మధుర : యమునా నది కాలుష్యంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ సామాజిక కార్యకర్త బొద్దింక వేషంలో మధుర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని వినూత్నంగా ఆందోళన చేపట్టాడు. పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ చేసిన ఈ నిరసన అక్కడున్న ప్రజల దృష్టిని ఆకర్షించింది. బొద్దింక వేషంలో కనిపించిన సామాజిక కార్యకర్త దీపక్ శర్మ మాట్లాడుతూ, యమునా నది పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. యమునా నది కాలుష్యం, నగరంలో పెరుగుతున్న మురికిపై అధికారులు స్పందించకపోవడంతో వారి “కళ్లు తెరిపించేందుకు” తాను ఈ రూపంలో నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యంగ్య ప్రచారం నేపథ్యంలో ఈ నిరసన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన “బొద్దింకలు, పరాన్నజీవులు” వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు నెలకొన్న విషయం తెలిసిందే.
మధుర మున్సిపల్ కార్యాలయం వద్ద శర్మను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడగా, చాలామంది మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. “బ్రజ్ ప్రాంత ప్రజలు యమునా జలాన్ని పవిత్రంగా భావించి ఆచమనంగా స్వీకరిస్తారు. అయినప్పటికీ, మధుర, బృందావన్ ప్రాంతాల్లో మురుగునీరు నేరుగా నదిలో కలుస్తూనే ఉంది. సంవత్సరాలుగా హామీలు ఇస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు” అని శర్మ విమర్శించారు. జల కాలుష్య నివారణ చట్టాన్ని ప్రస్తావిస్తూ, నదుల్లో మురుగునీటిని విడుదల చేయడం శిక్షార్హ నేరమని ఆయన గుర్తుచేశారు. సుప్రీం కోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా శర్మ కొంతసేపు ఉన్నతాధికారుల వాహనాల ముందూ నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు.








కామెంట్లు (0)