test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‌పోలీస్‌ నిర్బంధాన్ని అధిగమించి ‘చలో ఎపిఎండిసి విజయవంతం

21 మే, 2026

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 21, 2026, 08:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం


  • భారీగా తరలివచ్చిన కార్మికులు, చిన్న పరిశ్రమల అధినేతలు

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : బైరైటీస్ బల్క్ టెండరును రద్దు చేయాలని కోరుతూ బైరైటీస్‌ పరిరక్షణ కమిటీ బుధవారం నిర్వహించిన ‘చలో ఎపిఎండిసి` కార్యక్రమం విజయవంతమైంది. పోలీస్‌ నిర్బంధాన్ని అధిగమించి స్థానికులు, కార్మికులు, ఉద్యోగులు, చిన్న పరిశ్రమల అధినేతలు భారీగా కదలివచ్చారు. ‘​బైరైటీస్ గనులను కాపాడుకుంటాం` అంటూ ముక్తకంఠంతో నినదించారు. సిఐటియు ఆధ్వర్యంలో బైరైటీస్ పరిరక్షణ కమిటీ పది రోజుల క్రితం ‘చలో ఎపిఎండిసి` కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో, ఎస్‌‌పి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకూ సిఐటియు నాయకుల కదలికలపై గత మూడు రోజులుగా అడుగడుగునా నిఘా ఉంచారు. చలో కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని, సెక్షన్‌ 30 యాక్ట్ అమల్లో ఉందని, గుంపులు గుంపులుగా ఉండరాదని, బైరైటీస్ ఏరియాలోకి వస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని భయపెట్టే ప్రయత్నం చేశారు. చలో కార్యక్రమానికి వచ్చిన కార్మికులను మంగంపేట బైరైటీస్ గనుల వద్దగల ఎపిఎండిసి కార్యాలయం వద్దకు రానీ‌యకుండా అడ్డుకున్నారు. అయితే, మంగంపేట గ్రామస్తులు, బైరైటీస్ లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఎవరికి వారే వేర్వేరుగా బయల్దేరి ఎర్ర జెండాలతో మైనింగ్ గనులున్న ప్రాంతానికి వందలాదిమంది చేరుకున్నారు. దీంతో, పోలీసులు ఏమీ చేయలేకపోయారు. మిమ్మల్ని ఇక్కడకు పిలిపించిన సిఐటియు నాయకులపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడంతో ఒక్కసారిగా వారంతా కోపోద్రిక్తంతో ‘మా బైరైటీసును కాపాడుకుడేందుకు సిఐటియు నాయకులు వచ్చారు. ప్రతిపక్ష పార్టీగాని, అధికార పార్టీగాని మా గురించి పట్టించుకోలేదు. మాకు అండగా వచ్చిన వారిపై కేసులు పెడితే ఊరుకునేది లేదు. మేమే సిఐటియు కార్యాలయానికి వెళ్లాం` అంటూ తిరగబడడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అదే సమయంలో పోలీస్‌ ‌నిర్బంధాన్ని అధిగమించి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు, సిఐటియు ఉపాధ్యక్షులు, బైరైటీస్‌ పరిరక్షణ కమిటీ కన్వీనర్ కందారపు మురళి, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.జయచంద్ర, టి.సుబ్రమణ్యం తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఎపిఎండిసి కార్యాలయంలోకి వారిని వెళ్లనీయకుండా పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ‘బైరైటీస్‌‌ గనులను కాపాడాలి. ఎంప్రదా కంపెనీకి ఇచ్చిన బల్క్ టెండరును రద్దు చేయాలి’ అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా సిహెచ్ నర్సింగరావు, కందారపు మురళి మాట్లాడుతూ గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి భూములను అర్పించిన వారికి ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాలు, నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి మరో రెండేళ్లలో బైరైటీస్ గనులను పూర్తిగా తవ్వుకుపోవడానికి కార్పొరేట్‌ కంపెనీకి బల్క్‌ ‌టెండర్‌ ‌కట్టబెట్టడం శోచనీయమన్నారు. రెండేళ్లలో ఇక్కడికి గనులు ఖాళీ అయితే, ఈ ఖనిజం ఆధారపడిన పల్వరైజింగ్ (కటింగ్, పాలిషింగ్) కంపెనీలు మూతబడతామని, వాటిలో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బల్క్‌ ‌టెండర్‌‌ను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం రూపుదిద్దుకుంటుందని హెచ్చరించారు. స్థానికులకు అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్షంగానీ, అధికార పక్షంగానీ మాట్లాడకపోవడాన్ని బట్టి సహజ వనరుల పరిరక్షణపై ఆ పార్టీల వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న గనులను స్థానికంగా ఉన్న 170 పల్వరైజింగ్ (కటింగ్, పాలిషింగ్) కంపెనీలకే ఇచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎపిఎండిసిలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సహజ వనరుల పరిరక్షణకు ‘చలో ఎపిఎండిసి` పిలుపునిస్తే పోలీసులు వేధించడం శోచనీయమన్నారు. అనంతరం ప్రధాన నాయకత్వం ఎపిఎండిసి సిపిఒ కె.గోపీనాథ్‌‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సిపిఒ స్పందిస్తూ, బల్క్ టెండర్ల రద్దు డిమాండును రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పల్వరైజింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాచినేని విశ్వేశ్వరనాయుడు, మిల్లు యజమానులు బుచ్చిరెడ్డి హరినాధరెడ్డి, టివి రాజయ్య, సిఐటియు నాయకులు చంద్రశేఖర్, వెంకటేష్, ఉద్యోగులు మాగంటి శ్రీనివాసులు, అరుణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్