ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2031 వరకు సార్థక్ పిడిఎస్ రేషన్ సరఫరా పథకం కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని అంబ్రెలా స్కీమ్‌గా కొనసాగించనున్నారు. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి రూ.25,530 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ సరఫరా అవుతుందని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతరాష్ట్ర రవాణా, నిర్వహణ ఖర్చులు, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఈఎ) నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర సహాయ నిధుల విధానాన్ని కొనసాగించనున్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు పథకాలను ఏకీకృతం చేశారు. వాటిలో ఒకటి జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర సంస్థలకు ఆహార ధాన్యాల రవాణా, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్ సహాయం కాగా, రెండోది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో సాంకేతిక ఆధునికీకరణ, సంస్కరణల పథకం ఉన్నాయి. సార్థక్ పిడిఎస్ పథకం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బ్లాక్ చైన్ వంటి ఆధునిక సాంకేతికలతో పిడిఎస్ కార్యకలాపాలను ఆధునీకరించనున్నారు.
2031 వరకు రేషన్ పథకం
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 08:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)