test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రపంచ ఫొటోగ్రఫీ వేదికపై తెలుగు వెలుగు

5 రోజుల క్రితం

photography
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఆర్ట్ ఫొటోగ్రఫీని సామాజిక స్పృహతో మేళవించి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు విజయవాడకు చెందిన తమ్మా శ్రీనివాసరెడ్డి. సింగరేణి బొగ్గు గనికార్మికుల జీవితాలను ప్రతిబింబిస్తూ ఆయన రూపొందించిన డాక్యుమెంటరీకి ఇటీవల ప్రతిష్ఠాత్మకమాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ (MAPS) గౌరవం లభించింది. ఈ గుర్తింపుతో ప్రపంచ ఫొటోగ్రఫీ రంగం మరోసారి ఆయన సృజనాత్మక ప్రతిభను గుర్తించింది.


గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన తమ్మా శ్రీనివాసరెడ్డిని చిన్ననాటి నుంచే గ్రామీణ జీవితం, ప్రకృతి దృశ్యాలు, రైతు కుటుంబాల జీవన విధానం ఆకర్షించాయి. ప్రకృతిలో కనిపించే ప్రతి విశేషాన్ని కెమెరాలో బంధించాలనే ఆసక్తి క్రమంగా ఆయనను ఫొటోగ్రఫీ వైపు మళ్లించింది. ప్రకృతి దృశ్యాలతో ఏర్పడిన ఆ అనుబంధమే ఆయన కళాత్మక దృష్టికి పునాది వేసింది. అనంతరం ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ శ్రీనివాసన్ తదితరుల వద్ద వృత్తిపరమైన శిక్షణ పొందారు. 1987లో ఫొటో జర్నలిజంలో అడుగుపెట్టి, నైపుణ్యం సాధించిన తర్వాత ఉదయం, ఆంధ్రభూమి, ప్రజాశక్తి, డెక్కన్ క్రానికల్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హితవాద, దైనిక్ భాస్కర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా టుడే వంటి పత్రికలు, మ్యాగజైన్‌లలో ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ​కెమెరాతో చేసిన నిరంతర ప్రయోగాలు శ్రీనివాసరెడ్డిని మోనోక్రోమ్, కలర్, నేచర్, వైల్డ్‌లైఫ్, ఫొటో ట్రావెల్, ఫొటో జర్నలిజం వంటి విభిన్న ప్రక్రియల్లో నిష్ణాతుడిగా తీర్చిదిద్దాయి. ఫొటోగ్రఫీ రంగంలో ఆయన సాధించిన అనుభవాన్ని తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో 14 ఫొటోగ్రఫీ పుస్తకాలను రచించారు. ఈ పుస్తకాలు దేశవ్యాప్తంగా వేలాది మంది ఫొటోగ్రఫీ అభ్యాసకులకు మార్గదర్శకంగా నిలిచాయి. వందలాది మంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంలో ఆయన ప్రోత్సాహం, మార్గనిర్దేశం కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు ఆయన తీసిన 5,872కు పైగా ఛాయాచిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ఫొటోగ్రఫీ వేదికలపై ప్రదర్శితమయ్యాయి. వివిధ దేశాలకు చెందిన ఫొటోగ్రఫీ జర్నల్స్ ఆయన రచనలు, ఛాయాచిత్రాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తున్నాయి. ఆయన 189 పతకాలు, 494 అవార్డులు, 896 ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శిగా కూడా సేవలందించారు.


శ్రీనివాసరెడ్డి ప్రపంచంలోని సుమారు 70 దేశాల్లో పర్యటించారు. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంచరిస్తూ ప్రజల జీవన వైవిధ్యాన్ని, సాంస్కృతిక సంపదను, గిరిజన సమాజాల జీవన శైలిని తన కెమెరాలో బంధించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన సమాజాలతో మమేకమై వారి జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఎవరెస్ట్ పర్వత ప్రాంతాల మంచు అందాలు, సముద్రపు కెరటాలు, జలపాతాలు, అజంతా–ఎల్లోరా గుహలు, కోణార్క్ సూర్య దేవాలయం, మహాబలిపురం స్మారక చిహ్నాలు, కజిరంగా జాతీయ ఉద్యానవనం, చోళ దేవాలయాలు, కుతుబ్ మినార్, ఎర్రకోట, ఫతేపూర్ సిక్రీ, ఖజురహో దేవాలయాలు, తాజ్ మహల్ వంటి చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద ఆయన ఛాయాచ ిత్రాల్లో సజీవంగా నిలిచాయి. దేశంలోని పలు ఉత్సవాలు, జాతరలు, సంప్రదాయ క్రీడలు కూడా ఆయన కెమెరాకు ప్రధాన అంశాలుగా మారాయి. కర్ణాటకలోని శ్రావణబెళగొళ మహామస్తకాభిషేకం, ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభమేళా, తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటక తీర ప్రాంతంలోని కంబాలా ఉత్సవాలు, ఈశాన్య భారతదేశ గిరిజనుల సంబరాలు తదితర అనేక సాంస్కృతిక సందర్భాలను ఆయన విశిష్ట దృష్టితో చిత్రీకరించారు. జోగినీ వ్యవస్థ, స్టూవర్టుపురం ప్రజల జీవన విధానం, కొండవీడు రెడ్డిరాజుల చరిత్ర, 1977 దివిసీమ ఉప్పెన వంటి అంశాలపై డాక్యుమెంటరీలు, ప్రచురణలు రూపొందించారు. ఫొటోగ్రఫీని కేవలం కళారూపంగా కాకుండా సమాజాన్ని ఆలోచింపజేసే సాధనంగా ఉపయోగించారు


