test1
శుక్రవారం, 12 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇక తెగనమ్మడమే..

1 రోజు క్రితం

govt lands
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 12:27 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం


  • ఎనిమిది రంగాల గుర్తింపు

  • అధికారులకు సూచనలు ఇచ్చిన ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఆస్తులను తెగనమ్మే ప్రక్రియ ఊపందుకుంటోంది. మానిటైజేషన్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేయనున్నారు. నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల్లో ఉన్న కీలక ఆస్తులను గుర్తించడం, అభివృద్ధి చేస్తున్నామంటూ వాటిని ఆదాయ వనరులుగా మార్చడం, అంతిమంగా ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు వాటిని కట్టబెట్టడం ఈ ప్రక్రియలో కీలకాంశాలు. రెండురోజులపాటు 36 నగర పాలక సంస్థలతో ఇటీవల విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కార్యాచరణను రూపొందించారు. జిఓ నెంబర్‌ 673‌కు అనుగుణంగా ప్రభుత్వం రూపొందించిన నమూనా పత్రాన్ని అధికారులకు అందించారు. నాలుగు పద్ధతుల్లో తయారు చేసిన ఈ నమూనా పత్రాల్లో ప్రాజెక్టు కాన్సెప్ట్ ఏమిటనేది ముందుగా అధికారులు గుర్తించాల్సి ఉంది. దీనిలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌‌ను వినియోగించుకునేలా , దానికి అనుగుణంగా ప్రాజెక్టు తయారీకి సంబంధించి చెక్ లిస్టు ఇచ్చారు. వీటితోపాటు డిపిఆర్ తయారీకి మరొక చెక్ లిస్టు, మున్సిపల్ బాండ్లను పొందేందుకు వీలుగా మరొక లిస్టు ఇలా నాలుగు చెక్ లిస్టులు అధికారులకు అందించి పూర్తి చేయించారు. దీనికి ముందుగా పట్టణ ప్రాంతాల్లో మానిటైజ్ చేసేందుకు ఎనిమిది మున్సిపల్ ఆస్తులను గుర్తించారు. ఒకవైపు అమ్మబోమని చెబుతూనే మరోవైపు గుర్తింపును వేగవంతం చేశారు. మొదటిగా మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో విలువైన ఖాళీ భూములను గుర్తించారు. వీటిని డిబిఎఫ్ఓటి పద్ధతిలో నివాస గృహాల సముదాయాలు/ప్లాట్ల అభివృద్ధి కోసం 'జాయింట్ డెవలప్‌మెంట్ మోడల్' ద్వారా మానిటైజ్ చేయాలని నిర్ణయించారు. అలాగే పాత వాణిజ్య భవనాలను రెండో రంగంగా గుర్తించారు. పట్టణాల్లో అత్యంత కీలకమైన వ్యాపార కేంద్రాలలో శిథిలావస్థలో లేదా బలహీనంగా ఉండి, అద్దెదారులను కలిగి ఉన్న పాత వాణిజ్య భవనాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. వీటిల్లో ఎయిర్ స్పేస్ (గగన తలం) ను ఉపయోగించుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నారు. వీటిని ప్రైవేటు వ్యక్తులు అప్పగించనున్నారు. మూడో రంగంగా బస్టాండ్లను ఎంపిక చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలో ఉన్న బస్టాండ్లను అభివృద్ధి చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నారు. కింద యథాతథంగా బస్ బేగా ఉంచినా పై భాగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో వాణిజ్య అవసరాలకు కేటాయిస్తారు. నాలుగో విభాగంగా మున్సిపాలిటీలు/అథారిటీల పరిధిలో ప్రస్తుతం ఉపయోగించకుండా ఉన్న పాత కార్యాలయ భవనాలను గుర్తించారు. వీటి స్థానంలో మున్సిపల్ సేవల కోసం సమగ్ర భవన సముదాయాలు నిర్మించడానికి లేదా వాణిజ్య పునరాభివృద్ధి కోసం ప్రైవేట్ భాగస్వాములకు అప్పగించాలని నిర్ణయించారు. అలాగే ఐదో అంశంగా ఆడిటోరియాలను ఎంపిక చేశారు. వీటిని ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మల్టీపర్పస్ వినియోగం పేరిట ప్రైవేట్ సంస్థలకు వాణిజ్య హక్కులు కల్పించనున్నారు. ఆరో విభాగంగా మార్కెట్లను ఎంపిక చేశారు. ఇవి అన్ని మున్సిపాలిటీల్లో కీలకస్థానంలోనూ విలువైన ప్రాంతంలోనూ ఉన్నట్లు గుర్తించారు. ,మార్కెట్ పైభాగాన్ని  వాణిజ్య అభివృద్ధి కోసం రిహాబిలేట్, ఆపరేట్, మెయింటెన్ అండ్ ట్రాన్స్ఫర్(ఆర్ఓఎంటి) పద్ధతిలోకి మారుస్తారు. వీటిని కూడా ప్రైవేటు నిర్వహణకు ఇవ్వనున్నారు. ఏడో భాగంలో నివాస గృహ సముదాయాలను గుర్తించారు. ఇప్పటికే నిర్మించి ఎవరికీ ఇవ్వకుండా ఖాళీగా ఉన్న ఇళ్లను పిపిపి పద్ధతిలో పేదలకు సరసమైన ధరలకే అద్దెకు ఇచ్చే గృహ సముదాయాలుగా మారుస్తారు. ఇవి కాకుండా నగరాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండి, పార్కింగ్ సమస్య ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వాటిల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నారు. వీటిని కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పగిస్తారు.

