ప్రజాశక్తి – బైరెడ్డిపల్లి: బైరెడ్డిపల్లి–కుప్పం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించబోయి ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందుభాగం నలిగిపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న అలీఫ్, తోషిక్ అలీ అనే ఇద్దరు యువకులు లోపలే ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బిందు, పైలట్ ఎం.డి. గౌస్ తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు డోర్లను రాడ్ల సాయంతో విరిచి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకులను సాహసోపేతంగా బయటకు తీశారు. అనంతరం వారిని బైరెడ్డిపల్లి పీహెచ్‌సీకి తరలించగా, డాక్టర్ విజయచంద్ర ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిజాయితీ చాటిన సిబ్బంది: ప్రాణాలు కాపాడటమే కాకుండా.. ప్రమాద స్థలంలో ఉన్న బాధితుల ల్యాప్‌టాప్, 3 మొబైల్ ఫోన్లు, పర్సులు, నగదును భద్రపరిచి సురక్షితంగా వారికి అప్పగించారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడటంతో పాటు నిజాయితీ చాటుకున్న 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.








కామెంట్‌లు (0)