ప్రజాశక్తి కారంచేడు: మద్దతు ధర పెంపులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో రైతులు గురువారం నాడు నిరసన చేపట్టారు. దేశ వ్యాప్త పిలుపులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కి వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎరువుల ధరలు బస్తాకు వందల రూపాయలు పెంచిన కేంద్రం, మద్దతు ధర మాత్రం కిలోకి పైసల్లోనే పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎరువుల వ్యాపారులకు లాభం చేకూర్చి రైతుల దివాలా తీయించడమేనని మండిపడ్డారు. వారం రోజులలో పెట్రోల్, డిజిల్ ధరలు నాలుగు సార్లు పెంచినందుకు నిరసనగా మద్దతు ధరల జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈసందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లాకార్యదర్శి పి కొండయ్య మాట్లాడుతూ.. కేంద్రం ఎరువుల ధరలను వందల రూపాయలలో పెంచి పంటల మద్దతు ధర ను కిలో కి పైసల్లో పెంచి రైతుల నడ్డి విరిచిందని విమర్శించారు. ఈ సంవత్సరం ఒక్క మిర్చి కి తప్ప ఏ పంటలకు కనీసం మద్దతు ధర లభించలేదన్నారు. ప్రకటించిన మద్దతు ధరకు ప్రభుత్వం ఏ పంట కొనుగోలు చేయలేదని ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ ,పెట్రోల్ ధరలు పెంచడం వలన వ్యవసాయపు ఖర్చులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు కూడా బాగా పెరిగాయని, ,వంట నూనె ధరలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మద్దతు ధరల జీవో కాపీని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పి ఏడుకొండలు దగ్ధం చేశారు . ఈ కార్యక్రమంలో ఒంటరి నాగేశ్వరరావు , ద్రాక్షారపు శ్రీను, నాగరాజు, వెంకటేశ్వర్లు, ప్రకాష్ ,శివ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రైతుల నిరసన
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 03:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)