న్యూఢిల్లీ : ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ -ఏయు ఫైనాన్స్ బ్యాంక్ మోసం కేసులో చండీగఢ్, పంచకుల, ఢిల్లీ ఎన్ సి ఆర్ పరిధిలోని ఆరు ప్రదేశాల్లో సిబిఐ సోదాలు నిర్వహించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. హర్యానాకు చెందిన సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు, నొయిడాకు చెందిన విపమ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్ తో సంబంధం ఉన్న ప్రాంగణాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. విచారణలో ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై, ఖాతాలు తెరవడానికి, నిధులు బదిలీ చేయడానికి, వాటిని దారి మళ్లించడానికి సహకరించినట్లు ఆధారాలు లభించాయని ఆ అధికారులు వెల్లడించారు. సోదాల్లో నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆస్తి పత్రాలు, ఇతర సంబంధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ లావాదేవీలు సులభతరం చేసినందుకు, అవతవకలపై చర్యలు తీసుకోకుండా ఉన్నందుకు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా ప్రయోజనం పొందారని ఏజన్సీ ఆరోపించింది. విపమ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ నేరానికి సంబంధించిన నగదును తన బ్యాంక్ ఖాతాలో జమ చేసుకుందని, ఆ తర్వాత దానిని తన డైరెక్టర్ వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేసిందని కూడా సిబిఐ తెలిపింది. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలిన ఇతర నిందితులపై అదనపు ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని తెలిపింది.
హర్యానా, చండీగఢ్ పరిపాలనా విభాగం నుండి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు సిబిఐ తెలిపింది. ఈ మోసం హర్యానా ప్రభుత్వంలో ఎనిమిది విభాగాలను, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలోని రెండు విభాగాలను (చండీగఢ్ మునిసిపల్ కార్పోరేషన్, చండీగఢ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ సొసైటీ (సి ఆర్ ఇ ఎస్ టి))లను ప్రభావితం చేసిందని పేర్కొంది.
ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ మోసం కేసులో సిబిఐ సోదాలు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 07, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)