test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డబల్ ఇంజన్ సర్కారులో డబల్ బాదుడు

21 మే, 2026

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 21, 2026, 07:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

FacebookEmailWhatsAppXTelegram

  • రాష్ట్ర పెట్రో ఛార్జీల్లో సగం పన్నులే

  • మత్స్యకారుల విషయంలో సిఎం ప్రకటనలు మోసపూరితం

  • రవాణారంగ ఆందోళనలకు సిపిఎం మద్దతు

  • ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలి

  • విలేకరుల సమావేశంలో వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : డబల్ ఇంజన్ సర్కార్‌లో ప్రజలపై పెట్రోలు, డీజిల్ ఛార్జీల రూపంలో డబల్ భారాలు వేస్తున్నారని, ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విజయవాడ ఎంబివికెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవితో కలిసి ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా స్థిరంగా ఉన్న గ్యాస్, పెట్రోలు ఛార్జీలను ఎన్నికల ముగిసిన వెంటనే పెంచి కేంద్రం ప్రజలపై పెనుభారం వేసిందని విమర్శించారు. కమర్షియల్ గ్యాస్‌పై ఏకంగా రూ.990పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. పెరిగిన పెట్రో ధరలపై ఆటో కార్మికులు, ప్రయివేటు రవాణా ట్రాన్‌పోర్టు, లారీ యజమానులు ఆందోళనకు దిగుతున్నారని, కొన్నిచోట్ల ఇప్పటికే వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని, వారందరికీ సిపిఎం తరుపున మద్దతు చెబుతున్నట్లు ప్రకటించారు. తక్కువ ధరకు వస్తున్న ఇరాన్, రష్యా చమురు కొనుగోలు చేయకుండా అధిక ధరకు అమెరికా వద్ద కొనడం వల్లే ధరలు పెరుగుతున్నాయని, దీనికి కేంద్రం లొంగుబాటు విధానాలే కారణమని తెలిపారు. రష్యా బ్యారెల్ చమురు 56 డాలర్లకు ఇస్తుంటే అమెరికా 120 డాలర్లకు అమ్ముతోందని, అయినా బిజెపి ప్రభుత్వం వారివద్దే కొంటోందని పేర్కొన్నారు. దీంతోపెట్రోలు లీటరు రూ.113కు చేరిందని అన్నారు. ఇదే పాండిచ్చేరిలో రూ.100 ఉందని, తెలంగాణాలో రూ.111అని తెలిపారు. మనరాష్ట్రంలో వాస్తవంగా మొత్తం ధరలో అత్యధికంగా రూ.29లు పన్ను ఉందని, సగం అదనపు ట్యాక్సులేనని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ట్యాక్సు తగ్గించుకుని ప్రజలపై భారం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇలా ధరలు పెంచుకుంటూపోతే వామపక్షాలు దేశవ్యాపితంగా పెద్దఎత్తున పోరాటం నిర్వహిస్తాయని హెచ్చరించారు.
మత్స్యకారుల విషయంలో చంద్రబాబు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని, వారి జోలికి వస్తే ఊరుకోనని అంటున్నారని, వాస్తవంగా తమిళనాడు బోట్లను ఎపి సముద్రజలాల్లో వేటకు వస్తే టిడిపి నాయకులే సహకరించారని తెలిపారు. ఇటీవల జువ్వలదిన్నె ఘటనలో తమిళనాడు బోట్లను పట్టుకుంటే టిడిపి నాయకులే విడిపించారని, ఒకపక్క రక్షణ కల్పిస్తామని చెబుతూనే మరోవైపు దోపిడీకి సహకరిస్తున్నారని, ముందువారిని కట్టడి చేయాలని కోరారు. ఒకవైపు కోస్తాతీరంలో మత్స్యకారుల భూములు లాక్కొని వృత్తిని దెబ్బతీస్తూ, మరోవైపు వారికి అండగా ఉంటామని చెప్పడం మోసపూరితమన్నారు. కోస్తాతీరాన్ని టూరిజం, అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని తెలిపారు. పొగాకు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని తెలిపారు. పొగాకు బోర్డు వద్ద రైతుల నుండి వసూలు చేసిన రూ.1100 కోట్లు ఉన్నా వాటిని కేంద్రం ఖాజానాలో కలిపేసుకుందని, దాన్ని వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం సొసైటికి రూ.300 కోట్లు, కేంద్రం ఎస్‌సిటికి రూ.500 కోట్లు ఇచ్చి, రైతుల డబ్బులతో నే పొగాకు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. పొగాకు ధరను సగానికి సగం తగ్గించడం అంటే రైతులను శిక్షించడమేనని, ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదని అన్నారు. ప్లాట్‌ఫారమ్స్‌కు తెస్తున్న పొగాకులో సగం బేళ్లు తిరస్కరణకు గురవడం ఆందోళనకరమన్నారు. పొదుపు అంటూనే బంగారం దిగుమతి ఒకవైపు పొదుపు చేయాలని, బంగారం కొనొద్దని చెబుతున్న ప్రధాని మరోవైపు భారీగా దిగుమతికి అనుమతిస్తున్నారని వి. శ్రీనివాసరావు విమర్శించారు.