photography

ఫొటోగ్రఫీలో ఆయన చూపిన సృజనాత్మకతకు తాజా గుర్తింపుగా మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ (MAPS) గౌరవం దక్కింది. ‘రిస్క్ యాజ్ జాబ్: ది డైలీ సాగా ఆఫ్ ఆర్టిసనల్ కోల్ మైనర్స్’ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీకి ఈ అరుదైన గుర్తింపు లభించింది. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న భూగర్భ కార్మికుల జీవన వాస్తవాలు, వృత్తిపరమైన ప్రమాదాలు, వారి ఓర్పు, శ్రమ, ఆత్మవిశ్వాసాన్ని ఈ డాక్యుమెంటరీ ప్రతిబింబిస్తుంది. 2026లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన ఇద్దరు కళాకారుల్లో శ్రీనివాసరెడ్డి ఒకరు కావడం విశేషం. ఈ అవార్డును ఈ ఏడాది నవంబరు 24న ఆస్ట్రేలియాలో అందుకోనున్నారు.


ప్రస్తుతం ఆయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫొటోగ్రఫీ విభాగంలో అతిథి అధ్యాపకుడిగా సేవలందిస్తున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫిక్ కౌన్సిల్‌లో జర్నలిజం విభాగానికి ఛైర్మన్‌గా, అమెరికాలోని ఇమేజ్ కొలీగ్ సొసైటీలో అవార్డుల ఎంపిక కమిటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో చేసిన సేవలకు రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ ప్రత్యేక అభినందనలు అందించింది. కెమెరాను కేవలం కళా సాధనంగా కాకుండా సామాజిక పత్రంగా మలిచిన ఫొటోగ్రాఫర్‌గా తమ్మా శ్రీనివాసరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రకృతి అందాల నుంచి గనికార్మికుల జీవన పోరాటాల వరకు, వారసత్వ కట్టడాల నుంచి గిరిజన సంస్కృతుల వరకు ఆయన చిత్రాలు కాలానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తాజాగా లభించిన MAPS గౌరవం ఆయన నాలుగు దశాబ్దాల సృజనాత్మక ప్రయాణానికి మరొక అంతర్జాతీయ గుర్తింపు.


photography

సింగరేణి గనుల్లో కార్మికుల పని, వారి జీవన పరిస్థితులపై శ్రీనివాసరెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆరున్నర కిలోమీటర్ల మేర భూగర్భంలో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పనిచేసే గని కార్మికుల జీవితం నిజంగా సాహసోపేతమైనది. వారి జీవితాలను, శ్రమను దగ్గరగా ఆవిష్కరించేందుకు శ్రీనివాసరెడ్డి స్వయంగా 4,800 అడుగుల లోతు వరకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి ఫొటోలు తీశారు. శ్రమైక జీవనాన్ని సున్నితంగా, హృద్యంగా ప్రతిబింబించిన శ్రీనివాసరెడ్డి దృక్పథానికి ఈ పురస్కారం ఒక ప్రత్యేక గౌరవంగా నిలిచింది.


​ఫొటోగ్రఫీ: కళ మాత్రమే కాదు, బాధ్యత కూడా! : తమ్మా శ్రీనివాసరెడ్డి

ఫొటోగ్రఫీ అంటే కేవలం అందమైన దృశ్యాలను చిత్రీకరించడం మాత్రమే కాదు. కాలాన్ని, సమాజాన్ని, మనుషుల జీవితాలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత కూడా. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ నేను గ్రహించిన విషయం ఒక్కటే. మనుషులు, సంస్కృతులు, ప్రకృతి వేర్వేరుగా కనిపించినా వాటిని కలిపేది జీవన అనుభవమే. యువ ఫొటోగ్రాఫర్లు కెమెరాను కేవలం సాంకేతిక సాధనంగా కాకుండా సమాజాన్ని అర్థం చేసుకునే కిటికీగా చూడాలి. నేటి దృశ్యాలు రేపటి చరిత్రగా మారతాయి.

– యడవల్లి శ్రీనివాసరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్