test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు ‘ఇండియా జ‌న్‌బంధ‌న్’ భేటీ

9 గంటల క్రితం

inida
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 12:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • డిఎంకె, ఆప్ విముఖ‌త‌

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించి, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు, ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేసేందుకు దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌తిప‌క్షాలు సోమవారం భేటీ కానున్నాయి. కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో జ‌రిగే ‘ఇండియా జ‌న్‌బంధ‌న్’ స‌మావేశంలో 23 రాజ‌కీయ పార్టీలు పాల్గొన‌నున్నాయి. ఈ స‌మావేశంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ప్ర‌తిప‌క్ష‌నేత‌ రాహుల్ గాంధీ, టిఎంసి అధినేత్రి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, శివసేన (ఠాక్రే) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2029 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఇండియా బ్లాక్ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నుంది. జాతీయ స‌మ‌స్య‌ల‌పై మోడీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డానికి ఒక ఉమ్మ‌డి వ్యూహాన్ని రూపొందించ‌నుంది. ప్ర‌తిప‌క్ష కూట‌మి త‌న వైవిధ్యంతోనే ఐక్యంగా నిలుస్తుంద‌ని కాంగ్రెస్ పేర్కొంది. ఈ స‌మావేశంలో డిఎంకె, ఆప్ పార్టీలు మాత్రం పాల్గొనేందుకు విముఖ‌త వ్య‌క్తం చేశాయి. కొన్ని పార్టీలు త‌మ సొంత కార‌ణాల వ‌ల్ల ఈ ప్ర‌త్యేక స‌మావేశానికి హాజ‌రు కాలేమ‌ని తెలిపిన‌ట్లు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జైరాం ర‌మేష్ తెలిపారు. ‘దేశంలో ల‌క్ష‌లాది మంది భార‌తీయుల ఓటు హ‌క్కును హ‌రించివేస్తున్నారు. ప్ర‌తిరోజూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై దాడులు చేయిస్తున్నారు. కోట్లాది మంది ప్ర‌జ‌ల జీవ‌నోపాధిని తీవ్రంగా దెబ్బ‌తీస్తున్నారు. ఎడ‌తెరిపి లేకుండా పెరుగుతున్న ధ‌ర‌ల‌తో కుటుంబ బ‌డ్జెట్‌ల‌ను విచ్ఛిన్నం చేస్తున్నారు. ల‌క్ష‌లాది మంది యువ‌త ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు ద్రోహం చేస్తున్నారు. పెట్టుబ‌డుల వాతావ‌ర‌ణాన్ని నీరుగారుస్తున్నారు. విదేశాంగ విధానంతో జాతీయ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీస్తున్నారు. మోడీ ప్ర‌భుత్వ విధానాలు, చ‌ర్య‌ల‌కు త‌మ తీవ్ర వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేస్తున్నాం’ అని అన్నారు. భార‌త‌దేశం వ‌లే ‘ఇండియా జ‌న్‌బంధ‌న్‌’ కూడా త‌న వైవిధ్యంతో ఐక్యంగా నిలుస్తూనే ఉంద‌ని జైరాం ర‌మేష్ నొక్కి చెప్పారు.
ఇండియా బ్లాక్‌‌లోని పార్టీల పట్ల కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలు, శత్రుపూరిత వైఖరి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న త‌రుణంలో ఈ స‌మావేశం జ‌రగనుంది. త‌మిళ‌నాడులో కాంగ్రెస్ ‘ద్రోహం’ చేసింద‌ని ఆరోపిస్తూ డిఎంకె ఈ స‌మావేశానికి గైర్జాజ‌రు కానున్న‌ట్లు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా బ్లాక్‌కు దూరంగా ఉంది. కేర‌ళ‌ంలో బిజెపితో కుమ్మ‌క్క‌యింద‌ని కాంగ్రెస్ అగ్ర నేత‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌పై సిపిఎం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు సిపిఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు లేఖ కూడా రాశారు. ఆ ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అటువంటి ఆరోపణలు ప్రతిపక్ష కూటమికి ఆధారమైన సహకార స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఆ లేఖ‌ను మిగిలిన ఇండియా బ్లాక్ పార్టీల నేత‌ల‌కు కూడా పంపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్