినప్పటికీ విద్యే పేదరికాన్ని పారద్రోలే ఆయుధమని నమ్మి కిరోసిన్ దీపం వెలుగులో కష్టపడి చదివారు. డీఎస్సీలో ర్యాంకు సాధించి 1995లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. గుంటూరులోని శ్రీ శారదా నికేతన్‌లో ప్రాథమిక విద్య, బండ్లమూడి హనుమాయమ్మ పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆర్‌వీఆర్ కళాశాలలో బీఈడ్‌, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు.


​ 1998లో ‘అక్షర దీప్తి’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో వయోజనులకు రాత్రి బడులు నిర్వహించి అనేక మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. తాను పనిచేసిన బేతపూడి గ్రామంలో పాఠశాలకు వెళ్లని పిల్లలు, వయోజనులకు సాయంత్రం వేళ ఉచితంగా బోధించేవారు. 2000లో మంగళగిరి మండలానికి గర్ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేశారు. బాలికల విద్యాభివృద్ధికి కృషి చేశారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంచుతున్నారు. సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ ‘జాయ్‌ఫుల్ లెర్నింగ్’ పద్ధతిలో బోధిస్తున్నారు. పిల్లలను యూ ఆకారంలో కూర్చోబెట్టి బోధించడం ద్వారా అందరూ చదువులో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు.


​ తల్లి ప్రేమకు దూరమైన ఇద్దరు పిల్లలను 2001లో అక్కున చేర్చుకుని సొంత పిల్లల్లా పెంచి పెద్ద చేశారు. ప్రస్తుతం వారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇది ఆమె నిస్వార్థ సేవాభావానికి నిదర్శనం. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ఇంటింటికీ తిరిగి నిత్యావసరాలు, దుప్పట్లు, మాస్కులు పంపిణీ చేశారు. పేదలకు మందులు కూడా అందజేశారు. తాను చదివిన పాఠశాలలో ఓఎస్‌ఏ సభ్యురాలిగా కొనసాగుతూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.


​ పుష్పావతి మంచి గాయని కూడా. సామాజిక అంశాలకు సంబంధించిన పాటలను సందర్భానుసారంగా ఆలపించడంలో ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పలు వేదికలపై పాటలు పాడారు. బాలోత్సవాల కమిటీ నిర్వహించే పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆమె చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులంతా అండగా నిలుస్తున్నారు. ఏపీఎస్‌పీడీసీఎల్‌లో ఏఈగా పనిచేస్తున్న భర్త ఏడుకొండలు సహకరిస్తున్నారు. చిన్న కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి సిద్ధమవుతున్నారు. పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని బలహీనతగా కాకుండా ప్రేరణగా మలుచుకున్న పుష్పావతి నిజమైన స్ఫూర్తిదాయని.

ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు! చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పిస్తున్నాం. పిల్లలు భావి భారత పౌరులుగా ఎదగాలంటే చదువుకునే రోజుల్లోనే సరైన మార్గనిర్దేశం అవసరం. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం మరొకటి లేదని విద్యార్థులకు చెబుతుంటా. పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలియజేస్తున్నా. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఆనందాన్ని ఇస్తుంది.

– పారెళ్ల పుష్పావతి, సెకండరీ గ్రేడ్ టీచర్‌, పెదవడ్లపూడి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా.


కాలిగ్రఫీ నిపుణులు ఉప్పాల రామ్మోహన్‌రావు వద్ద శిక్షణ పొందిన ఆమె, గత నాలుగేళ్లుగా గుంటూరు, తెనాలి, మంగళగిరి, చిలకలూరిపేట ప్రాంతాల్లో వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉచితంగా కాలిగ్రఫీ నేర్పిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 90 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయ బృందంతో కలిసి శిక్షణ ఇచ్చారు. ఎస్సీఈఆర్‌టీ ద్వారా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల తయారీ విభాగంలో కూడా ఆమె తన ప్రతిభను చాటుతున్నారు. ప్రయత్నం చేస్తే దేన్నయినా సాధించొచ్చు. అందుకు నేనే ఒక నిదర్శనం అంటూ - విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఆమె కృషి అభినందనీయం!


– యడవల్లి శ్రీనివాసరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్