క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ఎన్నో ఆటల్లో మహిళలకు, పురుషులకు విడివిడిగా పోటీలు ఉంటాయి. అయితే ఒక చోట ఓ ఆటను మాత్రం ఆడ, మగ ఇద్దరూ కలిసి ఆడుతున్నారు. ఆ మైదానంలో పురుషులతో పోటీ పడుతున్న ఆ మహిళలు పురుషులపై గెలవడం కోసం ఆడడం లేదు. “పురుషులతో మేము కూడా సమానం” అని చెప్పేందుకు ఆడుతున్నారు. ఆ లక్ష్యం నెరవేరడం కోసం గుర్రంపై తలపాగా ధరించి, ఠీవీగా కూర్చొని ఒక చేత్తో గుర్రాన్ని, రెండో చేత్తో గెలుపును స్వాధీనం చేసుకుంటూ ముందుకు ఉరుకుతున్నారు.
పాకిస్తాన్ ఉత్తర పంజాబ్‌లోని రావల్పిండిలో సువిశాలమైన వ్యవసాయ భూమిలో ‘నేజీ బాజీ’ (టెంట్ పెగ్గింగ్) పేరుతో నిర్వహించే ఆ క్రీడ మహిళల శక్తి సామర్థ్యాలను పరీక్షించేది కాదు; వివక్ష నిండిన సమాజంలో పురుషులతో సమానమైన గౌరవం కోసం శక్తివంచన లేకుండా పోరాడుతున్న మహిళల ధైర్యానికి నిదర్శనం. ముప్పయేళ్ల అనుమ్ షాకోర్ గుర్రంపై ఠీవీగా కూర్చొని మైదానంలో పరుగులు పెడుతుంటే, తన మెడ చుట్టూ కట్టుకున్న నల్లని దుపట్టా అంతకంటే వేగంగా తన వెనకే పరుగుపెడుతోంది. లక్ష్యం (పెగ్) వైపు దూసుకెళ్తున్న అనుమ్ ఒక్కసారిగా ఒంటి చేత్తో గుర్రాన్ని అదుపులోకి తీసుకుంది. మరో చేతిలో ఉన్న ఆరడుగుల పొడవుగల మొనతేలిన కర్రతో గురి చూసి లక్ష్యాన్ని కొట్టింది. అప్పటికే తను ఒక పెగ్‌ను సాధించింది. ఈసారి పెగ్ తృటిలో తప్పిపోయింది. ఆ క్షణంలో మైదానం చుట్టూ గుమిగూడిన జనసందోహంలో ఏదో తెలియని నిరాశ, నిట్టూర్పులు కనిపించాయి. కానీ అనుమ్ అవేమీ పట్టించుకోలేదు. తన తదుపరి లక్ష్యం వైపు గుర్రాన్ని దౌడు తీయించింది.
చుట్టూ వేలాదిమంది పురుషులు
ఆటను చూసేందుకు వచ్చిన వారిలో తలపాగాలు ధరించిన పురుషులు ఒకపక్క చాలా హుందాగా కుర్చీల్లో కూర్చుంటారు. వారిలో పోటీలో పాల్గొంటున్న క్రీడాకారుల తండ్రులు, అన్నయ్యలు ఉంటారు. ఆ పురుషుల్లో చాలామందికి “ఈ మహిళలకు ఈ ఆటలు సరికావు” అన్న ధోరణి బలంగా ఉంది. ఇంకొందరిలో “ఇంట్లో కూర్చునే ఆడవాళ్లకు గుర్రపు స్వారీలు అవసరమా?” అన్న భావజాలం నిండిపోయింది. తమ చుట్టూ ఉన్న ఈ వాతావరణాన్ని ఛేదిస్తూనే ఆ మహిళలు లక్ష్యం వైపు దూసుకుపోతున్నారు.
పంజాబీ భాషలో ‘మేళా’ అని పిలవబడే ఈ పోటీలు ‘కార్నివాల్’ తరహాలో నిర్వహించడం ఆ ప్రాంతంలో ఎప్పటినుంచో ఉంది. గతంలో పెళ్లి వేడుకల్లో పెద్ద పెద్ద డ్రమ్ములపై హోరెత్తే శబ్దాలను వాయిస్తూ ఈ ఆటను ప్రత్యేక వినోదంగా ఏర్పాటుచేసేవారు. తదనంతర కాలంలో వీటిని క్రీడా పోటీలుగా నిర్వహించడం మొదలైంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పోటీల్లో 74 టీమ్‌లు పాల్గొన్నాయి. పాకిస్తాన్‌లోని ఏకైక మహిళా టెంట్ పెగ్గింగ్ క్లబ్ ‘షాకూర్ బింటె-ఇ-జహ్రా క్లబ్’లో దీన్ని నిర్వహించారు. అనుమ్తో పాటు 16 ఏళ్ల ఈషల్ ఇబ్రహిం, నూర్ ఔన్ నిసా మాలిక్, ఇద్దరు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సెహ్రిష్ అవాన్ ఈ పోటీలో పాల్గొన్నారు. సెహ్రిష్కు ఇది మొదటి మ్యాచ్.
