ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? విద్యుత్ అంటే ఏమిటి? ధ్వని ఎలా ప్రయాణిస్తుంది? పక్షులు ఆకాశంలో ఎలా ఎగురుతాయి? ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం ఎందుకు త్వరగా ఉడుకుతుంది? నక్షత్రాలు ఎందుకు మినుకుమినుకుమంటాయి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి మనిషి మనసులో ఎప్పుడో ఒకప్పుడు మెదులుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు అందించేది, ప్రకృతి రహస్యాలను వెలికితీసేది విజ్ఞానశాస్త్రం. అలాంటి శాస్త్రజ్ఞానాన్ని విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా అందిస్తూ, శాస్త్రీయ చింతనకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు విద్యావేత్త డాక్టర్ పల్లె సూర్యనాగి రెడ్డి.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గదరగుట్టపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన జీవితం పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. చిన్ననాటి నుంచే పశుపోషణ, వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ చదువును కొనసాగించారు. కిరోసిన్ లాంతర్ల వెలుగులో చదువుకున్న ఆయన, ఏదో ఒకరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా, విద్యావేత్తగా, పరిశోధకుడిగా ఎదుగుతానని అప్పట్లో ఊహించకపోయినా, తన పట్టుదలతో ఆ లక్ష్యాన్ని సాధించారు.
విజయం అంటే కేవలం చదువులో ప్రతిభ కనబరచడం మాత్రమే కాదు; ప్రతికూల పరిస్థితులను అధిగమించడం కూడా అని తన జీవితంతో నిరూపించిన వ్యక్తి డాక్టర్ సూర్యనాగి రెడ్డి. చిన్ననాటి నుంచే ఎదురైన శారీరక వైకల్యాన్ని ఆయన ఎప్పుడూ బలహీనతగా భావించలేదు. దాన్నే తన ఆత్మవిశ్వాసానికి, విజయానికి పునాదిగా మలుచుకున్నారు. ఒక కాలు పూర్తిగా పనిచేయకపోయినా, విద్యపై ఉన్న ఆసక్తి, లక్ష్యసాధనపై ఉన్న నిబద్ధత ఏనాడూ తగ్గలేదు. శారీరక ప్రతికూలతలను సైతం లెక్కచేయకుండా ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం నడిచి ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఆయన, ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ప్రతిరోజూ 32 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించేవారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, గణితశాస్త్రంలో వంద శాతం మార్కులు సాధించి విశేష ప్రశంసలు అందుకున్నారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల నుంచి ఎంఎస్సీ ఫిజిక్స్, బి.ఎడ్ పట్టాలు పొందారు. 1995లో నిర్వహించిన తొలి డీఎస్సీ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టి, ప్రస్తుతం కళ్యాణదుర్గంలోని ఎస్‌వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకునిగా సేవలందిస్తున్నారు.
బోధనలో సరికొత్త దృక్పథం
భౌతికశాస్త్రం అంటే కఠినమైన సూత్రాలు, క్లిష్టమైన సమీకరణాల సమాహారమనే అపోహను ఆయన చెరిపేస్తున్నారు. నిత్యజీవిత ఉదాహరణలతో, ప్రయోగాలతో, క్షేత్రస్థాయి పర్యటనలతో విద్యార్థుల్లో విజ్ఞానాసక్తిని పెంపొందిస్తున్నారు. ‘మేక్ ఫ్రెండ్స్ విత్ ఫిజిక్స్’ అనే భావనతో శాస్త్రాన్ని భయపడాల్సిన అంశంగా కాకుండా, స్నేహితుడిగా పరిచయం చేస్తున్నారు. సూక్ష్మకణాల నుంచి విశ్వ రహస్యాల వరకు భౌతికశాస్త్రం ఎలా ముడిపడి ఉందో ఆయన సరళంగా వివరిస్తారు. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ద్రవ్యరాశి–శక్తి సంబంధాన్ని, క్వాంటం మెకానిక్స్, సాపేక్షత వంటి ఆధునిక సిద్ధాంతాలను విద్యార్థుల అవగాహనకు అనుగుణంగా వివరిస్తూ, శాస్త్రీయ ఆలోచనకు ప్రేరణనిస్తున్నారు.
