లాస్ ఏంజెల్స్ : కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా ప్రముఖ జన్యు పరీక్షల సంస్థ ’23అండ్ మీ’ పై గురువారం దావా వేశారు. 2023లో దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది వినియోగదారుల సున్నితమైన జన్యు, ఆరోగ్య డేటా ఉల్లంఘనకు గురవడానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని, వినియోగదారుల సమాచారాన్ని రక్షించడంలో సంస్థ పూర్తిగా విఫలమైందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు గానూ కంపెనీపై భారీ సివిల్ జరిమానాలు విధించాలని, అలాగే భవిష్యత్తులో కాలిఫోర్నియా గోప్యతా పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించకుండా ఆదేశాలు జారీ చేయాలని అటార్నీ జనరల్ కోర్టును కోరారు.
తమ వినియోగదారులకు వారి పూర్వీకుల వివరాలు, జన్యుపరమైన ఆరోగ్య సమస్యల సమాచారాన్ని అందించే ఈ సంస్థ, గత మార్చిలో దివాలా తీసిన తర్వాత తన పేరును క్రోమ్ హోల్డింగ్ కో.గా మార్చుకుంది. 2023లో జరిగిన ఈ సైబర్ దాడిలో హ్యాకర్లు “క్రెడెన్షియల్ స్టఫింగ్” విధానాన్ని ఉపయోగించారు. వినియోగదారులు బలహీనమైన పాస్‌వర్డ్‌లను వాడటం లేదా బహుళ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడాన్ని ఆసరాగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా, అక్టోబర్ 2017లో 23అండ్ మీ మాజీ భాగస్వామి ‘మైహెరిటేజ్’ సంస్థలో జరిగిన భారీ డేటా ఉల్లంఘనకు సంబంధించిన దొంగిలించబడిన క్రెడెన్షియల్స్‌ను హ్యాకర్లు ఇక్కడ ఉపయోగించినట్లు తేలింది. ఆ ఉల్లంఘన జరిగినప్పటికీ, 23అండ్ మీ తన కస్టమర్ల పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయమని అడగకపోవడం లేదా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేయకపోవడం వంటి ప్రాథమిక భద్రతా నియమాలను విస్మరించిందని బోంటా కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది.
డేటా లీక్ అయిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా 23అండ్ మీ యాజమాన్యం ఉల్లంఘన తీవ్రతను దాచిపెడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని దావాలో పేర్కొన్నారు. అక్టోబర్ 2023లోనే తమకు ఈ విషయం తెలిసిందని కంపెనీ చెబుతున్నప్పటికీ, అంతకు కొన్ని నెలల ముందే వచ్చిన హెచ్చరిక సంకేతాలను సంస్థ పట్టించుకోలేదని ప్రాసిక్యూటర్లు వాదించారు. జూలైలో లాగిన్ ప్రయత్నాలలో అనుమానాస్పద పెరుగుదల కనిపించినా, ఆగస్టులో డేటా లీకేజీ గురించి రెడ్డిట్ పోస్ట్‌లో చర్చలు నడిచినా కంపెనీ స్పందించలేదని మండిపడ్డారు. జన్యు డేటాకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాలిఫోర్నియా చట్టాల ప్రకారం కంపెనీలపై ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ చాప్టర్ 11 దివాలా ప్రక్రియలో ఉన్నందున, వినియోగదారుల జన్యు సమాచారాన్ని మూడవ పక్షాలకు అమ్మే ముందు కాలిఫోర్నియా జన్యు సమాచార గోప్యతా చట్టం ప్రకారం వారి సమ్మతి తప్పనిసరిగా తీసుకోవాలని అటార్నీ జనరల్ బోంటా పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)