రేషన్ షాపు అనగానే వెంటనే గుర్తుకొచ్చేది పొడవాటి క్యూలు, గంటలకొద్దీ వృథా అయ్యే సమయం. కానీ తమిళనాడులోని కొల్లపక్కాం రేషన్ షాపు వద్ద మాత్రం భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ రేషన్ కోసం వచ్చిన చిన్నా, పెద్దా అందరూ పక్కనే ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో తమకు నచ్చిన పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. విసుగ్గా గడిచే నిరీక్షణ సమయాన్ని విజ్ఞానదాయకంగా మార్చుకుంటున్నారు.
ఒకప్పుడు తాగుబోతులు, జూదగాళ్లకు అడ్డాగా ఉన్న ఆ ప్రదేశంలో కాసేపు నిలబడటానికే ప్రజలు ఇబ్బందిపడేవారు. అలాంటి చోట గ్రంథాలయం ఏర్పాటు చేసి, తన ఆలోచనతో మరెందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి పేరు వేలు చిన్నస్వామి. రేషన్ షాపు డీలర్‌గా పనిచేస్తున్న చిన్నస్వామి చొరవ వల్లే ఈ మార్పు సాధ్యమైంది. తంబరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెడుంగుంద్రమ్ గ్రేడ్-1 పంచాయతీ పరిధిలోని ఈ రేషన్ షాపు, చిన్నస్వామి బాధ్యతలు చేపట్టే వరకు సాధారణ దుకాణంగానే ఉండేది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన గమనించారు. రేషన్ షాపు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వ్యసనపరుల సంచారం వల్ల మహిళలు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని తెలుసుకున్నారు.
మొదట ఆ ప్రదేశాన్ని ప్రజలు కాసేపు విశ్రాంతి తీసుకునేలా మార్చాలనే ఆలోచన చేశారు. స్థానిక పంచాయతీ సహకారంతో 2021లో అక్కడ గడ్డి కప్పుతో చిన్న ఇంటిని నిర్మించారు. దాతల సహాయంతో బల్లలు, కుర్చీలు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. తర్వాత దశలవారీగా అభివృద్ధి చేస్తూ 2025 నాటికి అన్ని సౌకర్యాలతో కూడిన కాంక్రీట్ భవనంగా తీర్చిదిద్దారు. చదువుపై మక్కువ ఉన్న చిన్నస్వామి పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఐదు డిగ్రీలు, నాలుగు డిప్లోమాలు పూర్తి చేశారు. ప్రస్తుతం అన్నామలై విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తితో ఆ విశ్రాంతి గృహాన్ని చిన్న గ్రంథాలయంగా మార్చాలని నిర్ణయించారు. పిల్లలు, పెద్దలకు ఉపయోగపడే పుస్తకాలను సేకరించడం ప్రారంభించారు. దాదాపు 15 వేల పుస్తకాలు సేకరించిన తర్వాత వాటిని అందంగా అరల్లో అమర్చారు. ఇప్పుడు రేషన్ కోసం వచ్చే వినియోగదారులు అక్కడ కూర్చొని పుస్తకాలు చదువుతున్నారు. తమిళం, ఇంగ్లీషు భాషల్లో అన్ని వయసుల వారికి ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.


“రేషన్ షాపుతో పాటు గ్రంథాలయం ఎందుకు ఏర్పాటు చేశారు?” అని అడిగితే చిన్నస్వామి ఆసక్తికరంగా సమాధానం చెబుతారు. “నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవాలని ప్రోత్సహించారు. ఆ అలవాటు నేటి యువతకు చాలా అవసరం. పుస్తక పఠనం మంచి ఆలోచనలను పెంపొందిస్తుంది. హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉంచుతుంది” అంటారు. చిన్నస్వామి ప్రారంభించిన ఈ ప్రయత్నం ఇప్పుడు ఒక్క రేషన్ షాపుకే పరిమితం కాలేదు. కొల్లపక్కాంతో పాటు అదే పంచాయతీ పరిధిలోని మరికొన్ని రేషన్ దుకాణాల్లో కూడా చిన్న గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. “పుస్తకాలు చదవాలనే ఆసక్తితో పిల్లలు పెద్దలతో కలిసి రేషన్ షాపుకు వస్తున్నారు” అని స్థానికులు చెబుతున్నారు. “పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటంతో ఈ ప్రాంతానికి మరింత మంది వినియోగదారులు వస్తున్నారు” అని సమీపంలో పూల వ్యాపారం చేస్తున్న పొన్ని తెలిపారు. “పుస్తకాలు జీవితాలను మార్చగలవనే నమ్మకాన్ని ఈ ప్రయత్నం బలపరుస్తోంది” అని స్థానిక ఉపాధ్యాయురాలు రాధా శేషాద్రి అన్నారు.
భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను కూడా ఈ గ్రంథాలయంలో అందుబాటులోకి తీసుకురావాలని చిన్నస్వామి భావిస్తున్నారు. ప్రజా ప్రదేశాలు కేవలం సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా, గౌరవప్రదంగా కూడా ఉండాలనే విషయాన్ని ఆయన ఆచరణలో చూపించారు. చిన్నస్వామి చొరవ మరెందరికో ఆదర్శంగా నిలవాలి.








కామెంట్‌లు (0)