‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా..!’ అన్న పోకిరీ సినిమా డైలాగుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు షాయాజీ షిండే. మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో విలనిజం, కామెడీని ఏకకాలంలో పండించిన గొప్ప నటుడు ఆయన. అయితే, చాలా తక్కువ మందికి మాత్రమే ఆయన పర్యావరణ ప్రేమికుడిగా గుర్తుంటారు. షిండే ప్రకృతిని ఎంతగా ప్రేమించారంటే.. ‘అడవిని సృష్టించేంతగా’ అని చెప్పాలి. 6 లక్షల 50 వేల మొక్కలతో నిర్మించిన ఆ లక్ష్యం వెనుక ఓ భావోద్వేగ ఉదంతం ఉంది. అది అమ్మ ప్రేమంత స్వచ్ఛమైంది.. ప్రకృతి అంత సహజమైనది!
అమ్మను అమితంగా ప్రేమించే వ్యక్తి షిండే. ‘అమ్మను కోల్పోతామనే భయమే అతిపెద్ద భయం’ అనేవారు ఆయన. అంతటి సున్నిత మనస్కుడైన షిండే ఒక రోజు అమ్మను పోగొట్టుకున్నారు. అందరూ ఊహించినట్లుగా, అమ్మ పోయిన భయం ఆయన్ను విపరీతంగా కుంగదీసింది. అయితే, ఆ భయాన్ని ఆయన ఓ ఉద్యమంగా మార్చారు. ఇప్పుడది మహారాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాలకు జీవం పోస్తోంది. తల్లిపై ప్రేమతో ఓ కొడుకు నడిపిస్తున్న ఈ ఉద్యమం ఇప్పుడు బృహత్తర పర్యావరణ కార్యక్రమాల్లో ఒకటిగా మారింది.
మహారాష్ట్ర సతారా గ్రామంలో రైతు కుటుంబంలో షిండే పుట్టారు. పేద కుటుంబాల్లో ఉన్న కష్టాలను చూస్తూనే పెరిగారు. 1978లో ఓ ప్రాజెక్టులో భాగంగా ఆయన కుటుంబం భూమిని పోగొట్టుకుంది. భూమి తీసుకున్న ప్రభుత్వం బదులుగా షిండేకు వాచ్‌మ్యాన్ ఉద్యోగం ఇచ్చింది. అప్పుడు జరిగిన ప్రతి పోరాటం షిండేకు తెలుసు. ఆ భూమి తిరిగి 35 ఏళ్లకు వాళ్లకు దక్కింది. దానిపై ఒకసారి ఆయన ఎంతో ఆవేదనగా మాట్లాడారు. ‘ప్రభుత్వం పేదల డబ్బును లాక్కుంది. వాళ్ల దగ్గర నుంచి 1978లో భూమిని తీసుకుని, 2002లో ఇవ్వడం ఎంత అన్యాయం!’ అన్నారు.
నటుడు నుంచి పర్యావరణ ప్రేమికుడిగా…
పలు భారతీయ భాషల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నటప్రస్థానం ఉన్న షిండే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే, అవేమీ తనకు సంతృప్తి ఇవ్వలేదని ఓ సందర్భంలో చెప్పారు. ‘ప్రతి ఒక్కరూ డబ్బు, పేరు గడించాలని అనుకుంటారు. కానీ, నేను అంతకుమించి సంపాదించాలని అనుకున్నాను’ అన్న ఆలోచనే షిండేను గొప్ప పర్యావరణ ప్రేమికుడిగా మార్చింది.
2016లో మహారాష్ట్రలో కరువు తాండవించింది. అప్పుడు పూణెలో ఉన్న ఓ ధనవంతుడు షిండేతో తనకు వందల కోట్ల రూపాయల ఖరీదు చేసే భూమి ఉందని గొప్పగా చెప్పాడు. ఆ మాటలు విన్న షిండే అందరిలా గొప్పగా స్పందించలేదు. ‘కష్టాల్లో ఉన్న మనుషులకు ఉపయోగపడని సంపద ఎంత ఉంటే ఏం ప్రయోజనం?’ అని ప్రశ్నించుకున్నారు. ఆ సందర్భంలో షిండే ఓ గ్రామానికి వెళ్లినప్పుడు పెద్ద సభ నిర్వహించారు. మండుటెండలో ఒక్క చెట్టు కూడా లేని ఆ ప్రదేశంలో గంటలకొద్దీ జనాలు అక్కడ గుమిగూడారు. ఆ దృశ్యం షిండేలో ఓ ఆలోచన రేకెత్తించింది. గ్రామంలో మొక్కలు నాటాలని అప్పటికప్పుడే ఆయన సంకల్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి రెండు ట్రక్కుల మొక్కలు తెప్పించారు. ఆ ప్రాంతంలో ‘దేవరాయి’ అనే మొక్క అడవిని సంరక్షించేదిగా, తరతరాలుగా ఆ గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజించేవారు. ఆ మొక్క పేరుకు తన అమ్మ పేరును కలిపి ‘సహ్యాద్రి దేవరాయి’ పేరుతో షిండే మొక్కలు నాటడం ప్రారంభించారు.
అమ్మ పేరు ఎందుకు?
