నిల్వ ఉంచి కుళ్ళిన మాంసాహారం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్
మటన్ మార్కెట్లో బయట పడ్డ నిల్వ ఉంచి దుర్వాసనతో కూడిన మాంసం
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : కుళ్ళిన, నిల్వ ఉంచిన మాంసాహారం, ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ వ్యాపారులను హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మేకలు, పొట్టేలకు సంబంధించిన కాళ్లు, తలకాయలు వంటివి నిల్వ ఉంచి విక్రయిస్తున్నారని అందిన ప్రజల ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం 28వ వార్డులోని పెద్ద పీర్ల చావడి లోని మటన్ మార్కెట్ ను పారిశుధ్థ్య సిబ్బంది తో కలసి హెల్త్ ఆఫీసర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ …. ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన మాంసం ఇక్కడ ఫ్రీజర్లలో నిల్వ ఉంచి పలు హోటళ్లకు, ప్రజలకు విక్రాయిస్తున్నారని ఫిర్యాదులు అందాయని తెలిపారు. కమిషనర్ శారదా దేవి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం తమ సిబ్బందితో కలసి తనిఖీ లు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో అర టన్ను మేర నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల తలకాయలు, కాళ్ళు వంటి ఇతర భాగాల మాంసాన్ని గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ముఖ్యంగా కుళ్ళిపోయిన దశలో దుర్వాసన వస్తున్న మాంసం గుర్తించామన్నారు. ఫ్రీజర్ లో ఉంచి దుర్వాసన వస్తున్న మాంసాన్ని ఇనుప చువ్వలతో లాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పరిసరాలు కూడా అపరిశుభ్రతతో దారుణంగా ఉన్నాయని తెలిపారు. నగరపాలక సంస్థ చట్టం 1955 సెక్షన్ 483, 484, 487, 492, 521, 541, 542, 543, 544, 545, 546, 622లో అనుసరించి ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. కుళ్ళిన దశలో దుర్వాసన వెదజల్లుతున్న మాంసాన్ని సీజ్ చేశామన్నారు. సీజ్ చేసిన మాంసాన్ని క్రిమిసంహారక మందులతో పిచికారీ చేసి కంపోస్ట్ యార్డు కు తరలించామని వివరించారు. ఎవరైనా వ్యాపారులు నిల్వ ఉంచిన కుళ్ళిన మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీ ల్లో శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, మేస్త్రిలు, స్వర్ణ వార్డు కార్యదర్సులు, పారిశుధ్థ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.








కామెంట్‌లు (0)