నీట్ పేపర్ లీక్, ఇతర పరీక్షల్లో అవకతవకలు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి – యంత్రాంగం : నీట్ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎన్ టిఎను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన బుధవారం పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
విజయనగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ సెంటర్లో విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. తొలుత విద్యార్థులంతా ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ నీట్, యుజి 2026 పేపర్ లీక్‌పై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీట్, యుజిసి, నెట్, సియుఇటి, సిబిఎస్ఇ పరీక్షల అవకతవకలపై కాలపరిమితితో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించాలన్నారు. పరీక్షల అవకతవకల వల్ల నష్టపోయిన విద్యార్థులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సిబిఎస్ ఇ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలోని లోపాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మార్కుల భద్రతకు హామీ కల్పించాలన్నారు. ఎన్ టిఎ వైఫల్యాలపై పార్లమెంట్‌లో శ్వేతపత్రం విడుదల చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తప్పించి ఆయనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎలమంచిలి పట్నంలో విద్యార్థులు నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద ప్లకార్డులు, పోస్టర్లతో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు.








కామెంట్‌లు (0)