test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉప్పు మడుల్లో ఉక్కపోత జీవితాలు!

27 మే, 2026

salt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండడానికి వసతి లేని వారంతా దేశం ఉప్పు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు, వందలు వేలు కాదు.. దాదాపు 50 వేలకు పైగా కార్మికులు గుజరాత్ పశ్చిమ తీర ప్రాంతమైన లిటిల్‌ ‌రాన్‌ ఆఫ్‌ కచ్ ఉప్పు మడుల్లో పనులు చేస్తున్నారు. దేశ జనాభా ఉపయోగించే 75 శాతం ఉప్పు అక్కడి కర్మాగారాల నుండే సరఫరా అవుతుంది. సూర్యుడు అగ్ని గోళంలా నిప్పులు కక్కుతున్న ఈ ఎండల్లో పనులు చేస్తున్న వాళ్లకు ఈ వాతావరణం వల్ల చర్మం పగిలి రక్తస్రావం అవుతూ ఉంటుంది. తగినంత విశ్రాంతి లేక నిత్యం ఒళ్లు నొప్పులు వేధిస్తుంటాయి. సరిపడా నీళ్లు తాగక మూత్రపిండాలు పాడవుతాయి. ఆరోగ్యం పాడై అహర్నిశలు ఇంత కష్టపడినా టన్ను ఉప్పుకు రూ.150 నుండి రూ.300 మాత్రమే దక్కుతుంది. ఒక పక్క వ్యాపారుల దోపిడీ, మరోపక్క తీవ్రమైన పేదరికం ఆ కార్మికుల కష్టాలను మరింతగా పెంచేస్తున్నాయి.
దేశంలో అన్ని చోట్ల మాదిరిగానే గుజరాత్ లో కూడా ప్రతి రోజూ 45 డిగ్రీల సెల్సియస్ లకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇంత వేడి వాతావరణంలో ఉప్పు ఉత్పత్తి చేయడం కోసం ఆ కార్మికులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. స్థానిక కార్మికులతో పాటు ఈ ఉప్పు మడుల్లో పనులు చేయడానికి ప్రతి ఏడాది 50 వేల మంది వలస కార్మికులు ఇక్కడికి వస్తుంటారు. 8 నెలల పాటు ఇక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకుంటారు. అంటే సుమారు 240 రోజులకు పైగా కాలమంతా వారు ఈ నివాసాల్లోనే తలదాచుకుంటారు. ఆ నివాసాల్లో కరెంటు కూడా ఉండదు. ఆరోగ్య సంరక్షణ దక్కదు. తీవ్రంగా కలవరపెట్టే విషయమేమంటే ఈ కార్మికులు తాగడానికి, వాడుకోవడానికి 25 రోజులకు ఒక్కసారే నీళ్ల ట్యాంకు వస్తుంది.

