- కొత్త ముసాయిదా శాంతి ప్రతిపాదనలు
- అమెరికాతో మళ్ళీ యుద్ధానికి అవకాశాలు లేవు : ఇరాన్
- కేబినెట్‌తో భేటీ కానున్న ట్రంప్
టెహ్రాన్, వాషింగ్టన్ : అమెరికాతో యుద్ధం పునరుద్ధరించే అవకాశాలు లేవని చెప్పవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. ‘శత్రువు బలహీనతే’ ఇందుకు ప్రధాన కారణమని వ్యాఖ్యానించింది. అయితే ఒకవేళ దాడులు జరిగిన పక్షంలో వాటిని తిప్పికొట్టడానికి ఇరాన్ సిద్ధంగా వుందని ఐఆర్‌జిసి నేవీ డిప్యూటీ రాజకీయ చీఫ్ మహ్మద్ అక్బర్‌జాదెహ్ స్పష్టం చేశారు. ఇరాన్ దక్షిణ ప్రాంతం ‘ఆక్రమణదారులకు శ్మశాన వాటికగా’ మారుతుందని హెచ్చరించింది. కాగా పశ్చిమాసియాలో యుద్ధం ముగించడానికి కొనసాగుతున్న చర్చల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందానికి సంబంధించి పలు అంశాలపై అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. పలు దశల్లో సాగే శాంతి ప్రక్రియకు సంబంధించి బయటకు వచ్చిన కొత్త ముసాయిదా శాంతి ప్రతిపాదనల ప్రకారం 30రోజుల్లోగా హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు యుద్ధం ముందునాటి స్థాయికి పునరుద్ధరించాల్సి వుంది. ఈలోగా అమెరికా కూడా ఇరాన్ సమీప స్థావరాల నుండి మిలటరీ బలగాలను ఉపసంహరిస్తుంది. అలాగే నావికాదళంపై గల అంక్షలను కూడా ఎత్తివేయాల్సి వుంది. 60రోజుల్లోగా తుది ఒప్పందం కుదిరినట్లైతే, ఈ ఒప్పందమే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి వుండే రూపంలో ఆమోదించబడుతుంది. అని ఇరాన్ మిజాన్ వార్తా సంస్థ వెల్లడించింది. గత 24గంటల్లో 23 నౌకలు హర్మూజ్‌ను దాటాయని ఐఆర్‌జిసి తెలిపింది. దక్షిణ ఇరాన్‌పై అమెరికా తాజాగా దాడులు జరిపిన నేపథ్యంలో అమెరికా మీద మొత్తంగా నమ్మకం పోతోందని, కాల్పుల విరమణను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఇరాన్ అధికారులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. నెలల పాటు నిషేధం అమలైన తర్వాత పూర్తి స్థాయిలో ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించేందుకు తొలి చర్య తీసుకున్నట్లు ఇరాన్ ఉపాధ్యక్షుడు రెజా అరెఫ్ ధృవీకరించారు. అమెరికాతో ఆర్థిక యుద్ధం ప్రధాన కదనరంగంగా మారిందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ వ్యాఖ్యానించారు. ఇరానియన్ల జీవనో పాధులను దెబ్బతీయడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాగా మరోవైపు ఒప్పందం కుదిరే వేళ కేబినెట్ సభ్యులతో ట్రంప్ భేటీ అయ్యారు. ఇరాన్‌లో ఇక సైనిక చర్యలకు ముగింపు పలకాలని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారని ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. పాక్ పాత్ర సమస్యాత్మకం ఇరాన్, అమెరికా మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్ర సమస్యాత్మకంగా మారిందని అమెరికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ వ్యాఖ్యానించారు. తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా దేశం ఏర్పడేవరకు తాము ఇజ్రాయిల్‌ను ఆమోదించేది లేదన్న పాక్ చిరకాల వైఖరి గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజాగా మాట్లాడారు. ఇజ్రాయిల్ పట్ల వారి శతృత్వం దీర్ఘకాలం నాటిది, అందువల్ల పాక్ పాత్ర సమస్యాత్మకంగా వుంటుందని నాకనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో సెనెటర్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇదిలావుండగా, దక్షిణ లెబనాన్‌లో, తూర్పు బెకా లోయలో ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 31కిచేరింది. మరో 40మంది గాయపడ్డారు. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని పలు గ్రామాలు, పట్టణాల నుండి ప్రజలను తరలిపోవాల్సిందిగా మిలటరీ ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. గాజాలో హమాస్‌కు కొత్తగా నియమితులైన మిలటరీ చీఫ్ మహ్మద్ ఓడెహ్‌ను మంగళవారం నాటి దాడిలో హతమార్చినట్లు ఇజ్రాయిల్ మిలటరీ బుధవారం ప్రకటించింది.








కామెంట్‌లు (0)