పురుషులతో పాటే సాధన
ఈ క్లబ్ వ్యవస్థాపకురాలైన షాకూర్ దీని గురించి ఇలా చెప్పారు: “గతేడాది ఈ క్లబ్‌ను ప్రారంభించాను. అప్పటివరకు ఆడవాళ్లు మగవాళ్ల క్లబ్బుల్లోనే శిక్షణ తీసుకునేవారు. అది చాలా దారుణంగా ఉండేది. ఆ పరిస్థితిని పోగొట్టాలనే దీన్ని మొదలుపెట్టాను” అంటున్నారు.
పోటీ జరుగుతున్న క్రీడా ప్రాంగణం గురించి షాకూర్ ఇలా అన్నారు: “ఇక్కడ పోటీలో పాల్గొనే వారు పురుషులే. మెడలో డోలు కట్టుకుని వాయించే వారు పురుషులే. అభిమానులూ పురుషులే. ఇంతమంది మధ్య ఈ మహిళలు ప్రదర్శన చేయడం ఆషామాషీ కాదు. అయినా మా బృందం ముందుకే నడుస్తుంది” అంటున్నారు.
గుర్రాలపై ఠీవీగా వస్తున్న మహిళలు బరిలోకి అడుగుపెట్టగానే కెమెరాలన్నీ వాళ్లవైపు తిరిగాయి. సోషల్ మీడియా వ్లాగర్లు కూడా మహిళా బృందం వైపే తమ సెల్ఫోన్లు తిప్పారు.
ఏకైక కెప్టెన్
మైదానానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి 22 ఏళ్ల ఆయేషా ఖాన్ వచ్చింది. చిన్నప్పటి నుంచే ఆయేషాకు గుర్రపు స్వారీ చేయడం ఇష్టం. 17 ఏళ్లకే జాతీయ జట్టులో ఆడింది. ‘అండర్-21 మిక్స్డ్’ బృందానికి ఎంపికైన ఏకైక మహిళ ఆయేషానే. 2022లో జోర్డాన్‌కు వెళ్లి 13 దేశాలతో తలపడింది. ఆ అనుభవాన్ని ఆయేషా ఇలా గుర్తుచేసుకుంది: “ఆ ఏడాది మాత్రమే పాకిస్తాన్ మహిళా బృందం అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఆ తరువాత ఇంతవరకు మాకు అవకాశం రాలేదు” అని చెబుతోంది. “మా దేశంలో మమ్మల్ని క్రీడాకారులుగానే గుర్తించరు. పోటీలు అనగానే ఫెడరేషన్ వాళ్లకు పురుషులు మాత్రమే గుర్తుకువస్తారు” అని ఎంతో ఆవేదనగా ఆయేషా మాట్లాడింది. అయితే, ఇంత నిరాశావాదంలో కూడా ఆయేషా ఎక్కడా తన సామర్థ్యాన్ని మరుగుపరుచుకోవడం లేదు. ఈ మేళాలో 70 మంది పురుష పోటీదారులతో తలపడుతున్న ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, మేళాలో పాల్గొంటున్న ‘మహిళా టెంట్ పెగ్గింగ్’ బృందానికి కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తోంది.
టెంట్ పెగ్గింగ్ క్రీడ చాలా ఖరీదైనది. శిక్షణ నుంచి గుర్రాన్ని మేపడం వరకు ప్రతిదీ తలకు మించిన భారమే. ఈ ఖర్చును భరించే స్థోమత లేని మహిళలు ఆసక్తి ఉన్నా ఇటువైపు రావడం లేదు. శిక్షణ తీసుకున్నా, పోటీల్లో పాల్గొనాలంటే సొంత గుర్రం ఉండితీరాలన్న నిబంధన వల్ల ఇంకొంతమంది మహిళలు పోటీ వైపు చూడడం లేదు. అందుకే ప్రస్తుతం మేళాలో పాల్గొంటున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. “స్పాన్సర్లు ఉంటే మా సంఖ్య కూడా పెరుగుతుంది” అంటున్న ఈ మహిళల తెగువ గెలుపు కోసం కాదు; సమానత్వం కోసం. సమాన హక్కుల కోసం పోరాడుతున్న ఎంతోమంది మహిళలు ఈ కథలో కళ్లముందు మెదులుతారు.








కామెంట్లు (0)