ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి ఒక అద్భుతం. మనం నివసించే ఈ గ్రహం అనేక రకాల జీవరాశులు, ప్రకృతి వ్యవస్థలతో కూడిన అద్భుతమైన ప్రపంచం. కొండలు, లోయలు, చెట్లు, మొక్కలు, మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు.... ఇలా ప్రతి జీవి భూమిపై జీవవైవిధ్యంలో భాగం. మనిషి తన తెలివితేటలతో ప్రపంచాన్ని శాసిస్తుండగా, పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రభావంతో అనేక జీవజాతులు వరుసగా అంతరించిపోతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా జీవజాతుల అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, మానవుల అత్యాశే ప్రధాన కారణంగా నిలుస్తోంది.
తన స్వార్థం కోసం మనిషి ప్రకృతి వనరులను కబళిస్తున్నాడు. చెట్లు, మొక్కలు, ఏకంగా అడవులను సైతం విచక్షణారహితంగా నరికేస్తున్నాడు. సంపదను మరింత పెంచుకోవాలనీ, ప్రకృతి వనరులపై ఆధిపత్యం సాధించాలనే భావనలతోనే ఇదంతా సాగుతోంది. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న వనరులు కూడా మరో కారణం. ఇలా ఒకటేమిటి, చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు కనిపిస్తాయి. పర్యావరణానికి కలుగుతున్న ఈ విఘాతంతో ఏకంగా మానవాళి మనుగడకే పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి.
జీవరాశుల్లోని భిన్న జాతులకు వాటి చుట్టూ ఉండే జీవ, నిర్జీవ కారకాలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ప్రకృతిలో ఏ జీవి కూడా ఒంటరిగా జీవించదు. ప్రతి ప్రాణి తన పరిసరాలపై, ఇతర జీవరాశుల మీద, ఆవాసం, ఆహారం, ప్రత్యుత్పత్తి కోసం ఆధారపడి ఉంటుంది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. తేనెటీగలు, ఇతర కీటకాలు పుప్పొడిని ఒకచోటు నుంచి మరొకచోటుకు చేర్చి ఫలదీకరణకు సహాయపడతాయి. అడవులు వర్షపు నీటిని నిల్వ చేస్తాయి. నేల కోతను తగ్గించి, సారవంతం చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, మన చుట్టూ ఉన్న సంక్లిష్టమైన జీవప్రపంచమే మనకు ఒక పెద్ద గొడుగులాగా అనేక విధాలుగా రక్షణ కల్పించి, భూమ్మీద జీవాన్ని సుస్థిరం చేస్తుంది.
సూర్యకిరణాలు ఆకుల సందుల్లోంచి నేలను తాకి మట్టితో దోబూచులాడుతుండే అడవులు అంతరించిపోతున్నాయి. రంగురంగుల సీతాకోకచిలుకలు, తుమ్మెదలు పూల మీద వాలుతూ చేసే సరదాలు ఇప్పుడు అపార్టుమెంట్ల వాతావరణంలో కనిపించడం లేదు. పిట్టలు కిలకిలారావాలతో గాలిని నింపుతూ ఉంటే, ఆకాశాన్ని అందుకునే భారీ వృక్షాలు తమ కాళ్లకు తట్టుకునే పిల్లల్లాంటి మొక్కలతో ఆడుకుంటుంటాయి. ఇలాంటి అద్భుత దృశ్యాలు నేడు కానరావడం లేదు.
వివిధ రకాల జంతువులు, మొక్కలు, జీవరాశులు వంటివన్నీ ప్రకృతి మనకు అందించిందే. ప్రతి జీవి ప్రత్యేకమైన జన్యుకూర్పును, వాటి విభిన్నమైన లక్షణాలను, అవి పర్యావరణంలో పోషించే ప్రత్యేకమైన పాత్రను ప్రతిబింబిస్తుంది. వివిధ జాతుల మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధాలనూ ఇది సూచిస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మజీవి నుంచి భారీ నీలి తిమింగలం వరకు ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పైగా ప్రతి జీవి పర్యావరణ వ్యవస్థ సమతుల్యతకు ఎంతో అవసరం.
కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ అద్భుతమైన, విలువైన పర్యావరణం ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. సహజ వనరులను చెర పడుతున్న కార్పొరేట్ల స్వార్థపూరిత, అనాలోచిత చర్యల వల్ల అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకాలను విడుదల చేయడం, ప్రకృతి వనరులను అవసరానికి మించి తిరిగి పొందలేని విధంగా వినియోగించడం జరుగుతోంది. దీనివల్ల అనేక ప్రత్యేకమైన, ముఖ్యమైన జీవులు అంతరించిపోనున్నాయి. ఒక జాతి అంతరించిపోతే, దానితో ముడిపడి ఉన్న ఆహార గొలుసులో విపత్కర మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ పరిస్థితి ఇతర పర్యావరణ సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
మన దేశంలో...
ప్రపంచంలో భారత్ కేవలం 2.4 శాతం భూభాగాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ, ప్రపంచంలోని జంతుజాలంలో 7.6 శాతం (1,02,000 జాతులు), వృక్షజాలంలో 6.5 శాతం (47 వేల జాతులు) కలిగి ఉంది. అందులో అనేక జాతులు స్థానికంగా (ఎండెమిక్) మాత్రమే ఉన్నాయి. అంటే, అవి ప్రపంచంలో ఇతరత్రా ఎక్కడా లభించవు. మన దేశంలో 10 వేల కంటే ఎక్కువ జాతుల మొక్కలు వివిధ రూపాల్లో ఉపయోగించబడుతున్నాయి.
ముప్పునకు కారణాలివే...
అద్భుతమైన వనసంపద, జీవసంపద విస్తారంగా ఉన్న దేశంలో స్వార్థం పెచ్చరిల్లుతోంది. అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పు, అతిగా వినియోగం వంటివి ప్రధాన ముప్పులు. జనాభా విస్ఫోటనం, నగరీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పు వంటివి ప్రధాన కారణాలు. అడవుల నరికివేత వల్ల అనేక జాతులు తమ నివాస స్థలాలను కోల్పోతున్నాయి. కాలుష్యం, అతిగా వినియోగం సముద్ర, మంచినీటి పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. భూమి, సముద్ర జీవావరణ వ్యవస్థలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దశాబ్దాల పాటు నిలిచిపోతున్నాయి. వన్యప్రాణులకు, జీవవైవిధ్యానికి, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయి.
కొన్ని ఆశ్చర్యకర వాస్తవాలు
• ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల ప్లాస్టిక్ సీసాలు వాడబడుతున్నాయి.
• సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల మొత్తం 2050 నాటికి చేపల మొత్తాన్ని మించిపోతుందని అంచనా.
• మైక్రోప్లాస్టిక్ కణాలు మన రక్తంలో, తల్లి పాలలో కూడా కనుగొనబడుతున్నాయి.
• ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌లు ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల ఉత్పత్తికి ముఖ్యమైన కారణంగా గుర్తించబడ్డాయి.
• ప్రతి సంవత్సరం 70 లక్షల మంది వాయు కాలుష్యం కారణంగా అకాల మరణానికి గురవుతున్నారు.
• భారతదేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఉన్నాయి.
• శ్వాసకోశ వ్యాధులు, గుండె సమస్యలు, క్యాన్సర్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి.
నేడు ప్రతి రోజూ సగటున 150 జీవజాతులు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. తేనెటీగలు లేకుంటే పరాగసంపర్కం జరగదు; వానపాములు లేకుంటే భూసారం నశిస్తుంది. ప్రకృతిలో ప్రతి జీవి అవసరమే! ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరమూ కృషి చేయాలి.

– పేర్లి దాసు అధ్యాపకులు 99632 49775








కామెంట్‌లు (0)