test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సరైన మార్గనిర్దేశనం అవసరం!

25 మే, 2026

parenting
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 06:15 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

నేటి వేగవంతమైన జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, చదువు, లక్ష్యాల సాధనల మధ్య ప్రతి ఒక్కరూ నిరంతరం ఉరుకులు, పరుగుల జీవితాన్నే గడుపుతున్నారు. తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ పోటీ ప్రపంచపు పరుగులో కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు కేటాయించాల్సిన సమయం క్రమంగా తగ్గిపోతోంది. కానీ పిల్లలకు అందించాల్సిన అత్యంత విలువైన బహుమతి ఖరీదైన వస్తువులు కాదు; తల్లిదండ్రుల సమయం, ప్రేమ, శ్రద్ధ, సరైన మార్గనిర్దేశనం. ఎందుకంటే పిల్లల పెంపకం కేవలం కుటుంబ బాధ్యత మాత్రమే కాదు; అది సమాజం, దేశ భవిష్యత్తును నిర్మించే ప్రక్రియ. నేటి పిల్లలే రేపటి పౌరులు, నాయకులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. వారి వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబంతోనే ప్రారంభమవుతుంది.

పిల్లల పెంపకంలో ప్రేమ, క్రమశిక్షణ, స్వేచ్ఛ, బాధ్యతల సమతుల్యతే మంచి వ్యక్తిత్వానికి పునాది. పిల్లలు మన మాటలు విని కాకుండా, మన ప్రవర్తనను చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు మనమే మంచి ఆదర్శంగా నిలవాలి. ఇంట్లో లభించే ప్రేమ, ప్రోత్సాహం, భద్రత పిల్లల శారీరక, మానసిక వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. పిల్లలను చిన్నప్పటి నుంచే సరైన దారిలో నడిపించడం సులభం. ఒకసారి దారితప్పిన తర్వాత వారిని తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావడం ఎంతో కష్టం. దారితప్పిన పిల్లలను సరిదిద్దడం కంటే, ముందుగానే సరైన దారిలో నడిపించడం సులభం.
పిల్లలను మన ఆలోచనల మూసలో బంధించకూడదు. వారి కలలను వారే కనాలి; వాటిని సాకారం చేసుకునే దారిని చూపించడం పెద్దల బాధ్యత. వారి లోపాలను ఎత్తిచూపడం కంటే, బలాలను గుర్తించి ప్రోత్సహించడం అవసరం. సహజంగా పిల్లల్లో ఉండే కుతూహలం, ప్రశ్నించే తత్వం, తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించాలి. అలాంటి వాతావరణం కల్పిస్తే వారు స్వయంగా నేర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. పిల్లలకు సమాధానాలు చెప్పడం కంటే, ప్రశ్నలు అడిగే ధైర్యం కల్పించాలి.
టీనేజ్ దశ భావోద్వేగాల కలయిక. ఈ వయసులో పిల్లలు అనేక సందిగ్ధతలు, ఒత్తిడులు, కొత్త అనుభవాలను ఎదుర్కొంటారు. “ఇంత పెద్దవాడివయ్యావు... ఇది కూడా తెలియదా?” అని మందలించడం కంటే, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలి. చిన్నప్పటి నుంచే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కల్పించి, వాటి ఫలితాలకు బాధ్యత వహించడం నేర్పితే వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. తల్లిదండ్రులు ఆదేశించే వారిగా కాకుండా, వినే వారిగా మారితే పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా పంచుకుంటారు. ప్రతి పిల్లవాడి ఆసక్తి, ప్రతిభ వేరు. కొందరికి సైన్స్‌, మరికొందరికి కళలు, క్రీడలు, సంగీతం లేదా సాంకేతిక రంగాలు ఇష్టమవుతాయి. తల్లిదండ్రుల అభిరుచులనే పిల్లలపై రుద్దడం సరైంది కాదు. వారి ప్రతిభను గుర్తించి అభివృద్ధి చెందే అవకాశాలు కల్పించాలి. ప్రతి పిల్లవాడు ఒక ప్రత్యేక ప్రపంచం; అందరినీ ఒకే కొలమానంతో కొలవలేం.
