test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభారత్‌కు అమెరికా షాక్‌

5 రోజుల క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 11:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 12.5 శాతం సుంకాల పెంపునకు ప్రతిపాదన

  • చర్చిస్తున్నామన్న భారత్‌

వాషింగ్టన్‌ : అమెరికా, భారత్‌‌ల మధ్య వాణిజ్య చర్చలు జరుపుతున్న వేళ అగ్రరాజ్యం భారత్‌‌కు మరోసారి షాక్‌ ఇచ్చింది. కార్మికుల వెట్టిచాకిరితో తయారుచేసిన ఉత్పత్తుల దిగుమతులపై నిషేధాలను విధించడంలో, వాటిని సమర్ధవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యామనే పేరుతో భారత్‌‌తో సహా 54 దేశాల నుండి వచ్చే దిగుమతులపై 12.5శాతం సుంకాలు విధించాలని అమెరికా ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. ‌ కాగా ఈ పరిణామంపై అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. అలాగే వాణిజ్యంపై తాత్కాలిక ఒప్పందం ఖరారు గురించి కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. వెట్టి చాకిరి చేయించుకుంటూ తయారుచేసే ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేసేందుకు తగిన చర్యలు తమ వాణిజ్య భాగస్వాములు తీసుకుంటున్నారా లేదా తెలుసుకునేందుకు అమెరికా వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్‌ 301 ‌కింద ఈ ఏడాది మార్చిలో అమెరికా వాణిజ్య ప్రతినిధి (‌యుఎస్‌‌టిఆర్‌) కార్యాలయం విచారణ ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా, తాజా టారిఫ్‌‌ ప్రకటనలు ఇంకా ఖరారు కాలేదు. భారత్‌ ‌సహా ఇతర దేశాలు జూన్‌ 22నాటికల్లా బహిరంగ విచారణలో పాల్గొనేందుకు అభ్యర్ధనలు అందచేయాల్సి వుంది. జులై 6కల్లా రాతపూర్వక వ్యాఖ్యలు అందచేయాలి. జులై 7న బహిరంగ విచారణలో పాల్గొనాలి. పరస్పర సుంకాలు విధించడాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన తర్వాత తన దిగుమతులపై టారిఫ్‌‌లు విధించుకునేందుకు అమెరికా ఒక ఆయుధంగా దీన్ని వాడుకుంటోందని వాణిజ్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. యుఎస్‌‌టిఆర్‌ ‌విడుదల చేసిన నివేదిక ప్రకారం అటువంటి దిగుమతులను సమర్ధవంతంగా అరికట్టడంలో విఫలమైన 54 దేశాల్లో భారత్‌‌ కూడా వుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చర్యలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా హేతుబద్ధంగా లేవని, పైగా అమెరికా వాణిజ్యాన్ని నియంత్రించేలా లేదా భారం మోపేలా వున్నాయని విచారణలో తేలిందని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌, చైనా, మలేసియా, థాయిలాండ్‌, వియత్నాం వంటి దేశాలు వున్నాయి.
అమెరికాతో చర్చిస్తున్నాం సెక్షన్‌ 301 ‌కింద ఈ అంశంపై అమెరికాతో చర్చిస్తున్నామని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేసిన సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఫ్రేమ్‌‌వర్క్‌ ఒప్పందం ఖరారుపై కూడా భారత్‌ ‌చర్చలు జరుపుతోందని ఆ ప్రకటనలో తెలిపింది. డిప్యూటీ యుఎస్‌‌టిఆర్‌ ‌బ్రెండన్‌ ‌లించ్‌ ‌నేతృత్వంలో అమెరికా నుండి ప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం భారత్‌‌లో వుంది. విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, అలాగే తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఖరారు చేసేందుకు ఈ పర్యటన ఉద్దేశమని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

యుద్ధం ముగిస్తే గ్యాస్‌ ధరలు తగ్గుతాయి : ట్రంప్‌

వాషింగ్టన్‌ : ఇరాన్‌ యుద్ధం ముగిస్తే అమెరికాలో గ్యాస్‌ ధరలు తగ్గుతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. బుధవారం ప్రసారమైన ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ద్రవ్యోల్బణం అంత ఎక్కువగా లేదని అన్నారు. కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్‌ జరిపిన డ్రోన్‌, క్షిపణి దాడిలో ఒక వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారంటూ వార్తలు వచ్చిన తర్వాత ట్రంప్‌ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ‘మనకు పెద్దగా ద్రవ్యోల్బణం లేదు. చూడండి…మీరు కేవలం పెట్రోల్‌ ధరను…అంటే ఇంధన ధరను పక్కన పెట్టి చూస్తే మనకు ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్