పిటిషన్ కొట్టేస్తూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించే ప్రక్రియలో భాగంగా కులాన్ని నిర్ధారించడంలో ఏ ప్రభుత్వ తప్పిదమైనా ఏమీ వుండదని సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ‘‘ఎంతమంది వెనుకబడి వున్నారు, ఎంతమందికి సంక్షేమ చర్యలు అవసరం అనేది ప్రభుత్వం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి వుంటుంది. ఇది విధానపరమైన అంశం.’’ అని త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పేర్కొన్నారు. కుల గణనను 2027 జనగణన ప్రక్రియలో భాగం చేయరాదంటూ పిటిషనర్ సుధాకర్ గుమ్ముల దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘రాజకీయ నేతలు, కార్పొరేట్ సంస్థలు కుల డేటాను దుర్వినియోగం చేయడానికి అపారమైన అవకాశాలు వున్నాయి. అటువంట ప్పుడు పెద్ద మొత్తంలో కులాల డేటాను సమీకరిం చడంలో అర్ధం లేదు.’’ అని గుమ్ముల వాదించారు. 2027 జనగణనలో కుల గణన తప్పనిసరిగా వుండాలా లేదా అనే అంశంపై నిర్ణయం కోర్టు పరిధిలో లేదని చీఫ్ జస్టిస్ చెప్పారు. ఈ అంశం తప్పనిసరిగా విధానపరమైన పరిధిలోకి వస్తుందని అంటూ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. 2027 జనగణనలో కుల గణనను చేర్చాలని గతేడాది ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ నిర్ణయించింది. 2027 జనాభా లెక్కల రెండవ దశలో కుల గణనను పొందుపరచనున్నట్లు పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలియజేసింది. తొలి దశలో ప్రతి ఒక్క కుటుంబం ఇళ్ల పరిస్థితులు, ఆస్తులు, సదుపాయాలు వంటి వాటికి సంబంధించి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్‌ఎల్‌ఒ ) సేకరణ వుంటుంది. రెండో దశలో, ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలు సేకరిస్తారు. 2011 జనాభా లెక్కల వరకు, ఈ ప్రక్రియలో కేవలం ఎస్‌సి, ఎస్‌టిలను మాత్రమే లెక్కించేవారు.








కామెంట్‌లు (0)