2016 నాటికి షిండే వాళ్ల అమ్మకు 92 ఏళ్లు. వృద్ధురాలు అయిన తల్లి ఎప్పుడో ఒకప్పుడు చనిపోతుందని షిండే గ్రహించారు. అయితే, ‘అమ్మ ఇక ఉండదు’ అన్న ఆలోచన ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే.. ‘నేను ఉన్నంతవరకు అమ్మను నాతో ఉంచుకోలేను. ఇప్పటికే తనకు 92 ఏళ్లు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువగా నేను అమ్మను ప్రేమిస్తాను. కానీ, నేను చాలా నిస్సహాయుడిని. ఆమె మరణాన్ని ఆపలేను. కానీ, తనకు మారుగా ఆ ప్రేమను పొందాలి. ఆ బాధ్యతను నెరవేర్చాలి అనుకున్నాను’ అని చెప్పారు.
అమ్మను ఇంతలా ప్రేమించిన షిండే ఒక రోజు అమ్మ బరువుకు సమానంగా విత్తనాలు కొలిచారు. వాటిని మహారాష్ట్ర వ్యాప్తంగా నాటారు. ఈ పదేళ్లలో అవి వృక్షాలయ్యాయి. కొన్ని పూలు పూస్తున్నాయి. ఇంకొన్ని పండ్లు ఇస్తున్నాయి. చాలా చెట్లు నీడను ఇస్తున్నాయి. ఆ పూల గుభాళింపుల్లో, ఆ పండ్ల తియ్యదనంలో షిండే వాళ్ల అమ్మను చూస్తున్నారు. ‘నేను అమ్మను ఇలాగే చూడాలనుకున్నాను. ఎప్పటికీ సజీవంగా..’ అంటారు ఎంతో భావోద్వేగంగా షిండే.
దశాబ్దకాలం కిందట మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు 48 ప్రాంతాలకు విస్తరించింది. వందలు, వేలు దాటి లక్షల్లో చెట్లు పెరుగుతున్నాయి. షిండే తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో కేవలం చెట్లను నాటడం ఒక్కటే చూస్తే సరిపోదు. అవి కొంతమందికి ఆర్థిక వృద్ధిని తెచ్చేవిగా కూడా ఆయన మారుస్తున్నారు. ఆ ఆలోచనను ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ‘ఒక గ్రామంలో వెయ్యి చింత మొక్కలు నాటితే, 15 ఏళ్లు తిరిగే సరికి అవి గ్రామస్తులకు కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెడతాయి’ అంటారు.
ఆలయాల్లో ప్రసాదానికి బదులుగా…
అమ్మ తరువాత షిండే ఇప్పుడు మొక్కలను కూడా అంతలా ప్రేమిస్తున్నారు. ప్రార్థనా స్థలాల్లో ఇచ్చే ప్రసాదాలకు బదులుగా మొక్కలను ఇవ్వాలన్నది ఆయన కోరిక. అప్పుడు ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో వాటిని నాటి, పెంచుతారని ఆయన అభిప్రాయం. ఆ ఆశ అయితే తీరలేదు. కానీ, షిండే సంకల్పం మాత్రం ప్రజలు బాగా వంటబట్టించుకున్నారు. 60 ఏళ్లకు పైగా బీడుగా పడి ఉన్న ఓ గ్రామం షిండే స్ఫూర్తితో మొక్కలు నాటడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ గ్రామంలో 16 వేల మొక్కలు ప్రాణం పోసుకున్నాయి. పర్వతాలు, రాళ్లు, రప్పలతో కనిపించిన ఆ ప్రాంతం ఇప్పుడు పచ్చగా తయారైంది.
సమాజం ప్రకృతికి బాకీ పడింది!
‘ఎవరైతే ఉచితంగా ఆక్సిజన్ పీలుస్తున్నారో, వారందరూ ప్రకృతికి బాకీ పడ్డారు. ఆ రుణాన్ని ఒక్కొక్కరూ తమ వయసుకు సమానమైన మొక్కలు నాటి తీర్చుకోవాలి’ అనే షిండే, ‘మొక్కలే ఈ గ్రహానికి సెలబ్రిటీలు’ అంటారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టని షిండే, స్వయంగా 200 మర్రిచెట్ల ట్రాన్సప్లాంటేషన్‌ను సంరక్షించే బాధ్యతలు కూడా తీసుకున్నారు. ‘ఈ చెట్లపై 200కు పైగా పక్షిజాతులు నివసిస్తాయి. క్రిమికీటకాలు జీవిస్తాయి. సీతాకోకచిలుకలకు కూడా ఇవి ఆవాసాలుగా మారతాయి. విస్తరణల్లో భాగంగా వీటిని నరకడం ఆపి, ట్రాన్సప్లాంటేషన్ చేయాలని నిర్ణయించుకున్న’ట్లు ఆ సందర్భంలో షిండే చెప్పారు.
సొంత గ్రామంలో 2000 చెట్లతో మొదలైన ఈ ఉద్యమం షిండే ఒక్కరితోనే మొదలైంది. ఇప్పుడు గ్రామస్తులందరూ విధిగా ఆ మొక్కలకు నీళ్లు పోయడం, పాదులు చేయడం వంటి పనులు ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. అమ్మను సజీవంగా ఉంచే శక్తి లేని షిండే, మొక్కలు నాటి ఆ లోటును తీర్చుకున్నారు. అయితే, ‘లక్షలాది వృక్షాలతో పెరిగిన అడవిని సృష్టించడంతోనే ఆ కోరిక తీరలేదు’ అంటున్న షిండే, దశాబ్దాల తరువాత తన కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వేలకొలది మొక్కలతో ఓ నర్సరీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దాని ద్వారా అవసరమైన గ్రామాలకు పచ్చదనం అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు.
ఈ మొత్తం ప్రయాణం చూస్తే.. ‘రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ హీరో’ అన్న నానుడి షాయాజీ షిండేకు సరిగ్గా సరిపోతుంది.








కామెంట్‌లు (0)