అరకు అందాలు, తలకోన సోయగాలు, దట్టమైన అటవీ ప్రాంతాల పచ్చదనం, శేషాచలం బయోస్పియర్, మహారాష్ట్ర ట్రైబల్ లైఫ్, ఒడిశాలోని ప్రజల జీవనం, రాయగడలోని జీవవైవిధ్యం, కేరళలో తయ్యం ఫెస్టివల్స్, కర్ణాటకలోని కంబాల రేస్, తెలంగాణ కొమురం మల్లన్న జాతర, అమలాపురంలోని జక్కన్నతోట ప్రభల తీర్థం… ఎక్కడ వైవిధ్యం కనిపిస్తే అక్కడికి వెళ్లిపోతారు ఉప్పాడ దుర్గారావు. ఆయా దృశ్యాలను అత్యద్భుతంగా తన కెమెరాలో బంధిస్తారు. నడుస్తున్న సాంస్కృతిక చరిత్రకు విలువైన కెమెరా ఖజానా తను.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన ఉప్పాడ సత్యనారాయణ–ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు ఉప్పాడ దుర్గారావు స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు. పర్యాటక ప్రియుడు. హరిద్వార్, కోల్‌కతా, డెహ్రాడూన్, మున్నార్, ముస్సోరి, భువనేశ్వర్ వంటి ఎన్నో భావోద్వేగ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అక్కడి పరిస్థితులను మన కళ్ల ముందుంచుతారు. సాంకేతిక, సాంప్రదాయ, ప్రకృతి పరమైన చిత్రాలను వైవిధ్యంగా బంధించటంలో ఆయన దిట్ట. ఆర్ట్ ఫొటోగ్రఫీలో గొప్ప నైపుణ్యం చూపిస్తున్నారు. దేశంలో ఎక్కడ వైవిధ్యమైన ప్రకృతి, పర్యావరణం, ఆధ్యాత్మిక ప్రదేశాలున్నా అక్కడికి వెళ్లి వీక్షించటమే కాదు, అక్కడి పరిస్థితులు, పరిణామాలు, ప్రభావాలు వంటి అంశాలను తన కెమెరాలో బంధిస్తుంటారు. డిగ్రీ వరకు చదువుకున్న దుర్గారావుకు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. ఎక్కడ ఏ ఫంక్షన్, సభ, సమావేశం జరిగినా అక్కడికి వెళ్లి ఫొటోగ్రాఫర్లతో మాట్లాడటం, సరదాగా వారి కెమెరాను తీసుకుని ఫొటోలు తీయడం చేసేవారు. ఇలా ప్రారంభమైన ప్రయాణంలో మరింత ఆసక్తి పెరిగింది.
చదువుకునే రోజుల్లోనే చిన్న కెమెరాను కొనుక్కుని దానిలో నైపుణ్యం సాధించటం కోసం ఎంతో సమయం కేటాయించేవారు. కేవలం ఫొటోలకే పరిమితం కాకుండా వీడియోలు కూడా తీయటం నేర్చుకున్నారు. తరువాతి కాలంలో విజయవాడకు చెందిన అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ తమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డితో పరిచయం ఏర్పడింది. తీరిక సమయాల్లో ఆయన వద్దకు వెళ్లి కెమెరా రంగంలో మరింత నిపుణత సంపాదించారు. ఆర్ట్ ఫొటోగ్రఫీని వృత్తిగా చేసుకుని, ఫ్రీలాన్స్ ఫొటో గ్రఫీ గానూ, వెడ్డింగ్ ఫొటోగ్రఫీలోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. వైవిధ్యమైన అంశాల కోసం ఎంత సమయమైనా కేటాయిస్తారు. సాహసాలు చేస్తుంటారు. పర్యటనలు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు. కాకినాడకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ తుమ్మలపల్లి వీరభద్రరావు ప్రోత్సాహంతో ఫొటోగ్రఫీ నుంచి ఆర్ట్ ఫొటోగ్రఫీ వైపు అడుగులు వేశారు.

