test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశ ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించిన మోడీ ప్రభుత్వం

1 రోజు క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 12:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన పేపర్ లీకేజీలు

  • జూన్ 9 నిరసనలను జయప్రదం చేయాలి

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు పిలుపు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : దేశ ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన పేపర్ లీకేజీలు, ప్రజా రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై దాడులకు వ్యతిరేకంగా జూన్ 9న దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ సమావేశం శనివారం సిపిఎం కార్యాలయం లో జువ్వల రాంబాబు అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిధి గా పాల్గొన్న వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందన్నారు. సంపద కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, పేదలు మరియు మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుందని, కోట్లాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో బలహీనపరుస్తోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, వివిధ ప్రవేశ, ఉద్యోగ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీశాయని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాలపాటు శ్రమించి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, ఎనిమిది గంటల పని విధానాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కార్మికులు సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి విస్తృత ఐక్య పోరాటాలు అవసరమని అన్నారు.ప్రజల జీవన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విభజించే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల అసలు సమస్యలైన ఉపాధి, విద్య, వైద్యం, ధరల నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూన్ 9న నిర్వహించే నిరసన కార్యక్రమాలలో ప్రజలు, యువత, విద్యార్థులు, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ లో యాజమాన్యం నిరంకుశ వైఖరి కారణంగా 1200 మంది పర్మినెంట్ కాంట్రాక్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని కోరారు. సమావేశం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, పి తులసి, జిల్లా కమిటీ సభ్యులు సుందర బాబు, పూర్ణిమ రాజ్, ఎస్ ఎస్ మూర్తి, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్