test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాలలకెందుకు బతుకు ఇక్కట్లు?!

31 మే, 2026

balyam 3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 31, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

బాల్యం అందమైన బహుమతిలా ఉండాలి. అందులో ఎన్నో సంతోషాలు, మరెన్నో ఆనందాలు వెల్లివిరియాలి. ఆకలి, దప్పికకు అక్కడ అసలు స్థానం ఉండకూడదు. అన్నీ సమృద్ధిగా, సౌకర్యవంతంగా ఆ పిల్లలకు అందాలి. కానీ ఇటీవల ‘మండుటెండలో పాపం పసివాళ్లు’ అంటూ గుంటూరు జిల్లా నగరంపాలెం ఈద్గా వద్ద మండుటెండలో రోడ్డుపై కూర్చొని భిక్షమెత్తుకుంటున్న పిల్లల ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఆ పిల్లలందరూ అర్ధనగ్నంగా ఒక చిన్న మాసిన పాత గుడ్డను నేలపై పరచి దానిపై కూర్చొన్నారు. మరోచోట మధ్యప్రదేశ్ మాలీ గ్రామంలో నీటి సంక్షోభాన్ని ప్రతిబింబించేలా ‘స్కూలు బ్యాగులు మోయాల్సిన పిల్లలు నీటి బిందెలు మోస్తున్నారు’ అంటూ ఓ వార్త వైరల్ అయ్యింది. భిక్షాటన చేసే ఆ పిల్లలు, తమ శక్తికి మించి కిలోమీటర్లు నడిచి మరీ నీరు తెచ్చుకుంటున్న ఈ చిన్నారులు అందరూ బడి ఈడు పిల్లలు. కానీ వారికి బడి, చదువు అందని ద్రాక్షలు. ఆర్థిక కష్టాలు, పర్యావరణ సంక్షోభాలు, యుద్ధాలు, కరువులు, వరదలు… ప్రతి ఒక్కటీ పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్నాయి.


ప్రభుత్వాల గణాంకాల్లో అధికారికంగా దేశవ్యాప్తంగా 45 వేలకు పైగా చిన్నారులు వీధుల్లో భిక్షం ఎత్తుకుంటున్నారు. అనధికారికంగా ఆ సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. పేదరికం, మానవ అక్రమ రవాణా వల్ల ఈ పిల్లలు బలవంతంగా భిక్షాటనలోకి నెట్టివేయబడుతున్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే భిక్షాటన ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల తీవ్ర పేదరిక కుటుంబాల్లోని కొంతమంది తల్లిదండ్రుల సోమరితనం పిల్లలను భిక్షాటనవైపు నడిపిస్తుంది. మరికొన్ని చోట్ల అక్రమ రవాణా ముఠాలు పిల్లలను యాచకులుగా మార్చేస్తాయి. ఈ ముఠాలు పిల్లలపై జాలి కలిగేలా వాళ్లను నానా హింసలు పెడతాయి. అనారోగ్యంగా కనిపించేలా మత్తుమందులు ఇస్తాయి. ఇంకా అనేక రకాల చిత్రహింసలకు గురిచేస్తాయి.

balyam 2

ఒక్క పూట తిండి కోసం….

భిక్షాటన చేసే పిల్లల్లో చాలామంది బడి మానేసినవారు లేదా అసలు ఏ పాఠశాలలోనూ చేరనివారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆచరించే నిర్బంధ విద్య అమలు ఈ పిల్లలను బడిబాట పట్టించడం లేదు. భిక్షాటన వైపు పిల్లలను మళ్లించడం చట్టవిరుద్ధం. అయినా అవేమీ ఈ పిల్లలను ఆ వైపు వెళ్లనీయకుండా ఆపడం లేదు. ‘బాలల న్యాయ చట్టం–2015’ సెక్షన్ 76 ప్రకారం భిక్షాటన కోసం పిల్లలను నియమించడం లేదా ఉపయోగించడం నేరం. దీనికి జైలు శిక్ష విధించబడుతుంది. భిక్షాటన కోసం మైనర్‌ను అపహరించినా లేదా గాయపరిచినా జీవిత ఖైదు వరకు శిక్షలు విధించేంత కఠినంగా ‘భారత శిక్షాస్మృతి (సెక్షన్ 363ఎ)’ శిక్షిస్తుంది. వీధి పిల్లలకు సమగ్ర పునరావాసం, కౌన్సెలింగ్, అధికారిక విద్యను అందించడంపై దృష్టి సారించిన జాతీయ కార్యక్రమం ‘స్మైల్’ పథకం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, లక్నో, నాగ్‌పూర్, పాట్నాల్లో చాలా చురుకుగా పనిచేస్తోంది. పిల్లలు భిక్షాటన వైపు రాకూడదని ప్రారంభించిన ఈ చట్టాలు, పథకాలు ఏ తీరుగా అమలవుతున్నాయో అనడానికి తాజాగా గుంటూరు ఈద్గా వద్ద భిక్షమెత్తుకుంటున్న పిల్లల ఫొటో స్పష్టం చేస్తోంది.

