న్యూఢిల్లీ : ఎల్ పి జి ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. యుపిఎ హయాంలో ద్రవ్యోల్బణంపై గగ్గోలు పెట్టిన బిజెపి నేతలు, ఇప్పుడు సిలిండర్లతో నిరసనగా వీధుల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. ఢిల్లీలో 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.913 నుండి రూ.942కు పెంచిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 7న సిలిండర్‌పై ₹60 పెంచిన తర్వాత తాజాగా మరోసారి పెంచిందని, దీంతో గత నాలుగు నెలల్లోనే సిలిండర్ పై మొత్తం ₹89కి పెంచిందని అన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులు ఏటా మొదటి నాలుగు రీఫిల్స్ పై రూ.300 సబ్సిడీని పొందిన తర్వాత, ప్రతి సిలిండర్‌కు వాస్తవంగా రూ.642 చెల్లిస్తూనే ఉంటారని అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ఖర్గే మూడు ప్రశ్నలు అడిగారు. పశ్చిమాసియా సంఘర్షణకు ప్రతిస్పందనగా 41 దేశాలలో ఇంధన వనరులను వైవిధ్యపరచడం గురించి ప్రధాని మోడీ చేసిన గొప్ప వాగ్దానాల సంగతేమిటని, గ్రామీణ ప్రాంతాల్లో ఈనాటికీ ఎల్ పి జి కొరత ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు. అలాగే ఉజ్వల పథకం కింద, 2025-26 సంవత్సరంలో 5.56 కోట్ల కుటుంబాలకు ఒక్క రీఫిల్ కూడా అందలేదని (లేదా ఒక్కటి మాత్రమే అందిందని), వీరిలో 3.30 కోట్ల కుటుంబాలు ఒక్క సిలిండర్ రీఫిల్‌ను కూడా ఎంచుకోలేదని ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభానికి ముందే ఉన్న ఈ పరిస్థితి మోడీ ప్రభుత్వ లాభార్జన ఫలితం కాదా అని ప్రశ్నించారు. గత 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం దేశీయ ఎల్‌పిజి ధరలను రూ.530 పెంచిందని, పెరుగుతున్న ధరలు సామాన్యులను నాశనం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు. యుపిఎ హయాంలో మోడీ, బిజెపి నేతలు ద్రవ్యోల్బణంపై పెద్ద రచ్చ చేసేవారు. గత 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం దేశీయ ఎల్ పి జి ధరలను రూ.530 పెంచిందన్నది నిజం కాదా? మరి ఇప్పుడు బిజెపి నేతలు,ఎల్ పి జి సిలిండర్లతో నిరసనగా వీధుల్లోకి ఎందుకు రావడం లేదని నిలదీశారు.
ఎల్ పి జి ధరల పెంపుపై మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఖర్గే
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 07, 2026, 04:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)