test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎండ తీవ్రత నుంచి రక్షణ ఇలా...

19 మే, 2026

నమ్మర్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఎండలు మండిపోతున్న వేళ... వాతావరణ శాఖ తాజాగా రెండు తెలుగు రాష్ర్టాలకు ఐదు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతల గురించి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా బయట పనికి వెళ్లే వాళ్లే కాదు, ఇంట్లో ఉండే వృద్ధులు, పిల్లలు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. వడదెబ్బకు గురైనప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే… ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. తాజా హెచ్చరికల నేపథ్యంలో వడదెబ్బ గురించి, దాని నుండి బయటపడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం.
వడదెబ్బ డీహైడ్రేషన్‌కు సంబంధించిన అనారోగ్యం. ఇందులో హీట్ ఎగ్జాషన్, హీట్ ఇంజురీ, హీట్‌ స్ట్రోక్‌ అనే మూడు రకాలు ఉంటాయి.
* హీట్ ఎగ్జాషన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అలసటగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కండరాల నొప్పి ఉంటుంది.
* హీట్ ఇంజురీలో శరీర భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
* హీట్‌ స్ట్రోక్‌ తీవ్రమైన సమస్య… దీనిలో శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీని కారణంగా మెదడు పనితీరు దెబ్బతింటుంది. స్ట్రోక్‌ సంభవించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ఎవరికి రిస్క్‌ ఎక్కువ?
వదదెబ్బ రెండు రకాలు ఉంటుంది. మొదటిది క్లాసిక్ హీట్ స్ట్రోక్… రెండవది ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్.
* క్లాసిక్ హీట్ స్ట్రోక్ కారణంగా వృద్ధులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. ముఖ్యంగా డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, సిస్టిక్ ఫైబ్రోసిస్, స్లీప్ డిజార్డర్స్, కిడ్నీ, ఊపిరితిత్తులు, శరీర ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే మందులు వేసుకునే వారికి ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే లివర్‌, థైరాయిడ్‌, రక్తనాళాల సమస్యలు ఉన్నవారు క్లాసిక్ హీట్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది.
* ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ చిన్న వయస్సు వారికి సంభవించే అవకాశం ఉంది. తీవ్రమైన వ్యాయామం, క్రీడాకారులు, వేడి వాతావరణంలో శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, డీహైడేషన్‌, శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, సూర్యరశ్మికి గురైనప్పుడు ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ వస్తుంది.

ఎలా నివారించాలి?
డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు- శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది.
* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయట తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను ధరించాలి.
* ఆల్కాహాల్‌ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
* ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం లాంటివి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి. దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవాలి.
* వేసవిలో తేలికపాటి వ్యాయామాలు ఉదయం 8 గంటల్లోపే ముగించాలి.
* వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే శరీరం పూర్తిగా నిర్జలీకరణం చెంది… బీపీ, పల్స్‌ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు.

వడదెబ్బకు గురైతే ...
* ప్రథమ చికిత్సగా మెడ, ముఖంపై ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవాలి.
* వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి.
* ఒంటిపై దుస్తులను వదులుగా చేసి గాలి బాగా ఆడేలా చూడాలి.
* నీరు, ద్రవాహారాలను బాగా అందించాలి.
* కొబ్బరినీరు, చెరుకు రసాలు, పెరుగు, మజ్జిగ, పళ్లరసాలు వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తాయి.
* వడదెబ్బ లక్షణాలు తీవ్రంగా ఉంటే… వెంటనే హాస్పటల్‌కు తీసుకువెళ్లడం మంచిది.

వడదెబ్బ లక్షణాలను ఇలా గుర్తించాలి

వడదెబ్బ లక్షణాలు వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఒళ్లు నొప్పులు, అలసట, కళ్లు తిరగడం, చెమట, అటాక్సియా, మైకము, చర్మం కందిపోవడం, వికారం, వాంతులు, అధిక దాహం, తక్కువ మూత్ర విసర్జన, గుండె వేగంగా కొట్టుకోవడం, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, బ్రెయిన్ వాపు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, మెటబాలిక్ ఫెయిల్యూర్, నరాలు దెబ్బతినడం, గుండెకు రక్త ప్రసరణ తగ్గడం, హార్ట్ ఫెయిల్యూర్, కోమాలోకి వెళ్లడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది వడదెబ్బను సాధారణ జ్వరంగా లేదా నీరసంగా భావించి పొరపడుతుంటారు. వేసవిలో ఇలాంటి నిర్లక్ష్యం ప్రమాదకరం. పై లక్షణాలు కనిపిస్తే, వెంటనే అప్రమత్తం అవ్వాలి.

గుండె ఆరోగ్యం పదిలం

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి గుండెపై పడే ఈ ఒత్తిడి ప్రమాదకరం. అంతేకాకుండా, వేడిలో అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) ఏర్పడి, రక్త పరిమాణం తగ్గి రక్తపోటు పడిపోతుంది. ఇది తల తిరగడం, నీరసం, స్పృహ కోల్పోవడం వంటి వాటికి దారితీస్తుంది. ఇది గుండె రోగులకు ప్రమాదకరం. హృద్రోగ నిపుణుల ప్రకారం, వేడి వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్తపోటు తగ్గి గుండె సాధారణ లయకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల అరిథ్మియా వంటి సమస్యలు తలెత్తవచ్చు. తీవ్రమైన వేడిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల వడదెబ్బకు గురికావచ్చు. ఈ పరిస్థితి గుండెపోటు లేదా పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు ఈ విషయాలన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక వేడి గుండెకే కాకుండా, శరీరంలోని అన్ని భాగాలకు కూడా హానికరం. వేసవిలో గుండె జబ్బులను నివారించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీళ్లు తాగాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్