గుక్కెడు నీళ్ల కోసం…

సాధారణంగా చాలా కుటుంబాల్లోని పిల్లలకు దాహం గురించి పెద్దగా తెలియదు. కానీ నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోని పిల్లలకు నీళ్ల విలువ బాగా తెలుసు. మధ్యప్రదేశ్‌లోని మాలీ గ్రామ చిన్నారులు బిందెడు నీళ్ల కోసం ప్రతి రోజూ 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. స్కూలు బ్యాగులు మోయాల్సిన వారి భుజాలపై నీళ్ల బిందెలు ఉంటున్నాయి. దేశంలోని అనేక గిరిజన ప్రాంతాల్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు.. నీటి కొరత కోరలు చాస్తుంది. పిల్లా, పెద్దా అంతా కొండలు, గుట్టలు దాటి, రాళ్లు రప్పల్లో నడిచి నీళ్ల కోసం వెతుకులాడతారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో చిన్నారుల నీటి కష్టాలు చక్రాలు కట్టుకుని కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో పిల్లలు నీళ్లు తెచ్చుకునేందుకు సొంతంగా కర్ర, ఇనుముతో తయారుచేసుకున్న ఓ బండిలో బకెట్లు, డ్రమ్ముల్లో నీళ్లను తీసుకెళ్తుంటారు. బండి లేని పిల్లలు తమ శరీరాలనే నీటిని మోసుకెళ్లే యంత్రాలుగా మార్చుకుంటారు. భుజాలపై, చేతులను బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకేసారి రెండు, మూడు బిందెల నీళ్లను మోస్తారు. ఈ శ్రమ ఆ చిన్నారులను ఎంతో శారీరక ఒత్తిడికి గురిచేస్తుంది. మెడ నొప్పి, కాళ్లు, చేతులు నొప్పి, నడుం నొప్పితో బాధపడే ఆ పిల్లలకు బడిలోకి వెళ్లి పాఠాలు వినడం కంటే ఇంటి అవసరాలకు, తాగునీటికి నీళ్లను తెచ్చుకోవడమే ముఖ్యం.

balyam

బాల కార్మికులుగా…

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 5 నుంచి 14 ఏళ్ల లోపు కోటి మంది పిల్లలు బడి బయట పనులు చేసుకుంటూ బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఉంది. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఈ సంఖ్య అధికం. పేదరికం, పరిమిత పాఠశాల విద్య, సామాజిక సాంప్రదాయాలు ఈ చిన్నారులను శ్రమజీవులుగా మార్చేస్తున్నాయి. కేవలం ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బాలల సంఖ్యే అధికారిక గణాంకాల ప్రకారం 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడ పనిచేసే పిల్లలు వేసవిలో రోజుకు 9 గంటలు, శీతాకాలంలో 7 గంటలు పనిచేస్తారు. ఈ కాలంలో శక్తికి మించి బరువులు మోయాలి. మట్టిని మోసుకురావడం, విషపూరిత రసాయనాల మధ్య, గాఢమైన పొగలో పనులు చేయాల్సి ఉంటుంది. ఇంకా అగ్గిపుల్లల తయారీ కేంద్రాల్లో, బాణాసంచా పరిశ్రమల్లో, తోలు పరిశ్రమల్లో, గాజులు, రత్నాల పాలిషింగ్ పనుల్లో లక్షలాది మంది చిన్నారుల చిట్టి చేతులు రక్తంతో తడుస్తున్నాయి.
యుద్ధాలు, వాతావరణ మార్పులకు కూడా చిన్నారులు తమ బాల్యాన్ని మూల్యంగా చెల్లిస్తున్నారు. భయంతో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించే చిన్నారులు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడుస్తున్న ఘటనలు రోజూ అనేకం చూస్తున్నాం. బాల్యం ఛిద్రమవుతున్న బాలబాలికలు ఒకే రకం హింసను అనుభవించడం లేదు. గృహహింస, లైంగిక దోపిడీతో బాలికలు మరింత దారుణ పరిస్థితులను ఎదుర్కొం టున్నారు. పిల్లల అందమైన బాల్యాన్ని ఇంత దారుణంగా మార్చేస్తున్నది ఎవరు? తల్లిదండ్రులా, సమాజమా, వ్యవస్థా? ఎవరు దీనికి బాధ్యులు? బాల్యం లేని పిల్లలు ప్రపంచాన్ని ఎలా చూస్తారు? భయం, హింస మధ్య పెరుగుతున్న ఆ పిల్లలు భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అందరి బాధ్యతగా ఉండాలి. అప్పుడే ప్రపంచంలో ఏ పిల్లలూ తమ విలువైన బాల్యాన్ని కోల్పోరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్