ప్రాచీన భారతదేశంలో తత్వశాస్త్రం, వైద్యం, గణితం, ఖగోళశాస్త్రం, భాషాశాస్త్రం, సాహిత్యం వంటి అనేక రంగాలకు సంబంధించిన పరిజ్ఞానం తరతరాలుగా సంక్రమించింది. ఈ జ్ఞాన సంప్రదాయాలలో కొంత భాగం తాళపత్ర గ్రంథాలు, భోజపత్రాలు, ఇతర రాతప్రతుల రూపంలో నేటికీ అందుబాటులో ఉండి, చారిత్రక, సాంస్కృతిక, భాషా అధ్యయనాలకు ముఖ్య మూలాధారాలుగా నిలుస్తోంది. ముద్రణ యంత్రం విస్తృతంగా అందుబాటులోకి రాకముందు అనేక రచనలు చేతిరాత ప్రతుల ద్వారానే వ్యాప్తి చెందాయి. తాళపత్రాలు, భోజపత్రాలు, చర్మపత్రాలు, చేతితో తయారుచేసిన కాగితాలు, వస్త్రాలు వంటి మాధ్యమాలపై వివిధ రచనలను భద్రపరిచారు. ఇంకా ప్రచురణకు నోచుకోని అనేక రాతప్రతులలో చరిత్ర, వైద్యం, భాష, సాహిత్యం వంటి అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం దాగి ఉంది. కౌటిల్యుడు, చరకుడు, సుశ్రుతుడు వంటి ప్రముఖుల రచనలు, ఆలోచనలు కూడా ప్రధానంగా ఈ వ్రాతప్రతుల ద్వారానే మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాచీన గ్రంథాలు మరుగున పడిపోకూడదని ప్రధాని తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఒక కోటి వ్రాతప్రతులను గుర్తించి భద్రపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మార్చి 16న ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే 39 లక్షల వ్రాతప్రతులను గుర్తించడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో తాళపత్ర గ్రంథాల భాండాగారాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో తిరుపతిలోని ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ORI) అత్యంత కీలకమైనది. ఇక్కడ వేల సంఖ్యలో సంస్కృత, తెలుగు తాళపత్ర గ్రంథాలను భద్రపరిచారు. కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రాచీన కావ్యాలకు, చారిత్రక రికార్డులకు నిలయంగా ఉంది. వీటితో పాటు రాజమండ్రిలోని గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం, నెల్లూరులోని వర్ధమాన సమాజం వంటి సంస్థలు కూడా శతాబ్దాల నాటి వైద్య, జ్యోతిష్య, సాహిత్య గ్రంథాలను సంరక్షిస్తున్నాయి. ఇంతటి విలువైన వారసత్వాన్ని రక్షించి రాబోయే తరాలకు అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘జ్ఞాన భారతం’ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం కేవలం గ్రంథాల సేకరణకే పరిమితం కాదు. ప్రాచీన వ్రాతప్రతులను గుర్తించడం, డిజిటలైజ్ చేయడం, పరిరక్షించడం, పరిశోధకులకు అందుబాటులోకి తేవడం దీని ప్రధాన ఉద్దేశం.
విద్యాసంస్థలు, గ్రంథాలయాలు, మ్యూజియాలు, దేవాలయాలు, మఠాలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న ప్రాచీన రాతప్రతులను సర్వే ద్వారా గుర్తించి నమోదు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆధునిక ఇమేజింగ్ సాంకేతికత వంటి పద్ధతులను ఉపయోగించి వాటిని డిజిటల్ రూపంలోకి మారుస్తారు. శిథిలావస్థలో ఉన్న తాళపత్ర గ్రంథాలను శాస్త్రీయ పద్ధతుల ద్వారా పునరుద్ధరించి భద్రపరుస్తారు. అనంతరం డిజిటలైజ్ చేసిన సమాచారాన్ని నేషనల్ డిజిటల్ రిపోజిటరీ (NDR) ద్వారా పరిశోధకులు, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ బృహత్తర ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం 2025–2031 కాలానికి సుమారు రూ.491.66 కోట్లు కేటాయించింది. చారిత్రక మూలాధారాల పరిరక్షణకు చేపట్టిన అతిపెద్ద కార్యక్రమాల్లో ఇదొకటి. ఈ పథకం ద్వారా సంస్కృతం, ప్రాకృతం, పాళీతో పాటు అనేక ప్రాంతీయ భాషలలో ఉన్న వ్రాతప్రతులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బ్రాహ్మీ, శారదా, గ్రంథ, నందినాగరి వంటి ప్రాచీన లిపుల అధ్యయనానికి కూడా ఇది దోహదపడుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP–2020)లో ప్రస్తావించిన భారతీయ విజ్ఞాన వ్యవస్థ (IKS) అధ్యయనానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. జ్ఞాన భారతం మిషన్‌ను విజయవంతం చేయడానికి ప్రభుత్వం క్లస్టర్ సెంటర్లు, ఇండిపెండెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి.
భారత ప్రభుత్వం దేశవ్యాప్త రాతప్రతుల సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ పనిచేస్తుంది. సర్వే నిర్వహణ, శిక్షణ పొందిన సర్వేయర్ల నియామకం, రాతప్రతుల గుర్తింపు, నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. దేవాలయాలు, మఠాలు, ఆశ్రమాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న రాతప్రతులను గుర్తించి మ్యాపింగ్ చేయడం ఈ కార్యక్రమంలో భాగం. శిక్షణ పొందిన సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి ‘జ్ఞాన భారతం’ యాప్‌లో నమోదు చేస్తారు. రాతప్రతులు ఉన్న ప్రదేశాలను జియో-ట్యాగింగ్ చేయడం ద్వారా వాటి సమాచారాన్ని భద్రపరుస్తారు. ఈ సర్వే పలు దశల్లో సాగుతుంది. ముందుగా రాతప్రతుల ఉనికిని గుర్తిస్తారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటి స్థితిగతులను నమోదు చేస్తారు. సేకరించిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరచి కేంద్ర స్థాయిలో ధ్రువీకరిస్తారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వివరాలు సేకరిస్తారు.
ఈ ప్రక్రియలో రాతప్రతుల యజమానుల అనుమతితోనే సమాచారాన్ని నమోదు చేస్తారు. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అరుదైన, అంతరించిపోతున్న వ్రాతప్రతుల సమాచారాన్ని సమగ్రంగా భద్రపరచవచ్చు. సర్వేలో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛందం. వ్యక్తులు, సంస్థలు తమ వద్ద ఉన్న రాతప్రతుల వివరాలను అందించవచ్చు. సర్వేలో భాగంగా రాతప్రతుల సంఖ్య, భాష, లిపి, అవి ఉన్న ప్రదేశం, యాజమాన్య వివరాలు వంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే సేకరిస్తారు. ‘Gyan Bharatam’ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ వివరాలను నమోదు చేయవచ్చు. ఎవరి వద్ద అయినా ప్రాచీన రాతప్రతులు ఉన్నట్లయితే, వాటి సమాచారాన్ని సంబంధిత వేదికల ద్వారా అందించవచ్చు. ప్రతి తాళపత్ర గ్రంథం గతాన్ని, వర్తమానాన్ని కలిపే ఒక వారధి. అది చేతిరాతలోని ప్రతి గీతలో ఒక కాలం నాటి జ్ఞానాన్ని, అనుభవాన్ని, సంస్కృతిని సంరక్షిస్తుంది.
– ఆర్. మల్లికార్జున రావు
సంచాలకులు,
భాషా సాంస్కృతిక శాఖ








కామెంట్‌లు (0)