ప్రయోగాలకు ప్రాధాన్యం
పాఠ్యాంశాలను కేవలం బోధించడమే కాకుండా, వాటిని ప్రత్యక్ష అనుభవాలుగా మార్చడం ఆయన ప్రత్యేకత. న్యూటన్ సిద్ధాంతాలను ప్రయోగాల ద్వారా నిరూపించడం, గురుత్వాకర్షణ ప్రభావాన్ని ప్రదర్శించడం వంటి వినూత్న పద్ధతులతో బోధనను ఆసక్తికరంగా మలుస్తారు. విజ్ఞానాన్ని వినోదంతో మేళవిస్తూ విద్యార్థుల్లో ఆసక్తి తగ్గకుండా చూసుకుంటారు. అందుకే ఆయన తరగతులు విద్యార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నాగిరెడ్డి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్థాయిలలో భౌతికశాస్త్రాన్ని బోధించే అరుదైన అవకాశాన్ని పొందారు. ఈ విస్తృత అనుభవం ద్వారా వివిధ విద్యా స్థాయిలలోని విద్యార్థుల అవసరాలను అర్థం చేసుకొని, వారి విద్యా, మేధో వికాసానికి విశేషంగా తోడ్పడ్డారు.
ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా, విద్యా పరిపాలకుడిగా కూడా ఆయన విశిష్ట సేవలందించారు. ఫిజిక్స్ విభాగాధిపతి (HOD), బోర్డ్ ఆఫ్ స్టడీస్ (BOS) చైర్మన్, అకడమిక్ కోఆర్డినేటర్, NAAC కోఆర్డినేటర్ వంటి పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. పరీక్షల నిర్వహణలోనూ తన ప్రతిభను చాటుకున్న ఆయన, జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, విద్యా సేవతో పాటు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు.
మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయ ఆలోచనల వ్యాప్తి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థుల్లో విజ్ఞాన చైతన్యాన్ని పెంపొందిస్తూ, ప్రశ్నించే స్వభావాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన విద్యా ప్రస్థానం, సేవాభావం, శాస్త్రీయ దృక్పథం అనేకమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

జిజ్ఞాసే ఆవిష్కరణలకు మూలం
శాస్త్రం అనేది కేవలం సూత్రాల సమాహారం కాదు; అది ప్రపంచాన్ని అర్థం చేసుకునే సాధనం. ప్రశ్నించే స్వభావం, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం కలిసివస్తేనే గొప్ప ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. అదే సందేశాన్ని విద్యార్థులకు అందిస్తూ, వారిని చదువు, ఉద్యోగం, పరిశోధన రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను. గ్రామీణ నేపథ్యం నుంచి ప్రారంభమైన నా ప్రయాణం నేడు వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయక మార్గదర్శకంగా నిలుస్తోంది.
– పల్లె సూర్యనాగి రెడ్డి, భౌతికశాస్త్ర విభాగం అధ్యాపకులు
పరిశోధన, పరిపాలనలోనూ ప్రతిభ
విద్యాబోధన, పరిశోధన, విద్యా పరిపాలన రంగాలలో సమాన ప్రతిభ కనబరిచిన డాక్టర్ పి. సూర్యనాగి రెడ్డి, అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి పీహెచ్‌డీ పట్టా సాధించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పలు పరిశోధనా వ్యాసాలను ప్రచురించి పరిశోధకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. కళాశాల NAAC కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ సంస్థకు ‘బి’ గ్రేడ్ సాధించడంలో కీలక పాత్ర పోషించడమేగాక, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా సేవలందించి విద్యా ప్రమాణాల మెరుగుదలకు విశేష కృషి చేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2017 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం “ఉత్తమ ఉద్యోగి” పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ పురస్కారం ఆయన అంకితభావం, కృషి, సేవాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.
– యడవల్లి శ్రీనివాసరావు








కామెంట్‌లు (0)