న్యూఢిల్లీ : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గగనతలం నుండి భూతల క్షిపణి రుద్రఎం-II ప్రయోగం విజయవంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఒ), భారత వైమానిక దళం (ఐఎఎఫ్)సంయుకంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి. భారత్ తన కచ్చితమైన దాడుల సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, రక్షణ సాంకేతికతలో స్వావలంబనను పెంపొందించుకోవడానికి చేపడుతున్న చర్చల్లో ఈ ప్రయోగం మైలురాయిగా నిలిచింది. అన్ని కీలక ఉపవ్యవస్థలు, ప్రయోగ పరిమితుల పనితీరును ధృవీకరించేందుకు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగం నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా చేధించిందని పేర్కొంది.పరీక్షల సమయంలో ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వాన్ని ప్రదర్శించి, అన్ని మిషన్ లక్ష్యాలను విజయవంతంగా నెరవేర్చింది. ఈ ప్రయోగం విజయవంతమైందని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్ ) ధృవీకరించింది. రుద్రఎం-II క్షిపణిని హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సి ఐ), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డిఆర్ డిఎల్), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (హెచ్ ఇ ఎం ఆర్ ఎల్), ఆర్మమెంట్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎ ఆర్ డిఇ), ఐటిఆర్ సంస్థల సహకారంతో స్వదేశీయంగా అభివృద్ధి చేశాయి.
రుద్ర ఎం-II ప్రయోగం విజయవంతం
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 02:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)