ఆర్ట్ ఫొటోగ్రఫీలో మేటిగా…
ఆర్ట్ ఫొటోగ్రాఫర్లు తీసే ఫొటోలు సాధారణ ఫొటోలకు భిన్నంగా ఉంటాయి. ఒక ప్రాంతం, తెగ, భాష మాట్లాడే వారి కథను, భావనను కేవలం మాటలతో కాకుండా దృశ్యాల ద్వారా అందంగా వ్యక్తపరచటంలో కీలకంగా ఉపయోగపడతాయి. సృజనాత్మకతతో లైటింగ్, యాంగిల్, రంగులు, కాంట్రాస్ట్‌లను ఉపయోగించి ఒక సాధారణ దృశ్యాన్ని అద్భుతమైన కళాఖండంగా మార్చేయటంలో దుర్గారావు నిష్ణాతులు. ఇలాంటి ఫొటోలు ఆయన వద్ద వందలాదిగా ఉన్నాయి. నేచర్ (Nature), పోర్ట్రెయిట్ (Portraits), ఫైన్ ఆర్ట్ (Fine Art), ల్యాండ్‌స్కేప్ (Landscapes) వంటి విభాగాల్లో కూడా వేలాది ఫొటోలు ఉన్నాయి. అన్ని ఫొటోలు స్థానికతను, ప్రజల జీవన విధానాన్ని, నైపుణ్యాన్ని, ఆచార, ఆహార వ్యవహారాలను ప్రతిబింబించేవిగా ఉన్నాయి.


ప్రకృతి పరిరక్షణే కీలకం…
ప్రకృతిని కాపాడాల్సిన తీరును పట్టిచూపుతూ తీసిన ఫొటోలు మనస్సును ఉత్తేజితం చేస్తాయి. పర్యావరణానికి ఏర్పడిన ప్రమాదాలను ప్రతిబింబించే చిత్రాలు సమాజాన్ని చైతన్యపరుస్తాయి. “జాతీయ సమైక్యత, జాతి, కులం, మతం, ప్రాంతం వంటివి వద్దు… మానవత్వమే ముద్దు” అనే భావజాలాన్ని ప్రతిబింబించే ఫొటోలు ఎన్నో ఆయన సేకరణలో ఉన్నాయి. పండుగలు, జాతర్లలో కనిపించే పరస్పర సహాయం, సమూహాల ఐక్యత, పరమత సహనం వంటి భావాలు ప్రతిఫలించేలా ఆయన చిత్రాలు ఉంటాయి. సమాజం, కుటుంబం, జీవన విధానాన్ని అవి విశదీకరిస్తాయి. చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. లేలేత భానుడి కిరణాలు, గోమాత బిడ్డకు పాలిచ్చే అపురూప దృశ్యాలు, పక్షుల కిలకిలారావాలు, సాయంసంధ్య వేళలు, ఉషోదయపు సోయగాలు, సముద్రపు కెరటాల హొయలు… ఈ చరాచర జగత్తులోని అద్భుతాలను ఆయన తన కెమెరాలో బంధిస్తారు. ఆయన లైబ్రరీలో నిక్షిప్తమైన ఈ ఫొటోలు భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి.

మనస్సుకు హత్తుకునే ప్రకృతి రమణీయ దృశ్యాలు, ఎత్తైన కొండలు, మైదానాలు, నదీ–సముద్ర సంగమ ప్రదేశాలు, దళిత, గిరిజన, పేదల జీవన చిత్రాలు ఎన్నో ఆయన డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తమై ఉన్నాయి. సాధారణ ఫొటోలు వేలల్లో ఉండగా, 600కుపైగా దేశ, విదేశాలకు చెందిన అపురూప చిత్రాలను కెమెరాలో బంధించారు. ఆర్ట్ ఫొటోగ్రఫీ చిత్రకారుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపుపొంది ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందారు.

సందేశాత్మక ఫొటోలంటే ఇష్టం! : - ఉప్పాడ దుర్గారావు, ఆర్ట్ ఫొటోగ్రాఫర్
నా వయసు 42 సంవత్సరాలు. గత పదుళ్లుగా ఆర్ట్ ఫొటోగ్రఫీ, ట్రావెల్ ఫొటోగ్రఫీ, నేచర్ జర్నలిజం ఫొటోలు తీయడంలో అనుభవం సంపాదించాను. అరకు ట్రైబల్ లైఫ్, ఒడిశాలోని బోండా ట్రైబల్స్, రాయగడలోని గడాబ ట్రైబల్స్, కేరళ రాష్ట్రంలోని తయ్యం ఫెస్టివల్స్, కర్ణాటకలోని కంబాల రేస్, తెలంగాణ కొమురం మల్లన్న జాతర, అమలాపురంలోని జక్కన్నతోట ప్రభల తీర్థం వంటి ఎన్నో సాంకేతిక, సాంప్రదాయ, ప్రకృతి పరమైన ఫొటోగ్రఫీలు తీశాను. నాకు సందేశాత్మక ఫొటోలంటే చాలా ఇష్టం!
– యడవల్లి శ్రీనివాసరావు








కామెంట్‌లు (0)