అదే సమయంలో పేదలు కొనలేని విధంగా ధరలు పెంచుతున్నా కేంద్రం చూస్తూ ఊరుకుందని, ఇప్పుడు తాళిబొట్టులో పెట్టే బంగారం కూడా కొనలేని స్థితికి ధరలుపెరిగాయని తెలిపారు. ఇదేనా హిందూ స్త్రీలను ఆదుకునే విధానం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం బంగారం ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కార్పొరేట్లకు చౌక లేబర్ సరఫరా చేసే పాలసీ .. కార్పొరేట్ కంపెనీలకు చౌకగా కార్మికులను తయారుచేసే విధంగా జనాభా పాలసీ ఉందని శ్రీనివాసరావు విమర్శించారు. పిల్లలే సంపద అంటూ భూమి, వేతనాలు, ఇళ్లు, ఉద్యోగం అడగొద్దని పరోక్షంగా చంద్రబాబు చెబుతున్నారన్నారు. చౌకగా కూలీలను తయారు చేసేందుకు వీలుగా పిల్లల్ని కనాలని చంద్రబాబు చెబుతున్నారని, పాలసీలో అంతర్గతంగా ఈ విషయాన్ని పొందుపరిచారని చెప్పారు. దీనివల్ల కుటుంబాల్లో మనస్పర్థలు రావడంతోపాటు, మహిళలపై భర్తల పెత్తనం పెంచే విధంగా ఇది ఉందని అన్నారు. ఇప్పటికే ఉపాధి, విద్య, వైద్య సదుపాయాలు లేక పిల్లలను చదివించుకోలేక కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే పిల్లలను కనాలని రాయితీలు ఇస్తామని చెప్పడం అన్యాయమని, వెంటనే పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పిల్లల్ని కనాలా, వద్దా అన్నది నిర్ణయించుకునేది మహిళల హక్కని. దానిలో జోక్యం చేసుకొవద్దన్నారు. ఎన్నికలముందు ఏజెన్సీలో డోలీ మోతలులేకుండా చేస్తానని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారని, రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ డోలీమోతలు తప్పడం లేదని అన్నారు. వెనకబడిన ప్రాంతాలు, ఏజెన్సీలో పిల్లల సంఖ్య ఎక్కుగా ఉందని, పిల్లల్లో పోషకాహార లోపం కూడా ఎక్కువగా ఉందని, పుట్టే పిల్లల మరణాల రేటుకూడా చాలా ఎక్కువని పేర్కొన్నారు. బాలింతలు, గర్భిణులతోపాటు, పిల్లల్లోనూ పోషకాహార లోపం, రక్తహీనత సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. మహిళల్ని పిల్లల్ని కనే యంత్రాలుగా మారుస్తున్న జనాభా పాలసీ : డి.రమాదేవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనాభా పాలసీ పూర్తి బాధ్యతా రాహిత్యమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి అన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా అమలు చేయలేదని ఇప్పుడు కొత్తగా ముడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు అని ప్రకటించడం మోసగించడమేనని తెలిపారు.
ఇప్పటికీ పిల్లలకు చదువుకునేందుకు సదుపాయాలు సరిగా లేవని, సరైన పోషకాహారం దొరకడం లేదని తెలిపారు. పుట్టేబిడ్డల్లో మరణాల రేటు ఎక్కువగా ఉందన్నారు. 1000 మందిపిల్లలు పుడితే 30మంది చనిపోతున్నారని, ఐదేళ్లలోపు పిల్లల్లో 63 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. 60 శాతం మంది మహిళలకు ఎనీమియా ఉందని తెలిపారు. ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని వివరించారు. జనాభాను పెంచాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్న సూచనలను చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్