ప్రేమ అవసరం. కానీ ప్రేమ పేరుతో పిల్లల కోరికలన్నీ వెంటనే తీర్చడం సరైంది కాదు. ప్రతి వస్తువు వెనుక ఉన్న శ్రమ, విలువ వారికి తెలియాలి. లేదంటే కోరింది దక్కనప్పుడు నిరాశ, అసహనం, ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి వస్తువులు కొనివ్వడం, కష్టపడి సంపాదించిన దాని విలువను తెలియజేయడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు చేసే ప్రతి తప్పును గారాబంతో సమర్థించడం కూడా మంచిది కాదు. తప్పు చేసినప్పుడు అవమానపరచకుండా ప్రేమతో, దృఢంగా సరిదిద్దాలి. అప్పుడు వారిలో బాధ్యతాభావం పెరుగుతుంది. ప్రతి కోరిక తీర్చడం ప్రేమ కాదు; అవసరాన్ని గుర్తించడం నిజమైన ప్రేమ.
కొంతమంది తల్లిదండ్రులు అధిక క్రమశిక్షణే విజయానికి మార్గమని భావిస్తారు. కానీ అతిగా నియంత్రిస్తే పిల్లలు స్వేచ్ఛ కోల్పోయిన భావనకు గురవుతారు. ఇంట్లో ఒకలా, బయట మరోలా ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది. ఈ తరం పిల్లల ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది. అందుకే వారితో సంభాషిస్తూ, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలి. భయంతో విధేయత రావచ్చు; ప్రేమతో వ్యక్తిత్వం వికసిస్తుంది.
పిల్లల ఎదుగుదలలో జరిగే శారీరక, మానసిక మార్పుల గురించి తల్లిదండ్రులకు శాస్త్రీయ అవగాహన ఉండాలి. మూఢనమ్మకాల కంటే విజ్ఞానపూర్వక దృక్పథాన్ని అలవాటు చేస్తే పిల్లలు కూడా విషయాలను హేతుబద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటారు. ప్రవర్తనలో మార్పులు, ఒత్తిడి, ఆందోళన, ఆత్మవిశ్వాస లోపం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి స్పందించడం అవసరం. డిజిటల్ ప్రపంచం ఎంత అవసరమో, నిజ జీవిత సంబంధాలు అంతకంటే ముఖ్యమని వారికి తెలియజేయాలి. సోషల్ మీడియా ప్రభావం, ఆన్‌లైన్ స్నేహాలు, అపరిచిత వ్యక్తులతో పరిచయాలు వంటి అంశాలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. స్మార్ట్‌ఫోన్ పిల్లల చేతిలో ఉండొచ్చు; కానీ పిల్లల భవిష్యత్తు దాని చేతిలో పడకూడదు.
నేటి సమాజంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు వంటి ప్రముఖ కుటుంబాలకు చెందిన కొంతమంది యువత తప్పుదారులు పట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. సంపద, హోదా, ప్రభావం పిల్లలకు అవకాశాలను ఇవ్వగలవు గానీ, మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించలేవు. పిల్లలకు క్రమశిక్షణ, నైతిక విలువలు, ఇతరుల పట్ల గౌరవం నేర్చుకోవడం అత్యవసరం. ఆస్తులు వారసత్వంగా ఇవ్వవచ్చు; కానీ విలువలు మాత్రమే తరతరాలకు నిలిచే సంపద. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో సమయం ఇవ్వలేకపోతున్నారు. పిల్లలకు ఖరీదైన బహుమతుల కంటే ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం ఎంతో విలువైనది. వారితో మాట్లాడండి. వారి స్నేహితులు, అభిరుచులు, ఆందోళనలు తెలుసుకోండి. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, చిన్న ప్రయాణాలు చేయడం, పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు అనుబంధాలను బలపరుస్తాయి. అప్పుడు పిల్లలు వస్తువులతో కాదు, మనుషులతో జీవించడం నేర్చుకుంటారు.

- డాక్టర్ పి. సూర్య నాగి రెడ్డి లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 
కల్యాణదుర్గం, అనంతపురం జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్