test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాజ బ్లాక్ ను ‘వేదాంత`కు ఇవ్వొద్దు

22 మే, 2026

cpm vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 07:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రభుత్వమే నిర్వహించాలి

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : ఓఎన్‌జిసి డ్రిల్లింగ్ చేసి, చమురు, సహజవాయువు వెలికితీసే కాజబ్లాక్‌ను “వేదాంత” కార్పొరేట్ కంపెనీకి అప్పగించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటి కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం లేఖ రాశారు. కాజ‌బ్లాక్‌ను వేదాంత కార్పొరేట్ కంపెనీకి అప్ప‌గిస్తున్న‌ట్టు మీడియాలో చూసి ఆశ్చర్యపోయినట్టు ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. అంత విలువైన జాతీయ సంపదను ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించడం న్యాయం కాదని, అది రాష్ట్ర పురోగతికి తీవ్ర నష్టం చేస్తుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందువల్ల ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్వహించాలని కోరారు. కృష్ణా జిల్లాలోని మొవ్వ, గూడూరు, మచిలీపట్నం, పామర్రు పరిసర ప్రాంతాల్లో ఓఎన్‌జిసి డ్రిల్లింగ్ చేసి కనుగొన్న తరువాత 114.93 చద‌ర‌పు కిలోమీట‌ర్ పరిధిలోనున్న చమురు సహజవాయువు కాజబ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించకుండా ప్రయివేటు కంపెనీకి అప్పగించడం సహేతుకం కాదని తెలిపారు. దానికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడం అంటే విలువైన రాష్ట్ర సంపదను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడమేన‌ని పేర్కొన్నారు. ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగాయని, కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పి ప్రజలపై భారాలు వేస్తున్నారని తెలిపారు. మరోవైపు మన రాష్ట్రంలో చమురు సహజవాయువును వెలికితీసే కెజి బేసిన్ వంటివి ఇప్పటికే ప్రయివేటు, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రైవేటు కంపెనీలు అధిక లాభాలకు అమ్ముకొని రాష్ట్ర ప్రయోజనాలను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆ పేరుతో ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారని, మరో వైపు చమురు, గ్యాస్ నిక్షేపాలను రాష్ట్రానికి దక్కకుండా పోతున్నాయని తెలిపారు. ఇదే ప్రభుత్వం నిర్వహిస్తే ప్రజలకు చౌకగా ఇవ్వడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, దీనిని రాష్ట్రాభివృద్ధికి వినియోగించవచ్చున‌ని సూచించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వేదాంత కార్పొరేట్ కంపెనీ కాలుష్య నివారణ చర్యలు తీసుకోక తమిళనాడు తూత్తుకుడి, ఒరిస్సా బాక్సైట్‌లలో జరిగిన ప్రజా ప్రతిఘటనలు, కాల్పులు మన కళ్ల ముందున్నాయని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వేదాంత కంపెనీకి కాజబ్లాక్‌ను ఇవ్వకుండా చమురు, సహజ వాయువు వెలికితీసే బాధ్యత ప్రభుత్వమే తీసుకొని నిర్వహించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్