అమ్మకానికి ప్రాధాన్యతలు

1. విలువైన ఖాళీ స్థలాలు

2. పాత వాణిజ్య భవనాలు

3. బస్‌ ‌స్టాండ్లు

4. నిరుపయోగంగా ఉన్న  పాత కార్యాలయాల భవనాలు

5. ఆడిటోరియాలు

6. మార్కెట్లు

7. ఖాళీగా ఉన్న నివాస గృహ సముదాయాలు

8. పార్కింగ్‌ ‌సమస్య ఉన్న ప్రాంతాలు

జిఓలో ఇచ్చిందొకటి.. చెబుతోంది మరొకటి
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సమావేశంలో మున్సిపల్ఆస్తులను అమ్మడం లేదని మంత్రి నారాయణతో సహా పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కూడా పదే పదే చెప్పారు. అదే సమయంలో ఇప్పుడున్న పద్ధతుల్లో తగిన ఆదాయం రావడం లేదని, నిధులు కావాలంటే హడ్కో నుండి అప్పు తెచ్చుకోవాలని, దీనికోసం కొత్త ప్రాజెక్టులు తయారు చేయాలని సూచించారు. వాటి డిపిఆర్లు సమర్పించడం ద్వారా ఆదాయానికి గ్యారంటీ చూపించాలని పేర్కొన్నారు. అలా చూపిస్తేనే హడ్కో లాంటి సంస్థలు నిధులు ఇస్తాయని ప్రస్తావించారు. ఇలా కొత్తగా తయారు చేసే అన్ని డిపిఆర్ లలో మొత్తం నిర్వహణ అంతా ప్రైవేటు వ్యకుఉ్తలకే ఇవ్వాలని, అది కూడ 33 ఏళ్ల లీజు నుండి అవసరమైతే మరో 66 ఏళ్ల లీజుకు పొడిగించాలని ప్రతిపాదించారు. అంటే కనీసం 99 సంవత్సరాలు. అప్పటి వరకూ ఆస్తి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. నిర్వహణ, అద్దె వసూళ్లు మొత్తం వారే నిర్వహించడంతోపాటు వారి లీజులో ఉన్నంతకాలం వాటిని ఎవరికి ఇవ్వాలి, ఎంత లీజు వసూలు చేయాలనేది కూడా ప్రైవేటు వ్యక్తికే అధికారం కల్పించారు. రెండురోజలుపాటు నిర్వహించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సమావేశంలో ఈ అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలను ఆయా మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్