salt

సాధారణంగా బోర్ బావుల నుండి ఉప్పు నీటిని లోతు తక్కువగా ఉండే మడుల్లోకి సరఫరా చేస్తారు. ఎండకు, గాలికి ఆవిరైపోయేలా వాటి చుట్టూ మడులు కడతారు. ఈ మడుల్లో ఉప్పు ఏకరీతిగా స్ఫటీకీకరణ జరిగేలా కార్మికులు ప్రతి రోజూ ఆ ఉపరితలాన్ని గీకుతూ ఉండాలి. మందపాటి పొరలా తయారైన ఉప్పును పగలగొట్టి దిబ్బలుగా పేర్చాలి. బరువుగా ఉండే యంత్రాలను అటూ ఇటూ తిప్పుతూ మడి అంతా కలియతిరగడం, ఉప్పు గడ్డకట్టడం ప్రారంభం అయ్యాక ఇద్దరు కలిసి కదిలిస్తే గాని కదలని భారీ యంత్రాలతో ఆ ఉప్పును కుప్పలుగా పోగేయడం ఆ కార్మికులు చేసే పని.
42 ఏళ్ల బాబూలాల్ నారాయణ్ తన పని గురించి మాట్లాడుతూ ‘ఎండలో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం వేళ, సాయంత్రాలు పనులు చేస్తున్నాం. మధ్యాహ్నం పూట తలదాచుకునేందుకు కర్రలతో ఇక్కడే చిన్న గుడారంలా ఏర్పాటు చేసుకుంటాం` అని చెప్పాడు. ఆ గుడారం పైన, చుట్టూ ఒక మందపాటి వస్త్రాన్ని కప్పుకుంటారు. గాడిద పేడతో అలుకుతారు. ‘ప్రతి రెండు, మూడు గంటలకు ఒకసారి విరామం తీసుకోకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయ`ని అక్కడే పనిచేస్తున్న 17 ఏళ్ల భావనా రాథోర్ చెబుతున్నాడు. తమకు విశ్రాంతి ఎంత అవసరమో చెబుతూ ‘చల్లని నీడలో సేదతీరడానికి ఇక్కడ కనుచూపు మేరలో చెట్టు ఉండదు. కాబట్టి ఈ గుడారంలోనే విశ్రాంతి తీసుకుంటాం. ఆ కాసేపు కూడా సేద తీరకపోతే నీరసంగా, తలతిరిగినట్లు అనిపిస్తుంది` అంటున్నాడు.
ఈ వేడి నుండి రక్షించుకోవడానికి అక్కడ కార్మికులు ఒక్కోరకమైన పద్ధతులు పాటిస్తున్నారు. తాగే నీటిని చల్లబరుచుకోవడానికి 44 ఏళ్ల కంచన్ నారాయణ్ తడి గుడ్డ చుట్టిన నీళ్ల సీసాకు దారం కట్టి తలకిందులుగా వేలాడదీశాడు. మరో కార్మికురాలు పూర్ణిమ ఈ పొడిగాలికి శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు బ్లాక్ టీ తాగుతుంది. ఆ వేడి నీరు తాగడం వల్ల ‘శరీరం చల్లబడేలా చెమటలు వస్తాయి` అని ఆమె చెబుతోంది.
​దేశంలో పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడిచేసిన ప్రాంతాల్లో గుజరాత్ కూడా ఉంది. ప్రస్తుతం ఉప్పు మడుల్లో ఖరీదైన డీజిల్ పంపులకు బదులు సౌరశక్తితో నడిచే పంపులను వాడుతున్నారు. దీనివల్ల కర్మాగారాలకు ఉత్పత్తి ఖర్చులు తగ్గాయి. కానీ కార్మికులు పనిచేసే కాలం పొడిగించబడింది. సాధారణంగా మార్చి నెలలో ముగిసే పని ఇప్పుడు అత్యంత వేడిగా ఉండే నెలల వరకు కొనసాగుతోంది. ఈ కాలంలో పనిచేయడం ఆ కార్మికులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఇంత వేడిలో పనిచేయడం వల్ల తలతిరగడం, వికారంగా ఉండడం వంటి సాధారణ లక్షణాలతో పాటు అవయవాలు పనిచేయకుండా ఉండే స్థితి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధ్యయనాల ప్రకారం ఇప్పటికే ఈ కార్మికుల మూత్రపిండాల పనితీరు లోపాల్లో ప్రాథమిక సంకేతాలు బయటపడ్డాయి.

salt

ఇంత ప్రమాదకర పరస్థితిలో పనిచేస్తున్న కార్మికులకు జీవనోపాధి కోసం ఈ పని తప్ప వేరే గత్యంతరం లేదు. దీనిపై 65 ఏళ్ల కార్మికురాలు రసోదా రాథోర్ ఇలా చెప్పింది. ‘మాకు వ్యవసాయం చేయడానికి భూమి లేదు. జీవనోపాధి కోసం పశువులు లేవు. మాకు తెలిసింది ఇదొక్కటే` అంటోంది. ఇంత కష్టపడుతున్నా అకాల వర్షాలు వీరి శ్రమను అమాంతం మింగేస్తున్నాయి. ‘ఏప్రిల్ నెలలో వచ్చిన గాలి వానకు రూ.2 లక్షల విలువైన ఉప్పు నాశనమైంద`ని నారాయణ్ చెబుతున్నాడు.
సాధారణంగా ఉప్పు వాడకం ఎక్కువ, తక్కువ గురించి, ఆరోగ్యపరమైన చిక్కులు గురించి తరచూ వింటూ ఉంటాం. అయితే ఇక నుండి ఆ ఉప్పు మన ఇంట్లోకి రావడానికి ఎంతమంది కార్మికులు చెమట చిందిస్తున్నారో తెలుసుకుందాం. దైనందిన జీవితంలో మనం ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఎంతోమంది కార్మికుల శ్రమ దాగుంటుంది. చాలీచాలని వేతనాలతో, తినీ తినక, దుర్భరమైన బతుకులు బతుకుతూ వారంతా దేశ ఉత్పత్తుల కోసం తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ఈ వాస్తవం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్