గణితం అంటే చాలామంది విద్యార్థులకు భయం! అలాంటి వారికి సైతం ఆయన సులభంగా లెక్కలను ఒంటపట్టిస్తారు. అంకెలతో అలవోకగా ఆటలాడిస్తారు. భయాన్ని పారదోలి, లెక్కల పట్ల అమితమైన ఇష్టాన్ని కలిగిస్తారు. ఆయనే సరికొండ లెనిన్ బాబు. వేలాదిమంది విద్యార్థులకు, పరీక్షార్థులకు గణితశాస్త్రాన్ని సులభతరం చేసిన అధ్యాపకుడు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణిత అధ్యాపకుడిగా లెనిన్ బాబుకు మంచి గుర్తింపు ఉంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు గణితంలోని క్లిష్టమైన సమస్యలను సైతం సులభంగా బోధిస్తారు. గణితంపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి, వారిని ఆ అంశంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో మూడు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్నారు. వేలాదిమంది పోటీ పరీక్షల్లో రాణించటానికి తనవంతు సహకారం అందిస్తున్నారు. పలు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన అనుభవంతో లెనిన్ బాబు ఉత్తమ బోధనా ప్రమాణాలను నెలకొల్పారు. సెలవు రోజుల్లోనూ, తీరిక సమయాల్లోనూ పిల్లలకు లెక్కలు నేర్పటమే ఒక దీక్షగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఏటేటా వేసవి సెలవుల్లో పేద విద్యార్థులకు గణిత విజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నారు. పోటీ పరీక్షార్థుల కోసం పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. రాస్తున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల కేంద్రానికి చెందిన సరికొండ రామలింగరాజు, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు లెనిన్ బాబు. ఎంఎస్సీ, ఎంఈడీ, టోపాలజీలో పీహెచ్డీ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం సత్తెనపల్లి మండలంలోని సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. గ్రామీణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో పేద విద్యార్థులు చదువుకోవడానికి పడుతున్న ఇబ్బందులను ఆయన దగ్గరగా గమనించారు. తనవంతుగా విద్యార్థులు, యువతలో గణితంపై ఉన్న భయాన్ని తొలగించాలని కృషి చేస్తున్నారు. క్షణం తీరిక దొరికినా విద్యార్థులకు గణిత విద్యను అందించే పనిలో నిమగ్నమై ఉంటారు. గత 36 సంవత్సరాలుగా ఆయన వద్ద శిక్షణ పొందిన విద్యార్థినీ, విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు వివిధ రంగాల్లో నిపుణులుగా గుర్తింపు పొందారు. ఏటేటా వేసవి సెలవుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా గణిత బోధనలు అందిస్తూ ఎందరో విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించారు. గణితాన్ని సులభంగా అర్థం చేసుకునే అంశంగా మార్చారు. ఈ ఏడాది కూడా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు విజయవాడ పటమటలోని సీపీఎం కార్యాలయంలోనూ, గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్మెంట్లలోనూ కొన్ని రోజులపాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతుల ద్వారా విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించేందుకు కృషి చేశారు.

పోటీ పరీక్షల నిపుణుడిగా…
రైల్వే, బ్యాంకులు, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, ఎస్ఎస్సీ, ఏపీపీఎస్సీ, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖల ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇవ్వడంలోనూ లెనిన్ బాబుకు విశేష అనుభవం ఉంది. హైదరాబాద్లోని ఆర్సీ రెడ్డి సంస్థ, విజయవాడలోని సిద్ధార్థ ఐఏఎస్ అకాడమీ, విజేత ఐఏఎస్ స్టడీ సర్కిల్లలో ఏపీపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ అందించారు. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే జీఆర్ఈ, టోఫెల్, శాట్, జీమ్యాట్ వంటి పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. వందలాది వృత్తి మార్గదర్శక శిబిరాల్లో పాల్గొన్నారు. పుస్తక మహోత్సవాల్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గణిత తరగతులు నిర్వహించారు. గణిత అవగాహన సదస్సులను అనేక చోట్ల నిర్వహిస్తూ, సులభంగా గణితాన్ని ఎలా నేర్చుకోవాలో బోధిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యార్థులకు ఆయన గణిత బోధన చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఇందులో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. గణితంలో బీజగణితం, జ్యామితి, కలన గణితం, త్రికోణమితి వంటి అంశాలు అత్యంత ప్రాధాన్యమైనవి. ఈ విభాగాల్లోని ప్రాథమిక అంశాలను సులభంగా అర్థం చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని లెనిన్ బాబు వివరిస్తుంటారు.
శాస్త్రీయ పద్ధతులతో…
సాధారణంగా చాలా మంది పిల్లలు గణితం అంటే భయపడుతుంటారు. యువత కూడా గణితానికి దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వారిలో ఆసక్తి పెంచేందుకు నిత్యజీవితంలోని ఉదాహరణలను ఉపయోగించాలని లెనిన్ బాబు సూచిస్తారు. చతురస్రం, వృత్తం, త్రిభుజం వంటి ఆకారాలతో ఉన్న వస్తువులను ఉపయోగించి గణిత భావనలను పిల్లలకు పరిచయం చేస్తారు. అబాకస్ సహాయంతో లెక్కించడం, కూడిక, తీసివేత వంటి అంశాలను నేర్పిస్తారు. ఏదైనా సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టినా, ఆచరణాత్మక అభ్యాసం ద్వారా విద్యార్థులు వేగంగా నేర్చుకుంటారని ఆయన చెబుతారు. ఇవన్నీ ఆచరణాత్మకంగా చేయిస్తూ విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందిస్తున్నారు. సాధారణ తరగతి గది బోధనకు భిన్నంగా విద్యార్థులతో కలిసి ప్రాంగణాల్లోనే గణిత అంశాలను ప్రదర్శిస్తూ నేర్పించటం లెనిన్ బాబు వినూత్న శైలి! పాఠ్యాంశాలను కృత్యాల రూపంలో నిర్వహిస్తారు. చతురస్రం, దీర్ఘచతురస్రం ఆకారాలను ముగ్గుల రూపంలో వేయించి, వాటి పొడవు, వెడల్పులను కొలిపిస్తారు. ఆ కొలతల ఆధారంగా చుట్టుకొలత, వైశాల్యాన్ని విద్యార్థులే స్వయంగా లెక్కించేలా ప్రోత్సహిస్తారు. ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు గణితం పట్ల అవగాహన పెరిగి, భయం తొలగిపోతుందని లెనిన్ బాబు చెబుతారు.
– యడవల్లి శ్రీనివాసరావు








కామెంట్లు (0)