test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకమ్యూనిస్టులపై పవన్ అపరిపక్వ వ్యాఖ్యలు

3 రోజుల క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 12:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కమ్యూనిస్టులపై పవన్ కల్యాణ్‌ చేసిన వాఖ్యలు అపరిపక్వమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. గురువారం విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావించారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న పనికిరాని పాత చింతకాయ పచ్చడినే పవన్ కల్యాణ్‌ మరోమారు వండి వార్చారని పేర్కొన్నారు.ఇది ఆయన ఆపరిపక్వత, రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా వారికి అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతున్నారన్నారని, దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి వరకు చేగువేరా, భగత్‌సింగ్ ఆదర్శాల గురించి చెప్పిన ఆయన నేడు కమ్యూనిజమే కాలం చెల్లిందంటున్నారని చెప్పారు. కమ్యూనిజంపై ట్రంప్‌తో సహా అనేకమంది చేస్తున్న దాడి దాని బలాన్ని సూచిస్తున్నదని అన్నారు. గతంలో కమ్యూనిస్టులతో పనిచేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత బిజెపి సరసన చేరి సనాతన ధర్మం గురించి చాలా హడావుడి చేశారని, ఆంధ్ర ప్రజల్లో ప్రాంతీయ అభిమానం కూడా లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇలా రోజుకోమాట, పూటకో విధానాన్ని మార్చే ఆయన కమ్యూనిజం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలను వ్యాపారంగా భావించే రాజకీయ పార్టీలకు, సమ సమాజంకోసం త్యాగాలు చేసి పోరాడే కమ్యూనిస్టులకు నఖశిఖపర్యంతమంత తేడా ఉందని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉందని, ప్రపంచమంతా పోరాటాలు ఉధృతమవుతున్నాయని మనదేశంలో కూడా యువత తీవ్ర అసంతృప్తితో ఉందని ఇటీవలే వ్యక్తమైందని చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరుగుతున్న వ్యంగాత్మక క్యాంపెయిన్ దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. అమెరికాతో సహా పక్కనున్న శ్రీలంక వరకు జరుగుతున్న పరిణామాలు ఏమిటో పవన్ కల్యాణ్‌ లాంటి వారికి కనిపించకపోయినా యువతరానికి స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. మతతత్వ బిజెపితోచేరి యువతలో వస్తున్న మార్పుల్ని ఆయన గుర్తించడంలేదన్నారు. ప్రముఖ విశ్లేషకులు డాక్టర్‌ నాగేశ్వర్‌తో ఆరంభమైన వివాదం ప్రజాతంత్ర హక్కుల పరిధిలోనిదని, దాన్ని కొందరు పక్కదారి పట్టించి వివాదంగా మార్చారని, రెండు రాష్ట్రాల ప్రజలు ఇలాంటి వారి ఉచ్చులో పడకుండా తెలుగు ప్రజల ఐక్యతను కాపాడాలని ‌శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్